వైఎస్సార్ సీపీలోకి వలసల ప్రవాహం

మొదట్నుంచి పశ్చిమగోదావరి జిల్లాలోని కాపు సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి అండగా ఉంది. చిరంజీవి కారణంగా వీరు పార్టీని వీడారు. తిరిగి సొంత పార్టీలోకి వచ్చేయండి.. పార్టీ తలుపులు తెరిచే ఉంటాయంటూ గత నెలలో రైతుపోరుబాటకు వచ్చిన సందర్భంగా చంద్రబాబునాయుడు నరసాపురం సభలో ఇచ్చిన పిలుపు ఇది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేస్తే చిరంజీవిని అనుసరించి కాపు సామాజికవర్గమంతా కాంగ్రెస్‌కు అండగా ఉంటుందని అధికార పార్టీ మెగా మంత్రం వేసింది. బాబు ఎత్తులు.. కాంగ్రెస్ జిత్తులు పటాపంచల్ చేస్తూ జిల్లాలోని ఆ సామాజిక వర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దన్నుగా నిలుస్తోంది. 

ఇప్పటికే ప్రధాన సామాజిక వర్గాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా గత వారం రోజులుగా ఊపందుకున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో జిల్లాలో కాపు సామాజిక వర్గానికి చెందిన కీలకనేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. ఓ వైపు తెలుగుదేశం కాపులను నిర్లక్ష్యం చేయడం.. మరోవైపు చిరంజీవి సొంత సామాజికవర్గ నమ్మకాన్ని ఒమ్ము చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆ సామాజిక వర్గం నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పటికే వంగవీటి రంగాకుమారుడు రాధ గుంటూరులోని ఓదార్పుయాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి మద్దతు పలికారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జక్కంపూడి మోహన్ కూడా వైఎస్సార్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. 

తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో రాజకీయ దురంధరుడిగా పేరొందిన చేగొండి వెంకటహరరామ జోగయ్య (హరిబాబు) సోమవారం నర్సాపురంలో జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. దొడ్డిపట్ల గ్రామ మునసబుగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన జోగయ్య రెండు పర్యాయాలు సమితి ప్రెసిడెంట్‌గా, ఒక పర్యాయం జడ్పీ చైర్మన్‌గా, 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఒక పర్యాయం ఎంపీగా, 3 పర్యాయాలు మంత్రిగా పనిచేశారు. తన రాజకీయ ప్రస్థానంలో ఒకసారి మినహా ఓటమి ఎరుగని రాజకీయ దురంధరుడిగా గుర్తింపు పొందారు. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ విజయం సాధిస్తుందన్న నానుడి జిల్లాలో ప్రచారంలో ఉంది. కాంగ్రెస్, టీడీపీలలో ఉన్న సమయంలో ఆ పార్టీలు అధికారాన్ని చేపట్టాయి. ఒక పర్యాయం బీజేపీ ఎంపీగా యూవీ కృష్ణంరాజుకు మద్దతు పలికి గెలిపించారు. ఈ నేపథ్యంలో జోగయ్య చేరిక ప్రాధాన్యతను సంతరించుకుంది.

మరోవైపు చిరంజీవికి బావమరిది, పాలకొల్లు నుంచి 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన అల్లు వెంకటసత్యనారాయణ ఇప్పటికే గుంటూరు వెళ్లి ఓదార్పుయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పట్టున్న ఏఎంసీ మాజీ చైర్మన్ తోట గోపి ఈనెల 4న నర్సాపురంలో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈ మేరకు సోమవారం జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇలా జిల్లాలోని ప్రధాన కాపు నేతలంతా వందలాదిమంది కార్యకర్తలతో జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ మద్దతును పలకడం విశేషం. ఇప్పటికే జిల్లాలో క్షత్రియ, గౌడ, శెట్టిబలిజ, క్రైస్తవ, మత్స్యకార తదితర అన్ని సామాజిక వర్గాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో గురుతర పాత్రను పోషిస్తుండగా, తాజాగా చేరికలు ఆ పార్టీని మరింత బలోపేతాన్ని చేస్తాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More