జలదీక్ష
యువనేత జగన్ నేతృత్వంలో నిన్న ఢిల్లీ లోని పార్లమెంట్ దగ్గర జంతర్ మంతర్ వద్ద తెలుగు రైతన్నలు తమ గోడు ఢిల్లీ పెద్దలకు వినపడేలా గర్జించారు. కృష్ణా జలాలపై రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై జగన్ తలపెట్టిన జలదీక్ష విజయవంతమైంది. ఈ జలదీక్షకు రాష్ట్రం నలుమూలల నుంచి అనేక మంది రైతులతో పాటు, రాష్ట్రంలోని ప్రముఖులు హాజరై జగన్ కు మద్దతు తెలిపారు. జగన్ రైతన్నల సమస్యలపై ఢిల్లీ పెద్దలకి తెలిసేలా నిన్న ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకు దీక్ష చేపట్టారు. దీక్షలో జగన్ మాట్లాడుతూ కృష్ణా ట్రిబ్యునల్ జలాల విషయంలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని అందులో భాగంగా తమకున కొన్ని డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. అవి ఆలమట్టి ప్రాజెక్ట్ ఇప్పుడున్న దాని కంటే ఎత్తు పెంచవద్దని, కృష్ణా మిగులు జలాలను ఆంధ్ర ప్రదేశ్ వాడుకునేలా చేయాలని, ఎగువనున్న రాష్ట్రాలలోని 100 టిఎంసి సామర్ధ్యం దాటిన ప్రాజెక్టుల నిర్వహణ భాద్యతలను క్యాసి జ్యుడీషియల్ అధికారులున్న ప్రత్యేక రెగ్యులేటరీ అథారిటీలకు అప్పగించాలి, ఈ అథారిటీ 15 రోజులకొకసారి రాష్ట్రాల కేటాయిపులకు అనుగుణంగా తగిన విధంగా నీటిని విడుదల చేయాలని మరికొన్ని డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
జనహృదయ నేత జగన్ మాట్లాడుతూ ఎన్.టి.ఆర్, చంద్రబాబుల హయాంలో ఒక్క ప్రాజెక్ట్ కుడా కట్టలేదని, వారు రైతుల సంక్షేమం గురించి ఏనాడు పట్టించుకోలేదని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్ గారు వచ్చాక రైతన్నకు రాష్ట్రంలో సముచిత స్థానం దక్కిందని అన్నారు. వై.ఎస్.ఆర్ హయంలోనే అనేక ప్రాజెక్టులు చేపట్టామని, కొన్ని పూర్తి చేసామని,మిగిలిన వాటన్నింటిని పూర్తి చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని అన్నారు. ఐతే కేంద్ర ప్రభుత్వానికి తన వాదన వినిపించేందుకు ప్రధాన మంత్రిని కలిసేందుకు ఎన్ని సార్లు ప్రయత్నించిన తనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పారు.
అనేక మంది అభిమానులతో, రైతులతో, నేతలతో బయలు దేరిన జగన్ రైలు నిన్న ఉదయం 10 గంటలకు ఢిల్లీ చేరుకుంది. ఢిల్లీకి చేరుకున్న జగన్ ను ఆహ్వానించేందుకు అక్కడ పెద్ద సంఖ్యలో ప్రముఖులు హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో మీడియా కూడా జగన్ కోసం వేచిచూసింది. అక్కడ నుండి జగన్ డైరెక్ట్ గా దీక్ష వద్దకు వెళ్లి దీక్ష ప్రారంబిచారు. ఈ దీక్షకు కాంగ్రెస్ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి (నెల్లూరు), సబ్బం హరి (అనకాపల్లి)తోపాటు మొత్తం 24 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు, 40 మంది మాజీ ఎమ్మెల్యేలు, 23 జిల్లాలకు చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. 21 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇద్దరు పిఆర్పి ఎమ్మెల్యేలు, ఒక తెదేపా ఎమ్మెల్యే లు ఈ దీక్షలో పాల్గొన్నారు.వీరే కాకుండా మరికొంతమంది ప్రముఖులు అంబటి రాంబాబు, భూమా నాగిరెడ్డి, లక్ష్మీపార్వతి,ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సినీనటి రోజా ఇంకా అనేక మంది దీక్షలో పాల్గొన్నారు.ఈ దీక్షలో మొత్తం 4000 మంది పాల్గొన్నట్లు అంచనా.
దీక్షకు ఇచ్చిన సమయం సాయంత్రం 5 గంటలకు పూర్తవడంతో ఢిల్లీ పోలీసులు దీక్ష విరమించాలని కోరారు, దీక్ష సమయం పొడిగించాలని జగన్ పోలీసులను కోరారు, దీంతో 6 గంటలకు ఒకసారి, తర్వాత 8.30 వరకు సమయం ఇచ్చారు. చివరకు దీక్ష విరమించకపోతే అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పారు.ఐతే ఇక్కడకు వచ్చింది రైతన్నల కోసం అని వారిపై ఒక్క దెబ్బ కూడా పడకూడదని తనే స్వచ్చందంగా జగన్ అరెస్ట్ కు సహకరించారు.ఈ దీక్షపై రాష్ట్ర మీడియానే కాకుండా జాతీయ మీడియా కూడా ఆసక్తి చూపడం విశేషం.