చేనేతలను పట్టించుకోని ప్రభుత్వం: జగన్

ధర్మవరం: చేనేత కార్మికుల సమస్యలను ఈ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 48 గంటలపాటు చేపట్టిన దీక్షని ఆయన ఈ సాయంత్రం విరమించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో తరలివచ్చిన జనవాహినిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. నేతన్నలకు అండగా తనతోపాటు ఉన్న నేతలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నూలు, జరీ, రేషన్, రంగుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చేనేత కార్మికులు తయారు చేసిన చీరల ధరలు మాత్రం కనీస స్థాయిలో పెరగడంలేదన్నారు. వారికి గిట్టుబాటు ధర లభించడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల ఉపాధి దెబ్బతినకుండా ఉండేందుకు 11 రకాల ఉత్పత్తులను చేనేత కార్మికులకు కేటాయించారు. ఆ ఉత్పత్తులను ఇతరులు ఉత్పత్తి చేయకుండా ఈ ప్రభుత్వాలు ఆపలేకపోతున్నాయని తెలిపారు. 

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హయాంలో దాదాపు రెండు వందల మంది చేనేత కార్మికులు ఆర్థిక ఇబ్బందులకు తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోలేదన్నారు. ఆయన హయాంలో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలకు ఆ తరువాత అధికారంలోకి వచ్చిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మేలు చేశారని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి చేనేత కార్మికుని కుటుంబానికి లక్షన్నర రూపాయలు ఇచ్చే విధంగా జీఓ జారీ చేశారని గుర్తు చేశారు. అంతేకాకుండా చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఆ మహానేత అనేక జీఓలు తీసుకువచ్చారని తెలిపారు. ఆర్టిజన్ కార్డు ఉన్న ప్రతి చేనేత కార్మికునికి పావలా వడ్డీపై రుణాలు ఇచ్చేవిధంగా 76 జిఓని తీసుకువచ్చారు. నేత నేసే కార్మికునికి 50 ఏళ్లకే వృద్ధాప్యం వస్తుందని ఆ మహానేత గమనించారు. అందుకే చేనేత కార్మికునికి 50 ఏళ్లకే పెన్షన్ పథకం ప్రవేశపెట్టారు. ఇందు కోసం 278 జిఓని తీసుకువచ్చారు. అలాగే విద్యార్థులకు నాలుగు జతల దుస్తులు ఇవ్వాలని జిఓ 31ని తీసుకువచ్చారని వివరించారు. 

ఆ మహానేత మరణించిన తరువాత ఈ రోజు చేనేత కార్మికుని పట్టించుకునే నాధుడులేడన్నారు. ప్రతి పేద కుటుంబం నుంచి డాక్టర్లు, ఇంజనీర్లు రావాలని ఆ మహానేత ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం ప్రవేశపెట్టారని తెలిపారు. ఇప్పుడు ఆ ఫీజురీయింబర్స్ మెంట్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఫీజులు చెల్లించలేక వరలక్ష్మి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటనని జగన్ గుర్తు చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం ఆధారంగా ఇంజనీరింగ్ కోర్సులో చేరిన విద్యార్థులు ఇప్పుడు ఆ పథకం సక్రమంగా అమలుకాకపోవడంతో అల్లాడిపోతున్నారన్నారు. 

ఎన్టీఆర్ కూడా చేనేత కార్మికులకు మేలు చేసే పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. చేనేత కార్మికుల ఉపాధి కల్పనకు ఆయన జనతా పథకం ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. అయితే ఆయనకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఆ జనతా పథకాన్ని ఎత్తివేసి చేనేత కార్మికులకు ద్రోహం చేశారన్నారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More