రుణ ప్రణాళిక గుట్టు విప్పిన ఎస్‌ఎల్‌బీసీ లెక్కలు

* లక్ష్యాలు ఘనం.. ఇచ్చేది నామమాత్రం
* 4 లక్షల మంది కౌలురైతులకు సర్కారు మొండిచెయ్యి
* 10% కూడా దాటని గృహ రుణాలు
* చేనేత గ్రూపులకు ఇచ్చింది రూ.కోటే!
* బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకూ అంతంతే

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ప్రకటిస్తున్న రుణ లక్ష్యాలు సర్కారు నిర్లక్ష్యం, బ్యాంకర్ల సహాయ నిరాకరణ వల్ల చాలావరకు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. రుణాలు రాష్ట్ర ప్రజానీకానికి అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయని ఎస్‌ఎల్‌బీసీ లెక్కలే చెపుతున్నాయి. కౌలు రైతులను ఆదుకుంటామని చెప్పిన మాటలూ నీటిమూటలేనని తేలిపోయింది. రాష్ట్రంలో 5,76,147 మందికి కౌలు రైతులుగా గుర్తింపు కార్డులిచ్చిన సర్కారు.. వీరిలో కేవలం 1.9 లక్షల మందికి మాత్రమే రుణాలు ఇచ్చింది. దాదాపు నాలుగు లక్షల మంది కౌలు రైతులకు మొండిచేయి చూపింది. 

కౌలు రైతులకు రుణ సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న వాస్తవాన్ని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) నివేదికే స్పష్టంగా తేల్చిచెప్పింది. ఇదిలావుండగా పట్టణ పేదలకు వడ్డీ సబ్సిడీ పథకం కింద.. గృహ నిర్మాణం కోసం 2011-12 ఆర్థిక సంవత్సరంలో 85,641 మందికి రుణాలివ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందులో రుణాలు మంజూరు చేసింది 14,614 మందికే. ఇందులోనూ సబ్సిడీ క్లెయిమ్ చేసుకున్న వారి సంఖ్య కేవలం 7,980 మాత్రమే. ఇందుకోసం ఇచ్చిన మొత్తం రూ.6 కోట్లలోపే. అంటే 85 వేల మందికి పైగా లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్న గృహ రుణాల్లో చివరకు సబ్సిడీ క్లెయిమ్ చేసుకున్న వారి సంఖ్య 10% కూడా దాటలేదన్న మాట. స్థూలంగా ఇదీ రాష్ట్రంలో రుణ ప్రణాళిక పరిస్థితి. 

ఎస్‌ఎల్‌బీసీ సమావేశాల్లో నిర్దేశిస్తున్న లక్ష్యాలకు, వాస్తవంగా రుణాలు పొందుతున్నవారికీ పొంతన ఉండటం లేదనడానికి ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. బడుగుల, బలహీన వర్గాలకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చే రుణాల మంజూరూ లక్ష్యానికి ఆమడదూరంలోనే ఉంది. ఎస్‌ఎల్‌బీసీ లెక్కల ప్రకారం చూస్తే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిర్దేశించుకున్న లక్ష్యంలో 37 శాతం మందికి మాత్రమే రుణం మంజూరు చేశారు. మొత్తం రూ.134.98 కోట్లతో 34701 మందికి రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, కేవలం 16556 మందికి రూ.50.27 కోట్ల రుణాలను గ్రౌండింగ్ చేయగలిగారు. 

ఇక ఎస్టీలకు రుణాల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. మొత్తం 17502 మందికి రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, అందులో 1.59 శాతం మాత్రమే గ్రౌండింగ్ చేశారు. కేవలం 356 మందికి రూ.84 లక్షల రుణాలను మాత్రమే ఇప్పించగలిగారు. క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ కింద 835 మందికి రుణసౌకర్యం కల్పించాలని పెట్టుకున్న లక్ష్యం కేవలం 79 యూనిట్లకు మాత్రమే పరిమితమైంది. అలాగే స్టెప్ కింద 7,667 మందికి రాజీవ్ యువశక్తి పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలన్న లక్ష్యం 2636 యూనిట్లకే పరిమితమైంది. నిర్దేశించుకున్న లక్ష్యంలో సగం మొత్తాన్ని కూడా రుణంగా ఇవ్వలేకపోయారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా మొత్తం రూ.9084 కోట్ల రుణాలివ్వాలని నిర్దేశించుకోగా, రూ.6710 కోట్లే ఇచ్చినట్లు ఎస్‌ఎల్‌బీసీ లెక్కలే చెపుతున్నాయి. 

రాజీవ్ అభ్యుదయ యోజన పథకం కింద పట్టణ ప్రాంతాల్లోని బీసీలకు రూ.4.15 కోట్ల రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా.. రూ.2.75 కోట్లను మాత్రమే ఇవ్వగలిగారు. ఇక చేతివృత్తుల విషయానికొస్తే వృత్తి కార్మికులకు రూ.121.50 కోట్ల మేర రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకుని రూ.1.50 కోట్లు అంటే కేవలం ఐదు శాతం మాత్రమే రుణాలిచ్చారు. చేనేత గ్రూపులకు అందిన రుణసాయం 3.28 శాతమే. మొత్తం 417 గ్రూపులుంటే అందులో 85 గ్రూపులకు కేవలం రూ.1.02 కోట్లు మాత్రమే రుణాలిప్పించగలిగారంటే రుణ ప్రణాళిక అమలులో ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థమవుతోంది. 

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More