* వైఎస్ రెండోసారి సీఎం అయ్యాక.. నేతన్నల రుణమాఫీ కోసం రూ. 312 కోట్లు కేటాయించారు
* ఆయన మరణించి రెండేళ్లు గడిచిపోయినా ఆ నిధుల్ని విడుదల చేయలేదీ సర్కారు * ఏడాదిలో ఒక్క ధర్మవరం పట్టణంలోనే 17 మంది నేతన్నల ఆత్మహత్య * వీరి మరణాలకు కారణమేంటని తెలుసుకునే ప్రయత్నమే చేయలేదీ పాలకులు * ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థుల బతుకులతో ఆడుకుంటున్నారు * ఈ దీక్షను జగన్ దీక్షగా చూడొద్దు.. చేనేత కార్మికుల పరిస్థితిని అర్థం చేసుకోవాలని సర్కారును కోరుతున్నా * రుణమాఫీ నిధులు రూ. 312 కోట్లు, ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా.... * తీవ్ర జ్వరంతోనే దీక్ష కొనసాగిస్తున్న జగన్ చేనేత సదస్సులో మాటిచ్చా.. మొన్న నేను చేనేత రంగానికి సంబంధించి ఒక సదస్సులో (రాజమండ్రిలో జరిగిన దేవాంగ మహాసభలు) పాల్గొన్నా. అప్పడు వేదిక మీదకు ఎక్కుతున్నప్పుడు.. నగేశన్న(చేనేత కార్మిక నాయకుడు) నా దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పాడు. ‘అన్నా ఇవాళ మా ధర్మవరంలో ఇద్దరు చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు’ అని చెప్పాడు. ఆ తర్వాత నేను ఆ వేదికపై మాట్లాడుతన్నంతసేపూ ఆ ఇద్దరి ఆత్మహత్యల విషయమే నా బుర్రలో తిరుగుతూ ఉంది. అప్పుడే నేను చెప్పా.. ఇవాళ ఈ రాష్ట్రంలో చేనేత రంగానికి జరుగుతున్న అన్యాయాన్ని, రోజుకు కనీసం రూ.50 కూడా దక్కని దుస్థితిలో చేనేత కార్మికుడు ఉన్నాడన్న సంగతిని పాలకులకు తెలియజెప్పేలా ధర్మవరంలో మూడు రోజులపాటు 48 గంటల నిరాహార దీక్ష చేస్తానని చెప్పా. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పాలకులు ఈ దీక్షతో కళ్లు తెరిచేలా, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఢిల్లీ పెద్దల దిమ్మ తిరిగేలా దీక్ష చేద్దాం. ప్రధానంగా రెండు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ దీక్షలు చేస్తున్నాం. అవి.. 1. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వంద రోజుల్లో చనిపోయారు. ఆయన చనిపోవడానికి ముందు.. ప్రతి చేనేత కార్మికుడు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని చెప్పి రూ.312 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒక్కటే అడుగుతున్నా.. వైఎస్ చనిపోయి రెండు సంవత్సరాలకుపైగానే అవుతా ఉంది.. ఆ రూ. 312 కోట్లను ఇప్పటికీ ఎందుకు విడుదల చేయలేదు అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. మరో రెండు మూడు రోజుల్లో కొత్త బడ్జెట్ ప్రవేశ పెడతారు. అందుకే ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని అనుకుంటున్నా.. ఆ రూ. 312 కోట్లను ఎందుకు ఇవ్వట్లేదు? ఎప్పుడు ఇస్తారు? అని నిలదీస్తున్నా. 2. రెండో ప్రధాన అంశం.. చదువుకోవడానికి ప్రతి పిల్లాడికీ తోడుగా నిలబడాలి అన్న విషయాన్ని మర్చిపోయిన ఈ ప్రభుత్వానికి ఆ అవసరాన్ని గుర్తుచేయడానికి మరోసారి ఈ నిరాహార దీక్ష చేస్తున్నా. పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారీ పాలకులు. పేదరికం పోవాలీ అంటే.. ప్రతి ఇంటి నుంచీ కనీసం ఒక్కరైనా పెద్ద చదువులు చదవాలి.. అలా చదివినప్పుడే ఆ కుటుంబం నుంచి పేదరికం పోతుందని అందరికీ తెలిసి ఉండి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలను పక్కనపెట్టింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ బాధ్యత గుర్తుచేయడానికి, ప్రభుత్వం కళ్లు తెరిపించడానికి 48 గంటలపాటు మూడు రోజుల దీక్ష చేస్తున్నా. |
0 comments:
Post a Comment