పన్నులు పెంచితే పెద్దఎత్తున ఆందోళన:బాజిరెడ్డి

పన్నులు పెంచుతామని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రకటించడం ఆయన ఆలోచనా విధానానికి అద్దం పడుతోందని, ప్రభుత్వం కనుక నిజంగా ప్రజలపై భారం వేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బాజిరెడ్డి గోవర్ధన్ హెచ్చరించారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి ప్రజలపై ఎక్కడ వీలుంటే అక్కడ పన్నులు వేయడం దారుణమని విమర్శించారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి కూడా యూపీ ఎన్నికల తరువాత పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతామని నిర్భయంగా ప్రకటించడం శోచనీయమన్నారు. ఓ పక్క రాష్ట్రంలో ప్రజలకు పనికి వచ్చే సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా నీరుగారుస్తూ మరోవైపు ప్రజలపై భారం వేస్తూ పోవడం ఏ తరహా పాలన అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు కూడా తొమ్మిదేళ్ల పాలనలో పూర్తిగా ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ప్రజలపై భారం వేసి వారిని కుంగదీశారని గుర్తు చేశారు.

ప్రజా పథకాలపై శీతకన్ను

ప్రజారోగ్యానికి పనికి వచ్చే 108, 104 పథకాలకు తూట్లు పొడుస్తున్నారని, గృహ నిర్మాణంపై పూర్తిగా శీతకన్ను వేశారని బాజిరెడ్డి విమర్శించారు. పేరుకు మాత్రం రూ.1.45 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రజలపై పెనుభారం మోపుతున్నారన్నారు. ‘వివిధ రంగాల నుంచి భారీ ఎత్తున ఆదాయాన్ని సమకూర్చుకుంటున్న ప్రభుత్వం ఆ డబ్బంతా ఏం చేస్తోంది? ఒక్క మద్యం అమ్మకాల ద్వారానే 200 శాతం రాబడులు పెంచుకున్నారు? పన్నుల ద్వారా మరింత ఆదాయాన్ని సమకూర్చుకున్నారు. ఈ డబ్బంతా ఏమైంది? మంత్రుల జేబుల్లోకి వెళుతోందా? ముఖ్యమంత్రి జేబులోకి వెళుతోందా? లేక మరెవరికైనా ఇస్తున్నారా? అని గోవర్ధన్ నిలదీశారు. ప్రజల సొమ్మును దోచుకున్న ఏ ప్రభుత్వమూ బాగుపడలేదన్నారు. గతంలో చంద్రబాబు విషయంలో కూడా ఇదే జరిగిందన్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి పరిపాలన అచ్చంగా బాబు పాలన మాదిరిగానే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బడ్జెట్‌లో వివిధ రంగాలకు కేటాయించిన డబ్బులో యాభై శాతం కన్నా ఎక్కువ ఖర్చు చేయడం లేదని విమర్శించారు. ఓ పక్క ప్రజలను బాదేస్తూ గొప్పలు చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలని హితవు చెప్పారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More