వైఎస్ ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ పార్టీవని, సోనియాగాంధీవని జనాన్ని వంచించడానికి ప్రయత్నిస్తూనే

నమ్మక ద్రోహానికీ, నడమంత్రపు అధికారానికీ ఏదో సంబంధం ఉన్నట్టుంది. లేకపోతే ఇంత చేటు ఇబ్బందులు రాష్ట్ర ప్రజలకు వచ్చేవి కాదు. ఈ రాష్ట్ర ప్రజానీకంపై పగబట్టినట్టు ఇప్పటికే నడి వేసవిలో కోతల మీద కోతలు విధిస్తూ నానా కష్టాలూ పెడుతున్న సర్కారు ఏకంగా రూ.4,442 చార్జీల భారాన్ని మోపి వారిని మరిన్ని అగచాట్లలోకి నెట్టేసింది. రెండున్నరేళ్ల క్రితం కేవలం తన రెక్కల కష్టంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వరసగా రెండోసారి అధికారంలోకి తెచ్చిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ఏలికలకు గుర్తున్నారా? ఆయన అప్పుడూ, అంతకు ముందు 2004లో ఇచ్చిన హామీలు గుర్తున్నాయా? గుర్తుండి ఉంటే, చిత్తశుద్ధి ఉంటే వారి ప్రవర్తన ఇలా ఉండదు. ఒకపక్క వైఎస్ ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ పార్టీవని, సోనియాగాంధీవని జనాన్ని వంచించడానికి ప్రయత్నిస్తూనే ఆ హామీలకు తూట్లుపొడుస్తూ ఇలా పెను భారం మోపడాన్ని ఆ పార్టీ పెద్దలూ, ప్రభుత్వ పెద్దలూ ఎలా సమర్ధించుకుంటారు? జనానికి సంజాయిషీ ఇవ్వాలి. ఈసారి రాష్ట్ర ప్రజలపై కోట్ల రూపాయల మేర భారం మోపడం ఒక్కటే కాదు కాంగ్రెస్ సర్కారు చేసింది... రైతన్నకు వ్యవ సాయం కోసం ఇచ్చే ఉచిత విద్యుత్తుకు సైతం గండికొట్టే కుట్రకు తెరలేపింది. అంతేకాదు... పంచాయతీలకు, కుటీర పరిశ్రమలకు సైతం ఇంతక్రితం లేని చార్జీల పెంపును అంటించారు.

అధిక విద్యుత్తు చార్జీలను నిరసిస్తూ జరిగిన ఉద్యమంపై హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో అప్పటి చంద్రబాబు సర్కారు కాల్పులకు తెగించి ముగ్గుర్ని పొట్టనబెట్టుకున్న ఘటన ఈ రాష్ట్ర ప్రజల స్మృతిపథంనుంచి ఇంకా చెరిగిపోలేదు. ఆనాటి జనకంటక సర్కారు దుశ్చర్యకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో పాలుపంచుకోవడమే కాదు.. రాష్ట్ర ప్రజలకు అలాంటి కష్టాలు కలగనివ్వకూడదన్న సత్సంకల్పంతో తాము అధికారంలోకొస్తే అయిదేళ్లపాటు విద్యుత్తు చార్జీలు పెంచబోమని 2004 ఎన్నికల్లో వైఎస్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కాగానే ఆ హామీని త్రికరణ శుద్ధిగా అమలుచేశారు. 2009 ఎన్నికల్లో వైఎస్ చేసిన బాసలు రెండే రెండు.. రైతులకు రోజుకు 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తును అందించడం, మరో అయిదేళ్లపాటు విద్యుత్తు చార్జీలు పెంచకపోవడం. ఆయన హఠాత్తుగా కనుమరుగైన తర్వాత అధికారంలోకొచ్చిన రోశయ్య ప్రభుత్వమైనా, ఆ త ర్వాత వచ్చిన కిరణ్ ప్రభుత్వమైనా ఈ రెండు వాగ్దానాలనూ నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యాయి. 9 గంటల విద్యుత్తును నిరాఘాటంగా అమలు చేయడం మాట అటుంచి, రోజులో ఇచ్చే ఏడు గంటల విద్యుత్తును సైతం చీలికలు, పేలికలు చేసి ఇస్తూ అందులో సైతం గంట కోత పెడుతున్నారు. ఎలాంటి వేళలూ పాటించకుండా చిత్తం వచ్చినట్టు మూడు, నాలుగు విడతలుగా ఇస్తున్న ఆ విద్యుత్తువల్ల ఎందుకూ ఉపయోగం లేకుండా పోతోందని రైతాంగం గగ్గోలు పెడుతోంది.

ఆ గోడు విని అర్థంచేసుకుని సమస్య పరిష్కరించే కోరికా, తీరికా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. విద్యుత్తు చార్జీలు పెంచబోమన్న హామీ పరిస్థితీ డిటోయే. రోశయ్య, కిరణ్ ప్రభుత్వాలకు చార్జీలను పెంచడం కొత్తేమీ కాదు. ఇప్పటికి అయిదుసార్లు ప్రజలపై చార్జీల భారం మోపాయి. కానీ, ఈసారి చార్జీలు పెంచడంలో అపర చాణక్యం దాగివుంది. రైతన్నలు ఏడుగంటలు దాటి ఉపయోగించుకునే విద్యుత్తుకు ప్రతి యూనిట్‌కూ రూ.3.25 వసూలు చేయాలని నిర్ణయించారు. ఎత్తిపోతల కింది రైతులకైతే యూనిట్‌కు రూ.3.50 పిండుతారు. అంటే... ఒకపక్క 9 గంటల విద్యుత్తు ఇచ్చేదిలేదని చెప్పడమేకాక, ఇచ్చే ఉచిత విద్యుత్తుకు సైతం ఎగనామం పెట్టదల్చుకున్నారని స్పష్టమవుతున్నది. ఇది లక్షలాదిమంది రైతన్నలకు నమ్మక ద్రోహం తలపెట్టడమే. ప్రభుత్వ తాజా నిర్ణయంతో సామాన్య ప్రజలకు మాత్రమే కాదు... భారీ పరిశ్రమలకూ, చిన్న పరిశ్రమలకూ, చేతివృత్తులకు పెనుముప్పు ఏర్పడింది.

విద్యుత్తు అవసరాలు రోజురోజుకూ పెరుగుతున్న సంగతి వాస్తవం. అయితే, అందుకు ప్రభుత్వం వద్ద ఉన్న పరిష్కారమేమిటి? దీర్ఘకాలిక అవసరాలను అంచనావేసుకుని విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి వేసిన ప్రణాళికలేమిటి? దివంగత నేత వైఎస్ తన పాలనాకాలంలో డిమాండ్‌కూ, సరఫరాకూ మధ్య అంతరం పెరగకుండా చూశారు. నష్టాల్లో ఉన్న జెన్‌కోకు జవసత్వాలు కల్పించి లాభాలు ఆర్జించేలా తీర్చిదిద్దారు. కేజీ బేసిన్‌లో రిలయన్స్ తవ్వుకుపోతున్న గ్యాస్‌లో మన రాష్ట్రానికి రావలసిన న్యాయమైన వాటాపై చివరివరకూ పోరాడుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడి తొమ్మిది గ్యాస్ ఆధారిత ప్రాజెక్టులకు 2,722 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. కానీ, అవసరమైన గ్యాస్ లభించక అవి 1,500 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతున్నాయి.

ఈ విద్యుత్తు ప్రాజెక్టులకు గ్యాస్ అందజేయడంలో రిలయన్స్ మీనమేషాలు లెక్కిస్తున్నా ఒత్తిడిచేసేవారు లేరు. పైగా ఉత్పత్తి వ్యయానికి అయిదారు రెట్లు లాభం వేసుకుని గ్యాస్ అమ్ముతున్నా దిక్కూ మొక్కూ లేని పరిస్థితి. గ్యాస్ ఉత్పత్తి తగ్గిపోతున్నదంటూ ఆ సంస్థ చెబుతున్నదాంట్లో నిజమెంతో ఆరా తీసేవారుగానీ, ప్రశ్నించేవారుగానీ లేకుండాపోయారు. అపారమైన వనరులు, అత్యున్నతస్థాయి నైపుణ్యం జెన్‌కోకు ఉన్నా వినియోగించుకోలేని దుస్థితి. ఇవన్నీ సరిదిద్దితే విద్యుత్తు చార్జీలను పెంచే అవసరం రాదు సరికదా... వాటిని మరింతగా తగ్గించవచ్చు. కానీ, ప్రభుత్వం వద్ద చార్జీల పెంపు తప్ప మరే పరిష్కారమూ లేనట్టు కనబడుతూనే ఉంది. ఇప్పటికే అటు కేంద్ర ప్రభుత్వమూ, ఇటు రాష్ట్ర ప్రభుత్వమూ వేసిన రకరకాల భారాలతో నడుం విరిగిన ప్రజలను ఈ విద్యుత్తు చార్జీలు మరింత కుంగదీస్తాయి. అధికార కుమ్ములాటల్లో ఆద్యంతమూ కూరుకుపోయిన పాలకులకు ఇవేమీ పట్టడం లేదు. అది రాష్ట్ర ప్రజల ప్రారబ్ధం. 

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More