ఎమ్మార్ కేసులో ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు

విదేశీ సంస్థల భాగస్వామ్యం లేకుండా ప్రాజెక్టులు చేపట్టలేమా?
నిధుల స్వాహాకే ఆ సంస్థలకు భాగస్వామ్యం కల్పిస్తున్నట్లుంది
ఒకప్పుడు అటెండర్ కూడా సొంతిల్లు కట్టుకునేవారు
ఇప్పుడు లక్ష జీతం ఉన్న వ్యక్తికి కూడా అది సాధ్యం కావడం లేదు
ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైంది
ఏజీ తీరుపైనా న్యాయమూర్తి ఆగ్రహం

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘అసలు ఎమ్మార్ డ్రామా మొదలు పెట్టిందెవరు? భూములను అమ్మకానికి పెట్టిందెవరు..? ఏపీఐఐసీ, వుడా, హౌసింగ్ బోర్డ్ లాంటి సంస్థలకు ఆదాయ లక్ష్యాలు నిర్దేశించింది ప్రభుత్వం కాదా..? హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పేదలకు పట్టాలు ఇవ్వకుండా నిషేధం విధించిందెవరు..? ఇలా చేసింది ఎమ్మార్ లాంటి సంస్థలకు సాయం చేయడానికి కాదా..!’ అంటూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ ప్లాట్లను రిజిస్టర్ చేసేటట్లు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఎమ్మార్, బౌల్డర్‌హిల్స్ ప్లాట్ల కొనుగోలుదారుల సంఘాలతో పాటు భరత్ అనే కొనుగోలుదారుడు హైకోర్టులో వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఈ ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వాలు చేపడుతున్న ప్రతీ ప్రాజెక్టులో విదేశీ సంస్థలకు భాగస్వామ్యం కల్పిస్తుండటాన్ని ఆయన తప్పుపట్టారు. విదేశీ సంస్థల భాగస్వామ్యం లేకుండా ప్రాజెక్టులు చేపట్టలేమా? అటువంటి సంస్థలు ఇక్కడ లేవా? అని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. ‘ద్రవ్యోల్బణం పెరిగింది.. ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైంది. ఒకప్పుడు తహశీల్దార్ కార్యాలయంలో అటెండర్ కూడా సొంతిల్లు కట్టుకునేవారు. 

ఇప్పుడు నెలకు లక్ష రూపాయల జీతం వస్తున్న వ్యక్తి కూడా ఇల్లు కొనుక్కునే పరిస్థితులు లేవు. భూములను ఎవరి నుంచి తీసుకుంటున్నారు..? ఆ భూ సేకరణ వల్ల లబ్ధిపొందుతున్నది ఎవరు..? జాయింట్ వెంచర్ పేరుతో ప్రతీ ప్రాజెక్టులో విదేశీ సంస్థలకు భాగస్వామ్యం కల్పిస్తున్నారు. ఇది నిధుల స్వాహాకే కాదా..? ఇక్కడ భవనాలను నిర్మించాలంటే హౌసింగ్ బోర్డులాంటి సంస్థలు ఉన్నాయి. వాటిని ప్రోత్సహించేదెవరు?’ అంటూ జస్టిస్ నరసింహారెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పేదలకు పట్టాలు ఇవ్వకుండా నిషేధం విధించింది ఎమ్మార్ లాంటి సంస్థలకు ప్రయోజనం కల్పించడానికా! అని న్యాయమూర్తి నిలదీశారు.

పొరపాటు జరిగింది.. అడ్వొకేట్ జనరల్: ప్రస్తుతం కొనుగోలు చేసిన వ్యక్తుల మాటేమిటని అడ్వొకేట్ జనరల్‌ను న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంలో పొరపాటు జరిగిందని, దీనిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నామని ఏజీ సమాధానమిచ్చారు. అన్నీ తెలిసే ప్లాట్లు, విల్లాల యజమానులు కొనుగోళ్లు జరిపారని, మార్కెట్ ధర చదరపు గజం రూ.50 వేలు ఉంటే, రూ.5వేలకే కొనుగోలు చేశారని తెలిపారు. ఈ వ్యవహారంలో మొదటి నుంచీ ఎవరెవరి ప్రమేయం ఉందనే విషయాన్ని ఎందుకు పరిశీలించకూడదని న్యాయమూర్తి ప్రశ్నించారు. సుదీర్ఘ వాదనల అనంతరం కేసును వాయిదా వేయాలని ఏజీ కోరడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు మొదలు పెట్టకముందే వాయిదా కోరి ఉండాల్సిందని, ఇంత సేపు వాదనలు విన్నాక వాయిదా కోరడం ఎంత మాత్రం సరికాదన్నారు. కోర్టు సమయాన్ని వృథా చేయడం తగదని హితవు పలికారు. మొత్తం మూడు పిటిషన్లు ఉన్నాయని, అందులో ఒకదానిలో కౌంటర్ దాఖలు చేయాల్సి ఉందని, అందువల్లే వాయిదా కోరుతున్నామని ఏజీ సర్ది చెప్పే ప్రయత్నం చేసినా న్యాయమూర్తి శాంతించలేదు. అన్ని పిటిషన్లను వినాలని ఏపీఐఐసీ న్యాయవాది కోరడంతోనే విచారణ చేపట్టానని, ఇప్పుడు వాయిదా కోరడం అర్థం లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. 15 రోజుల పాటు కేసును వాయిదా వేయాలన్న ఏజీ అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు.. కేసు విచారణను ఓ వారం పాటు వాయిదా వేసి, తదుపరి విచారణ మార్చి 7న చేపడతామని స్పష్టం చేసింది.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More