ఓ వైపు వశిష్ట గోదావరి.. మరో వైపు సముద్రం...ఈ రెండూ జనపరవళ్ల జోరు ముందు చిన్నబోయాయి. జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రోడ్‌షోలకు తరలివచ్చిన జనప్రవాహంతో తీరం పోటెత్తింది. గ్రామాలు,రహదారులు జనసంద్రాన్ని తలపించాయి. మండే ఎండను సైతం లెక్కచేయకుండా ఉవ్వెత్తున ఎగిసిపడిన జనకెరటాల సాక్షిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత నరసాపురం నియోజకవర్గంలో ఉప ఎన్నికల సమరశంఖం పూరించారు.
‘‘ఈ ఎన్నికల్లో మీరు ఇచ్చే ఓటు ప్రజాకంటక పాలన సాగిస్తున్న రాష్ట్రప్రభుత్వానికి, దాన్ని రిమోట్ కంట్రోల్‌తో నడిపిస్తున్న ఢిల్లీ పెద్దలకు కనువిప్పు కావాలి’’ అంటూ సాగిన యువనేత ప్రసంగాలకు జనం కరతాళధ్వనులతో స్పం దించారు. జననేతకు తమ సమస్యలను, కష్టనష్టాలను చెప్పుకోవడానికి ఎండమండిపోతున్నా..చీకటి పడినా, గంటల తరబడి ఆలస్యమైనా విసుగుచెందకుండా ప్రజలు నిరీక్షించారు. రైతుల,నేతన్నల, వృద్ధుల,వికలాంగుల కష్టాలు తెలుసుకుంటూ, కుష్టు వ్యాధిగ్రస్తుల కన్నీళ్లు తుడుస్తూ.. వారికి నేనున్నానంటూ భరోసా ఇస్తూ.. యువనేత ముందుకుసాగారు.
నరసాపురం/మొగల్తూరు, న్యూస్‌లైన్ : ‘పశ్చిమ’ నుంచే ఓదార్పుకు శ్రీకారం చుట్టిన వైఎస్ జగన్‌మోహనరెడ్డి రాష్ట్రంలో త్వరలో జరగనున్న మలివిడత ఉప ఎన్నికల పోరుకు కూడా ఈ జిల్లా నుంచే సోమవారం సమర భేరి మోగించారు. సామాజికవర్గాలను కలుపుకెళ్లుతూ దేవుడి ఆశీస్సులు పొందుతూ నేతన్నలకు అభయం మిస్తూ .. కుష్టువ్యాధి గ్రస్తులకు ఆప్యాయతను పంచు తూ, అంధుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ.. గీత కార్మికుల రాత మారుస్తానంటూ.. మత్స్యకారుల బతుకు చిత్రం తీర్చిదిద్దుతానంటూ వైఎస్ జగన్‌మోహనరెడ్డి తొలిరోజు పర్యటనలో ముందుకు సాగారు. సోమవారం ఉదయం నరసాపురం పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ చేనేత విభాగం జిల్లా కన్వీనర్ డీఎస్‌ఎస్ ప్రసాదరావు ఇంటి నుం చి జగన్‌మోహనరెడ్డి పర్యటన ప్రారంభించా రు. తొలిరోజున 19 గ్రామాల్లో 35 కిలోమీటర్లు పర్యటించి 5 వైఎస్ విగ్రహాలకు ఆయ న ఆవిష్కరించారు.
దారి పొడవునా అభిమాన జనం అడుగడుగునా అడ్డుకోవడంతో ఆయన పర్యటన 5 గంటల ఆలస్యంగా సాగింది. పలు గ్రామాల్లో అంబేద్కర్, వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసిన ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. పేదవాడి కోసం, రైతుల కోసం పదవీ త్యాగం చేసిన నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజును ఆశీర్వదించి విజయం చేకూర్చాలంటూ ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నరసాపురంలో జిల్లా నలుమూలల నుంచి తరలి వచ్చిన ముఖ్య నేతలు, కార్యకర్తలు, నాయకుల పలుకరింపులతో జగన్‌మోహనరెడ్డి పులకించారు. పర్యటన ప్రారంభంలో పుంతలో ముసలమ్మ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అటుతర్వాత చేనేత కార్మికులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. స్థానిక లూథరన్ చర్చిలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
జగన్ ఈ సారి ముఖ్యమంత్రి హోదాలో తమ చర్చిని సందర్శించాలని మత పెద్దలు ఆయనను ఆశీర్వదించారు. రుస్తుంబాద సెంటర్‌లో కుష్టువ్యాధి గ్రస్తులను కలిసి మాట్లాడారు. ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ నాయకుడు తమ ముఖం చూడలేదని, తమ వద్దకు ఎంతో ప్రేమగా వచ్చిన జగన్‌మోహనరెడ్డిని వారు వేనోళ్లా కొనియాడారు. సీతారాంపురం వంతెన సెంటర్‌లో జరిగిన తొలి సభలో జగన్‌మోహనరెడ్డి శాంతి కపోతాన్ని ఎగురవేసి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రామన్నపాలెం జెండా స్తంభం సెంటర్‌లో అంధుడైన శ్రీను మాట్లాడుతూ ఉచిత విద్యుత్ ఫైల్‌పై తొలి సంతకం చేసి రైతుల గుండెల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి నిలిచిపోయారని, అదే మాదిరిగా అంధులు, వికలాంగుల సంక్షేమం కోసం ఓ పథకాన్ని ప్రారంభిస్తూ, ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేసి తండ్రి అంతటి గొప్ప పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.
అంధుడి విన్నపాన్ని విన్న జగన్‌మోహనరెడ్డి ‘‘శ్రీనూ నీ విజ్ఞాపనను పరిశీలిస్తా.. అందుకు అవసరమైన భరోసా ఇస్తా’’ అంటూ అతనిలో ఆత్మస్థయిర్యాన్ని నింపారు. రామన్నపాలెంలోను, పసలదీవి ప్రాంతంలోను రోడ్డు పక్కన కల్లు తీసి అమ్ముతున్న గీత కార్మికులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎంత ఆదాయం వస్తుంది, ఈ వృత్తితో మీ జీవనం గడుస్తుందా అంటూ ఆయన వారిని ఆప్యాయంగా ఆరా తీశారు. నమ్ముకున్న వృత్తిని వదల్లేక కొనసాగిస్తున్నామని, కుటుంబాలు గడవడమే కష్టంగా ఉందని గీత కార్మికులు బదులిచ్చారు. పిట్టావారిపాలెంలో ఇటీవల మల్లుల పెద్దిరాజు గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన కుటుం బాన్ని జగన్‌మోహనరెడ్డి పరామర్శించారు.
దారి పొడవునా జన నీరాజనాలు
జగన్‌మోహనరెడ్డి పర్యటనలో అడుగడుగునా వృద్ధులు, మహిళలు, యువకులు, రైతులు జననీరాజనాలు పలికారు. అడుగడుగునా అభిమాన జనం అడ్డుకోవడంతో వారిని కలిసి వారి కోసం ప్రసంగించాల్సి వచ్చింది. ఫలితంగా జగన్‌మోహనరెడ్డి పర్యటన ఐదు గంటల ఆల స్యంగా సాగింది. ఆయన పర్యటించిన నరసాపురం, సీతారాంపురం, ఆకెనవారితోట జెండాస్తంభం, పిట్టావారిపేట, రామన్నపాలెం, జెట్టిపాలెం, పసలదీవి, మెట్టిరేవు, కేపీపాలెం ప్రాంతాల్లో వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి ప్రజలను ద్దేశించి మాట్లాడారు. సీతారాం పురం జెండా స్తంభం, కేపీపాలెం నార్త్ సెంటర్‌లలో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం కేపీపాలెం నార్‌తలో అంగజాలపాలెం చేరుకుని, పార్టీ నేత అందే భుజంగరావు ఇంట్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం రాత్రి బస చేశారు.
ఆయన వెంట రోడ్డు షోల్లో తాజా మాజీ ఎమ్మెల్యేలు ముదునూరి ప్రసాదరాజు, తెల్లం బాలరాజు, జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కొయ్యే మోషేన్‌రాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, పాతపాటి సర్రాజు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఇందుకూరి రామకృష్ణంరాజు, మోచర్ల జోహార్‌వతి, ఊదరగొండి చంద్రమౌళి, వేగిరాజు రామకృష్ణంరాజు, చేగొండి వెంకట హరరామజోగయ్య, అల్లు వెంకట సత్యనారాయణ, తోట గోపి, కనకరాజు సూరి, గాదిరాజు నాగరాజు, చేగొండి సూర్యప్రకాష్, అడ్డాల నాగరాజు, జక్కంశెట్టి బ్రదర్స్, కారుమంచి రమేష్, ముచ్చర్ల శ్రీరామ్, డీఎస్‌ఎస్ ప్రసాదరావు, పీడీ రాజు, వద్వాల అచ్యుతరామారావు, పీవీ రమణ, పార్టీ జిల్లా యూత్ కన్వీనర్ కావలి వెంకటరత్నంనాయుడు (నాని), జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ వంగలపూడి ఏషయ్య, జిల్లా పార్టీ పరిశీలకుడు చిర్ల జగ్గిరెడ్డి, జిల్లా మునిసిపల్ ఎన్నికల ఇన్‌చార్జి వరుపుల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
కరెంటు చార్జీల పెంపునకు నిరసనగా నేడు మొగల్తూరులో ధర్నా
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై కరెంటు చార్జీల భారం మోపడాన్ని నిరశిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం మొగల్తూరు కోట సెంటర్‌లోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించనుంది. ధర్నాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహనరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ కొయ్యే మోషేన్‌రాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, తాజా మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు తదితర నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఈ ధర్నా నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.
0 comments:
Post a Comment