పోలవరం పాదయాత్ర

ప్రతి స్వరం కోరుతున్న...పచ్చని వరం
ప్రాణాలైనా అర్పిస్తాం, పోలవరం సాధిస్తాం... జగన్ వెంటకదిలొచ్చిన జనం
* యువనేతతోపాటే కదం తొక్కిన తూర్పు జిల్లా..
* పశ్చిమలో ఘనస్వాగతం
* పాదయాత్రలో రెండో రోజు 24 కిలోమీటర్లు
* పోలవరం దిశగా వడివడి అడుగులు

హరిత యాత్ర నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: గమ్యం ఇంకా చాలా దూరం. కానీ ఆశయం ముందు ఎంత దూరమైనా చిన్నదే. అందుకే ఒక్క అడుగు వెనక లక్షల అడుగులు పడుతున్నాయి. హరితయాత్ర ఓ చరిత్రాత్మక పోరాటంగా మారుతోంది. తొలిరోజు వేలాది జనం. రెండోరోజు రెట్టింపు జనం కదం కలిపారు. ఆగిపోయిన పోలవరం జలవరం కావాలన్న ఆశయంతో యువనేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన హరితయాత్రలో రెండోరోజు వేలాది గళాలు ఒక్కటయ్యాయి. లక్షలాది కాళ్లు కదం తొక్కాయి. ఒకటే నినాదం. ప్రాణాలైనా అర్పిస్తాం.. పోలవరం సాధిస్తామంటూ రాజమండ్రి రణనినాదంతో హోరెత్తింది. ఉదయం 9.30కు పేరవరంలో మొదలైన పాదయాత్ర.. రాత్రయ్యేసరికి పశ్చిమ గడప తొక్కింది. రెండోరోజు జగన్ 24 కిలోమీటర్ల మేర నడిచారు.

అలసట లేని పయనం..
వడివడిగా పడుతున్న యువనేత అడుగులో అడుగేస్తూ.. అభిమానంతో ఆయనను ఉక్కిరి బిక్కిరి చేస్తూ.. వేలాది అడుగులు పోలవరం కోసం పరుగులు పెడుతున్నాయి. సోమవారం పేరవరంలో బసచేసిన జగన్.. మంగళవారం ఉదయం 9.30 గంటలకు పాదయాత్రకు ఉపక్రమించారు. మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డి, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ అంబటి రాంబాబు, పలువురు నాయకులు వెంట రాగా యువనేత ముందుకు కదిలారు. దారి వెంట పలకరించేందుకు వచ్చిన అవ్వలకు ఆత్మీయంగా చేతులందించారు. హారతులు పట్టేందుకు వచ్చిన మహిళలను ఆప్యాయంగా పలుకరించారు. స్వాగతం చెప్పేందుకు వచ్చిన నేతలు, యువకులను ముందుకు పదండంటూ ఆశయాన్ని గుర్తుచేశారు. సమస్యలు వినిపించేందుకు వచ్చిన వారందరినీ అనునయించారు.

పేరవరం దాటాక కల్లుగీత కార్మికుడు జ్యోతిప్రసాద్ జగన్‌తో కాసేపు తన కష్టనష్టాలు పంచుకున్నారు. గీత కార్మికుల పరిస్థితి ఎలా ఉందంటూ వాకబు చేశారు. రోజుకు ఎంత కల్లు అమ్ముతున్నారు? జీవితం ఎలా సాగుతోందంటూ ఆరా తీశారు. మహానేత ప్రజాప్రస్థానంలో ఆయనతోపాటే పాదయాత్ర చేసిన స్థానికులు కొందరు జగన్‌ను పలుకరించారు. ఆనాటి అనుభవాలు నెమరు వేసుకున్నారు. వైఎస్‌తోపాటే పాదయాత్రలో పాల్గొన్న రాజానగరం విద్యార్థిని సత్యకాంత తన అనుభవాలు నెమరువేసుకుంటూ అన్నయ్యను కలుసుకుంది. నాన్నతో నడిచిన అడుగులను గుర్తుకు తెచ్చుకుంది. ఇంతలో జగన్ బొబ్బర్లంకను సమీపించారు. అక్కడికి మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్‌రావు వచ్చి జగన్‌ను కలిశారు. బొబ్బర్లంకలో మసీదు వద్ద ముస్లిం సోదరులు ఆత్మీయ స్వాగతం పలికారు. నెలల బాబు లతీఫ్‌ను యువనేత ఆత్మీయంగా ముద్దాడారు. అక్కడి నుంచి ధవళేశ్వరం ఆనకట్టపై అడుగుపెట్టారు.

కాటన్ స్ఫూర్తిగా.. వైఎస్ బాటలో..
ధవళేశ్వరం ఆనక ట్ట ఎక్కగానే గుర్తుకొచ్చే పేరు సర్ ఆర్థర్ కాటన్. పాదయాత్ర ధవళేశ్వరం ఆనకట్ట చేరగానే.. ఇలాగే పోలవరంలో గోదావరి పరవళ్లకు అడ్డుకట్ట వేస్తే రాష్ట్రం సస్యశ్యామలమవుతుందన్న ఆలోచన హరిత యాత్రకు అలసట లేకుండా చేసింది. అలా అడుగులు ముందుకు పడుతుండగానే ధవళేశ్వరంలో కాటన్ సెంటర్ రానే వచ్చింది. రాజమండ్రి పుర ప్రజలు ఇక్కడికే తరలివచ్చి బిందెలతో నీళ్లు తెచ్చి హరితయాత్రలో సాగుతున్న వారి పాదాల ముందు పోసి స్వాగతం పలికారు. జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో మహిళలు స్వాగతం పలికేందుకు బారులు తీరారు. మధ్యాహ్నం 12.30కు కాటన్‌కు నివాళులు అర్పించి జగన్ రెండు మాటలు మాట్లాడారు. ఇంతటి ప్రేమానురాగాలు చూపిస్తున్న మీ రుణం ఎలా తీర్చుకోనంటూ ప్రతి ఒక్కరికీ శిరస్సువంచి కృతజ్ఞతలు తెలిపారు. ఒంటి గంటకు భోజన విడిదికి చేరుకున్నారు. భోజనం చేసిన కాసేపటికి మళ్లీ పాదయాత్ర రాజమండ్రి వీధుల మీదుగా ముందుకు సాగింది.

బంతిపూల దారులై..
యువనేత సాగుతున్న రాజమండ్రి రహదారులన్నీ బంతిపూల దారులయ్యాయి. ప్రతి ఒక్కరూ పూలు చల్లి తమ ప్రియమైన నాయకుడికి స్వాగతం పలికేందుకు పోటీపడ్డారు. పాదయాత్రకు జనం రెట్టింపయ్యారు. అలా ధవళేశ్వరం నుంచి రాజమండ్రి రైల్వేస్టేషన్ మీదుగా కోటిపల్లి బస్టాండ్ సెంటర్ వరకు జనప్రవాహం సాగింది. మహిళల సామూహిక హారతుల మధ్య అక్కడి వేదికపైకి చేరుకున్న జగన్ రెండే మాటలు మాట్లాడారు. వారి అనురాగాలకు చేతులెత్తి నమస్కరించి ముందుకు సాగారు. లక్షలాది కాళ్లు కదం తొక్కుతుండగా పాదయాత్ర నాలుగున్నర కిలోమీటర్ల పొడవున్న రోడ్డు కమ్ రైలు వంతెనపైకి చేరింది. దీంతో ఆ వంతెన మరో గోదావరిని తలపించింది. రాత్రి 7.30 అయ్యేసరికి యాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో అడుగుపెట్టింది. మహానేత 2003లో చేపట్టిన ప్రజాప్రస్థానం కూడా ఇదే వంతెనపై సాగుతూ తూర్పుగోదావరిలో అడుగుపెట్టగా.. ఇప్పుడు పోలవరం పాదయాత్ర ఇక్కడి నుంచే పశ్చిమలో అడుగుపెట్టింది.

కొవ్వూరులో ఘనస్వాగతం
మంగళవారం రాత్రి కొవ్వూరుతో పశ్చిమ గోదావరిలో ప్రవేశించిన యాత్రకు ఘనస్వాగతం లభించింది. కొవ్వూరు ఇంకా చేరకముందే వంతెనపై అటువైపు జనం, ఇటువైపు జనం హరితయాత్రకు తోడయ్యారు. గుర్రాలపై కొందరు స్వాగతం పలుకగా, డప్పులు, వాయిద్యాలతో మరికొందరు అభిమాన నేతకు ఆత్మీయ స్వాగతం పలికారు. కొవ్వూరులో అడుగడుగునా జననీరాజనం పలికారు. రాత్రి 10.25కు దొమ్మేరు చేరుకున్న వైఎస్ జగన్ రాత్రికి ఇక్కడే బస చేశారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More