రైతన్నకు కొండంత అండగా...
2002లో రైతుల ఆత్మహత్యలు, వలసలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్న తరుణంలో రైతులకు భరోసా కల్పించడానికి వైఎస్ అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా దక్షిణ భారతదేశంలోనే అత్యంత తక్కువ వర్షపాతం కలిగిన కూడేరు ప్రాంతాన్ని సందర్శించారు. రైతుల ద్వారా దాదాపు వెయ్యి మీటర్లు సబ్‌స్టేషన్‌లో పడి ఉన్నాయని తెలుసుకున్న వైఎస్ విద్యుత్ కార్యాలయానికి వెళ్లి అక్కడ మీటర్లు ఉన్న గది తాళం పగులగొట్టి తమ తమ మీటర్లను, మోటార్లను తీసుకెళ్లమని రైతులకు చెప్పారు. వైఎస్ ఇచ్చిన ధైర్యంతో వారు ఆనాడు తీసుకెళ్లారు కూడా. రైతుల మేలు కోరి తాను చేసిన పనికి బాధ్యత వహిస్తూ ప్రభుత్వం తీసుకునే చట్టపరమైన ఏ చర్యకైనా తాను సిద్ధమేనని ఒక నోటీసును విద్యుత్ కార్యాలయం గోడకు అంటించి వెళ్లారు. ఆ సందర్భంగా తమ ప్రభుత్వం అధికారంలోకివస్తే విద్యుత్ బకాయిలను రద్దు చేస్తామని, ఉచిత విద్యు త్తును రైతులకు అందజేస్తామని ఆయన ప్రకటించారు.
ప్రజలపై ‘చంద్ర’ కాల్పులు...
ఉచిత విద్యుత్తును అందించడం అసాధ్యమని, నిజంగానే ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు ఆనాడు ఎద్దేవా చేశారు. రైతుల ఆత్మహత్యలను, వలసలను గుర్తించ నిరాకరించిన చంద్రబాబు, రైతులను వారు ఎదుర్కొంటున్న సంక్షోభాల నుంచి గట్టెక్కించడానికి చొరవ చూపని చంద్రబాబు నిజరూపం ఆనాడే ఆ విధంగా బయటపడింది. విద్యుత్ చార్జీల తగ్గింపును డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు హైదరాబాద్‌లో 2000, ఆగస్టు 28న నిర్వహించిన ‘అసెంబ్లీ ముట్టడి’ ర్యాలీపై కాల్పులు జరిపి ముగ్గురు కార్యకర్తలను పొట్టన పెట్టుకుని మాయని అపఖ్యాతిని మూటగట్టుకున్న ‘నేర’చరిత్ర బాబు సొంతం. ప్రపంచ బ్యాంకు ఒత్తిడి మేరకు అమలులోకి వచ్చిన సరళీకృత ఆర్థిక విధానాల మాటున చంద్రబాబు ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడితే... అవే ఆర్థిక విధానాలను ప్రజానుకూలంగా మలుచుకుని వైఎస్ ప్రజలకు మేలు తలపెట్టారు.
పరిశ్రమలకూ సమప్రాధాన్యం...
అనేక గ్రామీణాభివృద్ధి పథకాలు ప్రకటించి తొలిసారి అధికారంలోకి వచ్చిన వైఎస్‌ను ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక సమాఖ్య సమావేశం నిండు మనస్సుతో ఆహ్వానించింది. ఆ సమావేశానికి వైఎస్‌తో పాటు నేటి కేంద్రమంత్రి జయరాం రమేశ్, రాజ్యసభ సభ్యులు సుబ్బిరామిరెడ్డి హాజరయ్యారు. ఆ సందర్భంగా పారిశ్రామికవేత్తల్లో నెలకొని ఉన్న అపోహలు తొలగించడానికి వైఎస్ ఒక విస్పష్టమైన ప్రకటన చేశారు. తన ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి యథాశక్తి సేవలు అందించగలదని, గ్రామీణాభివృద్ధి పథకాలకు, వ్యవసాయ రంగానికి తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాల మూలంగా గ్రామీణ ప్రాంతాల్లో సమగ్రాభివృద్ధి జరిగి ప్రజల కొనుగోలుశక్తి పెరిగి, పారిశ్రామిక ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతుందని వివరించారు. వైఎస్ ఆలోచనా సరళికి ఈ సందర్భం చెరగని గుర్తుగా మిగిలిపోతుంది.
విద్యుత్ రంగానికి వైఎస్ అత్యధిక ప్రాధాన్యమిచ్చి, నిధులను ఆ రంగానికి వెచ్చించిన తీరు విద్యుత్ సంక్షోభ నివారణకు పునాదులు వేసింది. ఆయన పాలించిన ఐదేళ్లలో విద్యుత్ సరఫరాలో నాణ్యతను పెంచడం, లోపాలను తగ్గించడం ట్రాన్స్మీటర్ల పెంపు ద్వారా సాధ్యపడింది. రైతాంగానికి ఐదేళ్ల పాటు విజయవంతంగా ఉచిత విద్యుత్తును ఇవ్వడమేకాకుండా గృహావసరాలకు విద్యుత్తును సరఫరా చేయడంలో కూడా సఫలమయ్యారు. ఆయన పాలించినంత కాలం విద్యుత్ చార్జీలను పెంచలేదు. పెంచాలనే ప్రతిపాదన లను పరిగణనలోకి తీసుకోలేదు. ఉచిత విద్యుత్ పథకం ఏవిధంగానూ ప్రభుత్వానికి గుదిబండగా మారి, ఆర్థిక సంక్షోభానికి దారితీయకుండా ఆయన పరిపాలన సాగించగలిగారు. 2004-05, 2005-06, 2006-07లో తమ ప్రభుత్వం వ్యవసాయ రంగం ప్రయోజనాలను ఆశించి వరుసగా రూ.1,929 కోట్లు, రూ.2,063 కోట్లు, రూ.3,747 కోట్లు సబ్సిడీ కింద వెచ్చించడం తనకు ఎంతో సంతుష్టిని కలిగించిందని, ఆ విధంగా రైతాంగం శ్రేయస్సుకు పాటుపడటం తనకెంతో తృప్తినిచ్చిందని తరచూ వైఎస్ చెప్పేవారు. రాష్ట్రంలో జల విద్యుత్, థర్మల్ విద్యుత్తు ఉత్పత్తిని పెంచేందుకు, కేంద్రం నుండి విద్యుత్తును అధిక మోతాదులో సాధించేందుకు ఆయన ఎనలేని కృషి చేశారు.
ఇది ‘బాబు’ మార్కు పాలన...
విద్యుత్ రంగంలో చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలను తలపించే విధంగా కిరణ్ సర్కార్ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు చేపట్టడం అత్యంత దారుణం. రూ.24 వేల కోట్ల మేర పన్నులను విధించాలని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీఈఆర్సీ) సిఫార్సు చేయగా, కిరణ్ సర్కార్ రూ.30 వేల కోట్ల మేర పన్నులను విధించడం విడ్డూరం. దీనివలన ప్రజలపై అదనంగా రూ.4,434 కోట్ల మేర భారం పడింది. ప్రజల పట్ల బాధ్యత లేకుండా ప్రవర్తించే పాలకుల వల్లే ఇటువంటి దుస్థితి దాపురిస్తుంది. కృష్ణా-గోదావరి బేసిన్‌లోని గ్యాస్ నిక్షేపాలను రాష్ట్ర ప్రయోజనాలు తీర్చిన తరువాతే ఇతర ప్రాంతాలకు తరలించాలని, రాష్ట్ర ప్రజలకు సరసమైన ధరకే గ్యాస్ అందించాలని వైఎస్ జరిపిన స్ఫూర్తిదాయక పోరాటం అనితర సాధ్యం. రిలయన్స్ ఆధిపత్యాన్ని ఢీకొనడం, ప్రజా ప్రయోజనాల కోసం ఆయన తీసుకున్న ఒక సాహసోపేతమైన చర్య. రిలయన్స్‌తో ఆయన జరిపిన రాజీలేని పోరాటం కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలలోని ‘పెద్దల’కు కంటగింపుగా మారిందన్నది మన అనుభవంలో ఉన్నదే. గ్యాస్ ద్వారా రాష్ట్ర విద్యుత్ రంగంలో కొత్త కాంతులను ప్రసరింపజేయవచ్చని భావించినందువల్లనే వైఎస్ అంబానీలతో ప్రత్యక్షంగా పోరుకు సిద్ధపడ్డారు. వైఎస్ మరణానంతరం కృష్ణా-గోదావరి బేసిన్గ్యాస్ నిక్షేపాలకు సంబంధించిన విధివిధానాలను రాష్ట్ర పరిధి నుంచి తప్పించి కేంద్ర పరిధిలోకి బదలాయించుకోవడం ద్వారా సోనియా-మన్మోహన్ ద్వయం తమ ప్రాధాన్యాలేమిటో తెలుగు ప్రజలకు చెప్పకనే చెప్పింది.
రిలయన్స్‌తో కుమ్మక్కు...
తెలుగు ప్రజల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు కృష్ణా-గోదావరి గ్యాస్ నిక్షేపాలను రిలయన్స్‌కు దారాదత్తం చేయడం, పర్యవసానంగా రామోజీరావు వేల కోట్ల మేర ఫలితం పొంద డం జగమెరిగిన సత్యం. ప్రజలకు బాధ్యత వహించని చంద్రబాబు పాలన ఎటువంటి దుష్ఫలితాలకు దారితీసిందీ, ప్రజలకు బాధ్యత వహించిన వైఎస్ పాలన ఎటువంటి సత్ఫలితాలిచ్చిందీ ప్రజలు తమ స్వానుభవం ద్వారా గ్రహించారు. అందుకే తాము ఎటువైపు ఉండాలో తెలుసుకున్నారు.
ఆశయసాధనకే దీక్ష...
రాజకీయసవాళ్లు, సంక్షోభాల నేపథ్యంలో రాజకీయ రంగప్రవేశం చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వల్పకాలంలోనే అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీని తిరస్కరించిన తీరు, సందర్భం రాష్ట్ర చరిత్రలో ఒక మలుపు. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి సంకేతం. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, ప్రజలను పట్టిపీడిస్తున్న సమస్యలను ఎత్తిచూపుతూ ఆయన జరుపుతున్న పర్యటనలు, చేపడుతున్న పోరాటాలు చరిత్రను సృష్టిస్తున్నాయి. ప్రజలు వైఎస్ జగన్‌పై చూపుతున్న ఆదరణ అపూర్వం. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుని చేసిన సందర్భంలో తెలుగు ప్రజలు ఆయన వెంట నడిచారు. ఆయనకు మద్దతు పలికారు. ఆనాడు ఢిల్లీ పెద్దల దిమ్మతిరిగేలా తెలుగు ప్రజలు స్పందించారు.
దాదాపు అదే స్థాయిలో రాష్ట్ర ప్రజలు జగన్ పట్ల స్పందిస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్ ప్రవేశపెట్టిన అనేక అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలను కిరణ్ సర్కార్ అటకెక్కించడాన్ని ప్రజలు ఈసడించుకుంటున్నారు. ప్రజా సమస్యల మీద వైఎస్ జగన్ ఇప్పటికే అనేక ఆందోళనలు నిర్వహించారు. రెండున్నరేళ్లలో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో సైతం పర్యటిస్తూ ప్రజాసమస్యలను అర్థం చేసుకుంటూ ప్రజలకు బాసటగా ఉంటానని చెబుతూ, వారిని ఆందోళన కార్యక్రమాలకు సమీకరిస్తూ ముందుకు సాగుతున్నారు. తాజాగా జగన్ పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో చేపడుతున్న ‘దీక్ష’ రాష్ట్ర విద్యుత్ రంగాన్ని రక్షించే దిశగా వేస్తున్న తొలి అడుగు.
Posted in: special story





0 comments:
Post a Comment