కాంగ్రెస్ లిక్కర్ పార్టీగా సీఎల్‌పీ: రోజా

రాష్ట్రంలో మద్యం సిండికేట్లపై ఏసీబీ రూపొందించిన నివేదికను బహిరంగ పర్చి దానిపై న్యాయమూర్తితో విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు ఆర్.కె.రోజా గురువారం పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏసీబీ నివేదికను ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తన బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నార ని ధ్వజమెత్తారు. 

పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రభుత్వంలో తనకు వ్యతిరేకంగా బలంగా ఎదుగుతున్నారని గ్రహించిన కిరణ్ ఆయనను అదుపు చేయడానికే మద్యం సిండికేట్లపై ఏసీబీ విచారణకు ఆదేశించారని ఆమె విమర్శించారు. ఏసీబీ నివేదికను తన గుప్పిట్లో పెట్టుకున్న కిరణ్ తానంటే గిట్టని వారి పేర్లను మాత్రం లీకుల పేరుతో వెల్లడిస్తూ వారిని ఇరకాటంలో పెడుతున్నారని ఆమె దుయ్యబట్టారు. ఏసీబీ నివేదికలో 8 మంది మంత్రులకు, 40 మంది ఎమ్మెల్యేలకు ముడుపులు అందాయనే విషయం వెల్లడవుతోందనీ అందువల్ల సీఎల్‌పిని ‘కాంగ్రెస్ లిక్కర్ పార్టీ’గా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ)ని మద్యాంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీగా వ్యాఖ్యానించాల్సి వస్తోందనీ ఆమె వ్యంగంగా అన్నారు.

సాక్షాత్తూ బొత్స సత్యనారాయణే మద్యం ఊబిలో ఉన్నారు కనుక అలా అనాల్సి వస్తోందన్నారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులతో చాలా గ్రామాల్లో మంచినీరు లభించక జనం అల్లాడుతున్నారనీ ఇలాంటి తరుణంలో వారికి తాగునీరు అందించాల్సింది పోయి మద్యంతో గొంతు తడుపుకోండని ముఖ్యమంత్రి కిరణ్ అదనంగా మద్యం ఉత్పత్తి కోసం 17 జీవోలను జారీ చేశారని రోజా విమర్శించారు. కృష్ణా జిల్లాలో ప్రభుత్వ అసమర్థత వల్ల కల్తీ మద్యం తాగి 18 మంది మరణిస్తే ఈ సంఘటనను సాకుగా చూపుతూ డిమాండ్‌కు సరిపడా మద్యం మార్కెట్‌లో లేనందు వల్లనే మరణాలు జరిగాయనే భాష్యం చెప్పి ఈ జీవోలు జారీ చేశారని ఆమె ధ్వజమెత్తారు. దీనిని బట్టి ఇదెంత నీతిమాలిన, సిగ్గుమాలిన ప్రభుత్వమో అర్థం అవుతోందని ఆమె వ్యాఖ్యానించారు. 

తన పాలనలో సంపూర్ణ మద్య నిషేధాన్ని ఎత్తి వేసి బెల్ట్ షాపులకు శ్రీకారం చుట్టిన టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడుకు అసలు మద్యం గురించి విమర్శలు చేయడం హాస్యాస్పదం అని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు హయాంలో బెల్ట్ షాపులను విచ్చలవిడిగా అనుమతించకుండా ఉంటే ఇపుడు ఈ పరిస్థితి దాపురించి ఉండేదే కాదని ఆమె అన్నారు. మద్యం వల్ల ఎక్కువగా నష్ట పోయేది మహిళామతల్లులే కనుక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏసీబీ నివేదికను బట్టబయలు చేసి అసెంబ్లీలో చర్చకు తావిచ్చి అందరి జాతకాలు తెలిసేలా వ్యవహరించాలని ఆమె డిమాండ్ చేశారు. రాజకీయంగా బ్లాక్‌మెయిల్ చేయడానికి ఉద్దేశించిన ఏసీబీ నివేదిక చివరకు కిరణ్ మెడకే చుట్టుకుంటుందని ఆమె జోస్యం చెప్పారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More