చార్జిషీటు సుప్రీం ధిక్కారమే: సోమయాజులు

ఎఫ్‌ఐఆర్ పూర్తి కాకుండా చార్జిషీటు దాఖలు చేయడమా
హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘జగన్ ఆస్తుల కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటు తప్పుల తడక. అంతేకాదు.. అది సుప్రీంకోర్టు ధిక్కారం కిందకు వస్తుంది, ఎఫ్‌ఐఆర్ పూర్తి కాకుండా చార్జిషీటు ఎలా దాఖలు చేస్తారు? ఈ విషయాన్ని మేం న్యాయస్థానంలో ప్రశ్నిస్తాం’ అని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యుడు డి.ఎ.సోమయాజులు అన్నారు. ఈ కేసు చార్జిషీటులో ఏ1 నిందితుడిగా పేర్కొన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఒక్క సెకనైనా విచారించారా అని సీబీఐని సూటిగా ప్రశ్నించారు. చార్జిషీటులో ఏ ఒక్క మంత్రినీ, అధికారులనూ ప్రస్తావించకపోవడం ఆ సంస్థ పనితనానికి నిదర్శనమని విమర్శించారు. పార్టీ అధికార ప్రతినిధులు జూపూడి ప్రభాకరరావు, వాసిరెడ్డి పద్మలతో కలిసి శనివారమిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీబీఐ వైఖరిని ఎండగట్టారు. ‘జగన్ కేసులో సీబీఐ విజయసాయిరెడ్డిని అరెస్టు చేసింది.

90 రోజుల్లో చార్జిషీటు వేయకపోతే బెయిల్ వస్తుంది. ఆయన్ను జైల్లో కొనసాగించాలనే దుష్ట ఆలోచనతో సీబీఐ హడావుడిగా చార్జిషీటు దాఖలు చేసింది’ అని అన్నారు. కానీ ‘సీఆర్‌పీసీ 167వ సెక్షన్ ప్రకారం తొంభై రోజుల్లో విచారణ పూర్తి చేయాలే కానీ.. చార్జిషీటు ముఖ్యం కాదు. చార్జిషీటు వేయడమనేది విచారణ పూర్తయిందనడానికి ఒక సంకేతం మాత్రమే. కచ్చితంగా అలా చేసి తీరాలని చట్టంలో ఎక్కడా లేదు’ అని తెలిపారు. 

విచారణ ప్రారంభమే కాలేదు!

‘నా లెక్క ప్రకారం ఈ కేసులో విచారణే ప్రారంభం కాలేదు. నిన్న (శుక్రవారం) సుప్రీంకోర్టు సంబంధిత మంత్రులు, అధికారులను ఎఫ్‌ఐఆర్‌లో ఎందుకు చేర్చలేదని ప్రశ్నిస్తూ.. నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులు తమకు అందలేదని సీబీఐ కూడా చెప్పడానికి లేదు. నోటీసులను మంత్రులు, సీబీఐ అధికారులు అందుకున్నారు. ఈ విషయమై వారికి సుప్రీంకోర్టు నెల రోజుల గడువు కూడా ఇచ్చింది. వారు సుప్రీంకోర్టుకు సమాధానమివ్వాల్సి ఉంది. ఎఫ్‌ఐఆరే పూర్తి కానపుడు అసలు దర్యాప్తు ఎలా కొనసాగుతుంది? ఏ రకంగా చార్జిషీటును పూర్తి చేయగలిగారు? ఇది ప్రపంచంలోనే ఒక రికార్డు, దురదృష్టం ఏమిటంటే ఇది కోర్టు ఆదేశాల మేరకు చేపట్టిన విచారణ మాత్రమే తప్ప కోర్డు పర్యవేక్షణలో జరుగుతున్న సీబీఐ విచారణ కానే కాదు, ఈ విచారణ సీబీఐ అధిపతుల (బాసుల) పర్యవేక్షణలో జరుగుతోంది. వారి అధిపతులు అంటే యూపీఏ ప్రభుత్వం. ఢిల్లీలో కూర్చుని వాళ్లేం చెబితే ఆ ప్రకారమే చార్జిషీటును దాఖలు చేస్తున్నారు. వాళ్లు ఎలా ఎఫ్‌ఐఆర్‌ను ఫైల్ చేయమంటే అలా చే స్తున్నారు. ఇంతకంటే హాస్యాస్పదం మరొకటి ఉందా’ అని సోమయాజులు విస్మయం వ్యక్తం చేశారు. ‘మా బాసులు చెప్పారు.. మేం విచారణ జరిపాం... జగన్‌ను అప్రదిష్టపాలు చేశాం. టీవీల్లోనూ, పత్రికల్లోనూ ప్రచారం వచ్చింది. అది చాలు’ అనే విధంగా సీబీఐ అధికారులు వ్యవహరిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. అసలు ఎఫ్‌ఐఆర్‌లో మంత్రులు, అధికారులను చేర్చకుండా చార్జిషీటును ఎలా ఫైల్ చేశారనేదే ఆశ్చర్యకరమైన విషయమన్నారు. ‘ఇది ఒక రకంగా కోర్టు ధిక్కారం అవుతుంది. దీనిని కచ్చితంగా ప్రశ్నిస్తాం, అసలు ఇది ఏ తరహా విచారణ..? ఎందుకిలా సాగుతోంది? ప్రజాప్రయోజనాల వ్యాజ్యం కింద కాంగ్రెస్, టీడీపీ నాయకులు పి.శంకర్రావు, అశోక్ గజపతిరాజు, కె.ఎర్రన్నాయుడు వేసిన కేసులో ప్రధానంగా పేర్కొన్నది 26 జీవోలను. ఈ జీవోల మూలంగానే కొందరికి ఫలితం దక్కింది. అందులో నుంచి కొంత ప్రతిఫలం జగన్‌కు వెళ్లింద ని వారు ఆరోపించారు. వాళ్లు వేసిన రిట్‌లోనే తొలి పది మంది ప్రతివాదుల్లో ఒకటో ప్రతివాది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయితే రెండో ప్రతివాది హోం శాఖ కార్యదర్శి, తదుపరి ఎంతో మంది పేర్లను పేర్కొన్నారు. జగన్ పేరు 52 వ ప్రతివాదిగా మాత్రమే ఉంది. సీబీఐ కోర్టులో చార్జీషీటు వేసేముందు 26 జీవోలకు కారకులైన మంత్రులు, అధికారులను ఎక్కడైనా విచారించారా? ఒక జీవోపై కోర్టులో కేసు వచ్చినపుడు అడ్వొకేట్ జనరల్ హాజరై దానిపై ప్రభుత్వం తరపున వాదిస్తారు. 

అలాంటిది ఏకంగా 26 జీవోలపై ఆరోపణలు వస్తే అడ్వొకేట్ జనరల్ కాదు కదా.. కనీసం ప్రభుత్వం తరపున ఒక్క న్యాయవాది కూడా వెళ్లి వాదించని విచిత్ర పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. గత 56 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదు. ప్రజల ఆస్తులను భారీగా దోపిడీ చేయడానికి అవకాశం కల్పించాయని చెబుతున్న ఆ జీవోలు సక్రమమైనవా? అక్రమమైనవా? అనేది ప్రభుత్వం చెప్పాలి కదా! అడ్వొకేట్ జనరల్ ఈ విషయంలో కనీసం నోటీసులు కూడా తీసుకోలేదు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయని కేసు బహుశా ఇదొక్కటే. ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 26 జీవోలపై కాంగ్రెస్-టీడీపీ ఎమ్మెల్యేలు కలిసి ప్రతివాదులుగా అరడజను మంది కార్యదర్శులను చేరిస్తే ప్రభుత్వం పట్టించుకోలేదు. రాష్ట్ర చరిత్రలో ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి ఎన్నడూ చూడలేదు. జీవోలకు బాధ్యులెవరో సీబీఐ ఎక్కడా చెప్పలేదు. అసలు ఫలం లేని చోట ప్రతిఫలం ఎక్కడి నుంచి వస్తుంది’ అని నిలదీశారు. సీబీఐ కోర్టుకు దాఖలు చేసిన చార్జిషీటులో పేర్కొన్న వ్యక్తులు ఏ ఒక్కరూ ముద్దాయిలు కారని పేర్కొన్నారు. ‘వాస్తవంగా చెప్పాలంటే ఈ కేసులో సెక్రటరీ, చీఫ్ సెక్రటరీలు ముద్దాయిలు, కానీ వారి పేర్లు చార్జిషీటులో లేవు. అలాగని వారిని ముద్దాయిలుగా చేర్చాలని నా అభిప్రాయం కాదు’ అని అన్నారు. సీబీఐ విచారణ మొత్తం తప్పులతడకగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

సీబీఐ తీరును చాలెంజ్ చేస్తాం

తన 34 ఏళ్ల పబ్లిక్ సర్వీస్‌లో ఇంతటి తప్పిదమైన కేసును ఎక్కడా చూడలేదని సోమయాజులు అన్నారు. సీబీఐ ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తోందని, దాని తీరుపై కచ్చితంగా న్యాయస్థానాల్లో చాలెంజ్ చేస్తామని స్పష్టంచేశారు. ‘ఈ రోజు ఒక చార్జిషీటు తర్వాత ఒకటన్నట్టు నాలుగైదు చార్జిషీట్లు వేస్తామని సీబీఐ కోర్టులో చెప్పడమంటే విచారణ ఇంకా పూర్తి కాలేదన్నట్లే కదా! ఈ ప్రభుత్వాలు మొరార్జీ దేశాయ్, లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ వంటి ప్రముఖులను నెలల తరబడి జైల్లో పెట్టాయి. ఆఖరికి ఏ తప్పూ చేయలేదని కోర్టులు తేల్చాయి. ప్రజాస్వామ్యంలో న్యాయం ఈ రోజు కాకపోయినా రేపయినా బయటపడుతుంది’ అని చెప్పారు. జగన్‌ను అరెస్టు చేస్తారా అని ప్రశ్నిం చగా ‘ఏమో నేనెలా చెబుతాను...సీబీఐ వాళ్లు మీకేమైనా సమాచారమిచ్చి ఉంటే చెప్పండి... మీరు కూడా ఎక్కువగా మాట్లాడుతున్నారని, మిమ్మల్ని కూడా వాళ్లు(సీబీఐ) అరెస్టు చేయవచ్చు’ అని సోమయాజులు సమాధానం ఇచ్చారు. 

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More