త్వరలోనే సువర్ణయుగం

* అప్పుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు రేకలు నిండుతాయి ప్రజలకు వైఎస్ జగన్ భరోసా
* మద్యం రక్కసి నుంచి తమవారిని రక్షించాలంటూ జగన్‌ను కలిసి మొరపెట్టుకున్న మహిళలు
* వచ్చే సువర్ణయుగంలో అంతా మంచే జరుగుతుందని ధైర్యం చెప్పిన జగన్
* వరుసగా రెండో రోజు చిలకలూరిపేటలో సాగిన ఓదార్పుయాత్ర

గుంటూరు, న్యూస్‌లైన్ ప్రతినిధి: ‘‘మన ప్రభుత్వం త్వరలోనే అధికారంలోకి వస్తుంది. తిరిగి వైఎస్సార్ సువర్ణయుగం వస్తుంది. అందరి కుటుంబాల్లో, ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు రేకలు నిండుతాయి. అందరికీ అంతా మంచే జరుగుతుంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి... సారా భూతం నుంచి తమ భర్తలను, బిడ్డలను రక్షించాలంటూ తనను కలిసిన మహిళలకు భరోసా ఇచ్చారు. గుంటూరు జిల్లా ఓదార్పు యాత్ర 75వ రోజు శనివారం ఆయన చిలకలూరిపేట పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా 30 మందికి పైగా మహిళలు జగన్‌ను కలిసి తమ కన్నీటి వ్యధను వివరించారు. 

‘‘రోజూ ఇళ్లలో నరకయాతన అనుభవిస్తున్నాం. ఎన్టీఆర్ సారా నిషేధిస్తే చంద్రబాబు దాన్ని ఎత్తివేసి మా జీవితాలను పాడు చేశాడు. ప్రస్తుత ప్రభుత్వం బెల్ట్ షాపులను ప్రోత్సహించడంతో ఇళ్లలో మగవాళ్ళు, పిల్లలు కూడా సారాకు బానిసలయ్యారు. మేమందరం మీకే ఓట్లు వేసి గెలిపిస్తామన్నా.. సారాను నిషేధించండన్నా. చిలకలూరిపేటలో ప్రతి ఒక్క మహిళ కోరికా ఇదేనన్నా..’’ అంటూ సుభానీ నగర్ మసీదు సెంటర్‌కు చెందిన షేక్ బషీరున్, నజీరున్నీసా, సమీవున్‌తో పాటు మరో 30 మందిదాకా మహిళలు జగన్‌కు మొరపెట్టుకున్నారు. జగన్ వారి కన్నీరును తుడిచి నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. మరోచోట తమకు పింఛన్లు సరిగా అందడం లేదంటూ కలిసిన మహిళలతో మాట్లాడుతూ.. ‘‘తొందరలోనే మంచి రోజులు వస్తాయి. మన వాళ్ళందరికీ పింఛన్లు తప్పక అందుతాయి.. ప్రతి మహిళ మోములో చిరునవ్వులు తప్పక వస్తాయి’’ అంటూ జగన్ ధైర్యం చెప్పారు.

చిలకలూరిపేటలో ‘జన’హారతులు..
వరుసగా రెండో రోజు శనివారం జగన్ చిలకలూరిపేట పట్టణంలో పర్యటించారు. ఈ సంగతి ముందే తెలియడంతో జనం ఉదయం నుంచీ రోడ్లపై వేచి చూస్తూ కనిపించారు. దీంతో పట్టణంలో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. రోడ్లకు ఇరువైపులా, సెంట్రల్ డివైడర్లపైన కూడా బారులు తీరి ప్రజలు జననేతకు హారతులు పట్టారు. ముస్లిం బజారు, సుభానీనగర్, మద్దినగర్, వడ్డెర కాలనీలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాలను జగన్ ఆవిష్కరించడంతో పాటు పలుచోట్ల ఏర్పాటు చేసిన పార్టీ జెండాలను ఆవిష్కరించారు. వాస్తవానికి పట్టణంలో 17 విగ్రహాలు ఏర్పాటు చేశారు. రెండో రోజు షెడ్యూల్ ప్రకారం 19 ప్రాంతాల్లో యాత్ర నిర్వహించి ఎనిమిది వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించాల్సి ఉన్నప్పటికీ అశేష జనసందోహం, ప్రతి ఒక్కరు జగన్‌ను కలవాలని, తమ సమస్యలను విన్నవించాలని, కరచాలనం చేసి ఆటోగ్రాఫ్‌లను పొందాలని ప్రయత్నించడంతో కాన్వాయ్ ముందుకు కదలడం కష్టతరమైంది. దీంతో ఆయన నాలుగు విగ్రహాలను మాత్రమే ఆవిష్కరించగలిగారు.

ప్రభుత్వానికి మా గోడు పట్టడం లేదు..
‘‘అయ్యా పంచాయతీ కార్యాలయాల్లోనే వెట్టిచాకిరీ చేస్తున్నాం. 20 ఏళ్లకు పైగా గ్రామ పంచాయతీలో పార్ట్‌టైం బిల్లు కలెక్టర్లు, అటెండర్లుగా, ప్లంబర్లుగా, ఎలక్ట్రికల్ హెల్పర్లుగా పని చేస్తున్నాం. మాలో ఏ ఒక్కరికీ మూడు వేలకు మించి రావడం లేదు. ఉద్యోగం పర్మనెంట్ కావడం లేదు. ఈ సర్కారు చుట్టూ ఎన్ని సార్లు తిరిగినా హామీలు గుప్పిస్తున్నారు తప్ప పట్టించుకోవడం లేదన్నా.. మీరు మా పక్షాన నిలిచి పోరాడండన్నా’’ అంటూ గుంటూరు జిల్లా గ్రామ పంచాయతీ పార్ట్‌టైం ఉద్యోగ సంఘం నేతలు జగన్‌కు వినతిపత్రం అందజేశారు. సమస్య పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానంటూ జగన్‌మోహన్‌రెడ్డి వారికి భరోసా ఇచ్చారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More