గతంలో ఎన్నడూలేని విధంగా కరెంటు కోతలు



సర్దుబాటు చార్జీల వడ్డనను అడ్డుకున్నారనే అక్కసు
గతంలో ఎన్నడూలేని విధంగా కరెంటు కోతలు
అదనపు విద్యుత్‌కు అవకాశం ఉన్నా పట్టించుకోని వైనం
తమిళనాడు నుంచి, ఆర్-ఎల్‌ఎన్‌జీ, నాఫ్తా ద్వారా 1,040 మెగావాట్ల అదనపు కరెంటుకు అవకాశం
అదనంగా వెయ్యి మెగావాట్లు చాలంటున్న పరిశ్రమలు
ఆ మేరకు అవకాశమివ్వాలని నెలన్నర కిందటే ట్రాన్స్‌కోకు వినతి
పెడచెవిన పెట్టిన ప్రభుత్వం.. అదనపు విద్యుత్‌కు అవకాశం లేదంటూ తప్పుడు ప్రచారం...
పారిశ్రామికరంగ మనుగడకే ప్రమాదమంటున్న నిపుణులు

హైదరాబాద్, న్యూస్‌లైన్: పరిశ్రమలపై సర్కారు కత్తిగట్టిందా? ఇంధన సర్దుబాటు చార్జీల (ఎఫ్‌ఎస్‌ఏ) వసూలును వ్యతిరేకించినందుకు ‘బుద్ధి’ చెప్పాలని భావిస్తోందా? అదను చూసి దెబ్బ కొట్టాలనుకుంటోందా? గతంలో ఎన్నడూలేని విధంగా ఫిబ్రవరిలోనే ఏకంగా మూడు రోజులపాటు కరెంటు కోతలు విధించడానికి ఇదే కారణమా?.. అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. పరిశ్రమలకు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ కోతలను ప్రభుత్వం అమలుచేస్తోంది. ఇప్పుడే ఇలావుంటే ఏప్రిల్, మే నాటికి కోతలు ఏస్థాయికి చేరుకుంటాయోనని పరిశ్రమలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తమకు అదనంగా కేవలం 1,000 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేస్తే చాలని ఆంధ్రప్రదేశ్ చిన్నతరహా పరిశ్రమల సంఘాల సమాఖ్య (ఫ్యాప్సియా) అం టోంది.

ప్రభుత్వం మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది. అదనపు విద్యుత్‌ను పొందేందుకు అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం అటువైపు కనీసం కన్నెత్తి చూడటం లేదు. పైగా అదనపు విద్యుత్‌కు అవకాశం లేదని తప్పుడు ప్రచారానికి దిగుతోంది. తమిళనాడుతో పాటు రాష్ట్రంలోని వివిధ విద్యుత్ ప్లాంట్ల ద్వారా అదనంగా 1,040 మెగావాట్ల విద్యుత్‌ను కచ్చితంగా పొందేందుకు వీలుంది. ఆర్-ఎల్‌ఎన్‌జీ ద్వారా అదనపు విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఇవ్వాలని నెలన్నర కిందటే ప్రభుత్వానికి ట్రాన్స్‌కో విన్నవించింది. ప్రభుత్వం పట్టించుకోలేదు. సర్దుబాటు చార్జీల వసూలును అడ్డుకున్నామనే కక్షతోనే ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తోందని పరిశ్రమల యాజమాన్యాలు విమర్శిస్తున్నాయి.

ఇదీ ‘సర్దుబాటు’ కథ: 2008-09, 2009-10 సంవత్సరాలకు సంబంధించిన ఇంధన సర్దుబాటు చార్జీల (ఎఫ్‌ఎస్‌ఏ)లను ఫిబ్రవరి నుంచి వసూలు చేసుకునేందుకు ఈఆర్‌సీ అనుమతి ఇచ్చింది. అయితే మూడేళ్లనాటి సర్దుబాటు చార్జీలను వసూలు చేసేందుకు వీలులేదంటూ పలు పరిశ్రమలు హైకోర్టును ఆశ్రయించాయి. హైకోర్టు ఆదేశాలతో సర్దుబాటు వడ్డనకు చుక్కెదురయింది. రూ.3 వేల కోట్ల భారం నుంచి ప్రజలు, పరిశ్రమలకు విముక్తి లభించింది. అయితే పరిశ్రమలు.. ముఖ్యంగా చిన్నతరహా పరిశ్రమలు తనకు వ్యతిరేకంగా వ్యవహరించాయని కోపంతో రగిలిపోతున్న ప్రభుత్వం.. అదను చూసి దెబ్బకొట్టేందుకు సిద్ధమైందని పారిశ్రామికవర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవానికి ఏటా ఏ రంగంలోనైనా విద్యుత్ డిమాండ్ 10 నుంచి 15 శాతం వరకూ పెరుగుతోంది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2012-13) చిన్నతరహా పరిశ్రమలకు విద్యుత్ సరఫరా డిమాండ్ తగ్గుతుందని ఈఆర్‌సీకి ప్రభుత్వం ప్రతిపాదనలు సమర్పించింది. దీనిపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా 2012-13లో చిన్నతరహా పరిశ్రమలకు ప్రతిపాదిత విద్యుత్ చార్జీలు కూడా దేశంలోని మిగిలిన రాష్ట్రాల కంటే అధికంగా ఉండటం కూడా.. ప్రభుత్వం పరిశ్రమలపై కక్ష కట్టిందనడానికి నిదర్శనమనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

అదనపు విద్యుత్‌కు ఇవీ మార్గాలు...
ఊ తమిళనాడులోని కాయంకుళం విద్యుత్ ప్లాంటు నుంచి 200 మెగావాట్లు పొందేందుకు అవకాశం ఉంది. ఆ ప్లాంటు కూడా అదనపు విద్యుత్ ఇచ్చేందుకు సిద్ధమని లేఖ రాసింది.
ఊ కృష్ణా-గోదావరి బేసిన్‌లో గ్యాస్ ఉత్పత్తిని రిలయన్స్ తగ్గించడంతో రాష్ట్రంలోని గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు 50% ప్లాంటు లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్)కు మాత్రమే గ్యాస్ సరఫరా అవుతోంది. ఫలితంగా 1,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. అయితే ఈ ప్లాంట్లకు రీ-లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఆర్-ఎల్‌ఎన్‌జీ)ను ప్రత్యామ్నాయంగా వాడే అవకాశం ఉంది. తద్వారా 300 మెగావాట్ల విద్యుత్‌ను పొందే వీలుంది. ఆర్-ఎల్‌ఎన్‌జీ వినియోగించుకునేందుకు రిలయన్స్ అంగీకరించగా, సరఫరా చేసేందుకు గెయిల్ ముందుకు వచ్చింది. ప్రభుత్వం మాత్రం చొరవ చూపడం లేదు.
ఊ రాష్ట్రంలోని గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో ప్రత్యామ్నాయ ఇంధనమైన నాఫ్తాను కూడా వినియోగించవచ్చు. అందుకు ఆయా విద్యుత్ ప్లాంట్లు సిద్ధంగా ఉన్నాయి. 2009లో విద్యుత్ కొరతను నివారించేందుకు దివంగత వైఎస్ నాఫ్తా ద్వారా అదనపు విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కూడా నాఫ్తాను ఉపయోగించడం ద్వారా అదనంగా 500 మెగావాట్ల విద్యుత్‌ను పొందేందుకు అవకాశం ఉంది.
ఊ విశాఖపట్నం సమీపంలో లిక్విడ్ ఫ్యూయల్ ద్వారా నడిచే ఎల్‌వీఎస్‌కు చెందిన 40 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు కూడా ఉంది. ఈ ప్లాంటుతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఫిక్స్‌డ్ చార్జీలను ప్రభుత్వం చెల్లిస్తోంది. అయితే అదనంగా వేరియబుల్ కాస్ట్‌ను చెల్లించడం ద్వారా ఈ 40 మెగావాట్లను పొందేందుకు వీలుంది. ఇవన్నీ కలిపి మొత్తం మీద 1,040 మెగావాట్ల అదనపు విద్యుత్‌కు అవకాశం ఉందని స్పష్టమవుతోంది. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం అదనపు విద్యుత్‌కు అవకాశం లేదని అడ్డంగా వాదిస్తోంది.

గీతారెడ్డితో నేడు ఫ్యాప్సియా చర్చలు

విద్యుత్ కోతలపై చర్చించేందుకు ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించినట్లు ఫ్యాప్సియా తెలిపింది. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు సచివాలయంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జె. గీతారెడ్డితో తాము సమావేశం కానున్నట్టు ఫ్యాప్సియా అధ్యక్షుడు ఎ.పి.కె.రెడ్డి తెలిపారు. విద్యుత్ కోతల ఎత్తివేతపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించకపోతే బుధవారం నాడే పరిశ్రమల శాఖ కమిషనర్‌ను కలిసి చిన్నతరహా పరిశ్రమల (ఎస్‌ఎస్‌ఊ) సర్టిఫికెట్లను వెనక్కి ఇచ్చివేస్తామని చెప్పారు. విద్యుత్ కోతలను నిరసిస్తూ మార్చి 15 నుంచి నిరవధికంగా పరిశ్రమలను మూసివేస్తామంటూ చిన్నతరహా పరిశ్రమలు కార్మికశాఖకు సోమవారం నోటీసులు అందజేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. 

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More