రాష్ట్రంలో సగం ఇంధన పొదుపు పరికరాలు లేని కనెక్షన్లే ఈ కనెక్షన్లకు బిల్లుల జారీతో బెంబేలెత్తిస్తున్న వైనం అన్నదాతల పేరిట పేరుకుపోతున్న కోట్లాది రూపాయల బకాయిలు.. కొత్త టారిఫ్‌తో మరింత భారం త్వరలో పేద రైతుల్ని బాదేందుకు రంగం సిద్ధం ఏలూరు (పశ్చిమగోదావరి), న్యూస్‌లైన్: ముఖ్యమంత్రిగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన తొలి సంతకంతో అమల్లోకి వచ్చి అన్నదాతలకు ఆలంబనగా నిలిచిన వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకానికి ప్రభుత్వం మంగళం పాడుతోంది. ఎప్పటికప్పుడు కొత్త ఆంక్షలతో ఉచిత విద్యుత్ కనెక్షన్లకు సర్కారు కత్తెర వేస్తోంది. డిమాండ్ సైడ్ మేనేజ్‌మెంట్ (డీఎస్‌ఎం) ప్రమాణాలు (ఇంధన పొదుపు పరికరాలు తప్పనిసరి వినియోగం) పాటించాలనే పేరుతో, అధిక కనెక్షన్ల వంకతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 లక్షల మంది పేద రైతులను ఉచిత విద్యుత్ పథకానికి దూరం చేస్తోంది. బిల్లులు జారీ చేస్తూ బకాయిలు పెంచుకుంటూ పోతోంది. ఉప ఎన్నికలు ఇతరత్రా కారణాలతో ప్రస్తుతానికి చూసీ చూడనట్లు ఊరుకున్నా.. పేరుకుపోయిన కోట్లాది రూపాయల బకాయిలను సర్కారు పేద రైతుల ముక్కుపిండి వసూలు చేయడం ఖాయమనే ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త చార్జీలతో ఈ బకాయిల భారం మరింత పెరిగిపోనుంది. వ్యవసాయ విద్యుత్ వినియోగం లెక్కలు తేల్చేందుకని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టడం వెనుక ఆంతర్యమూ ఇదేనని అంటున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం రాష్ట్ర ప్రభుత్వం అనేక పరిమితులకు లోబడి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తోంది. కొత్తగా తీసుకునే ప్రతి వ్యవసాయ కనెక్షన్‌కు మీటరు ఏర్పాటు తప్పనిసరి చేసింది. అలాగే డీఎస్‌ఎం ప్రమాణాలను పాటించి తీరాలని అంటోంది. విద్యుత్ ఆదా అవుతుందని భావించిన ట్రాన్స్‌కో ఉచిత విద్యుత్‌కు డీఎస్‌ఎంను ముడిపెట్టింది. బోరుకు ఉన్న ఫుట్‌వాల్ ఫ్రిక్షన్ లేకుండా ఉండి, నిర్ణీత రేటింగ్ ఉన్న కెపాసిటర్‌ను వాడుతూ, ఐఎస్‌ఐ గుర్తింపు ఉన్న హెచ్‌డీపీఈ,/ఆర్‌పీడీవీ పైపులు, సబ్‌మెర్సిబుల్/ మోనోబ్లాక్ మోటార్లు ఏర్పాటు చేసిన కనెక్షన్లను డీఎస్‌ఎం ప్రమాణాలకు లోబడి ఉన్నట్లుగా పరిగణిస్తారు. అయితే ఈ ప్రమాణాలన్నీ కలిగి ఉండటం చాలామంది పేద రైతులకు కష్టసాధ్యమైన వ్యవహారం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉచిత విద్యుత్ కనెక్షన్లలో సగానికి పైగా ఈ ప్రమాణాలకు లోబడి లేనివేనని తెలుస్తోంది. దీంతో అధికారులు ఈ కనెక్షన్లకు బిల్లులు జారీ చేస్తున్నారు. ఉచిత విద్యుత్‌ను వాడుకునే పేద రైతులు కేవలం సర్వీస్ ఛార్జీలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. బిల్లుల జారీతో ప్రస్తుతం వీరంతా సర్కారుకు కోట్లాది రూపాయలు బకాయి పడిపోతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాను ఉదాహరణగా తీసుకుని పరిశీలిస్తే...జిల్లాలో 79 వేలకు పైగా ఉన్న వ్యవసాయ కనెక్షన్లలో కేవలం 32 వేల కనెక్షన్లకే ఉచిత విద్యుత్ పరిమితమైంది. జిల్లాలో మొత్తం 79,409 కనెక్షన్లలో 2188 తత్కాల్ కనెక్షన్లను మినహాయిస్తే మిగిలిన 77,221 కనెక్షన్లకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ వాస్తవానికి సర్వీస్ చార్జీలు మాత్రమే చెల్లిస్తూ పూర్తి ఉచితంగా విద్యుత్‌ను వాడుకుంటున్న కనెక్షన్లు కేవలం 32,144 ఉన్నాయి. మిగతా 45,077 కనెక్షన్లకు ఏదో వంకతో బిల్లులు వసూలు చేస్తున్నారు. వీటిలో కేవలం డీఎస్‌ఎం ప్రమాణాలు పాటించడం లేదంటూ చార్జీలు వసూలు చేస్తున్న కనెక్షన్లు 44,646 ఉన్నాయి. అంటే మొత్తం కనెక్షన్లలో సగానికి పైనే. ఈ కనెక్షన్లన్నీ మెట్టప్రాంతంలోని మూడెకరాల లోపు భూమి ఉన్న (ఉచిత విద్యుత్ పొందేందుకు అర్హత) బడుగు రైతులకు చెందినవే కావడం విశేషం. ఈ కనెక్షన్లు కలిగిన రైతుల పేరుతో విద్యుత్ బిల్లులు బకాయిలు ఎప్పటికప్పుడు కొండలా పేరుకుపోతున్నాయి. ఇప్పటివరకు జిల్లాలోని రైతుల నుంచి రూ.6.05 కోట్లు రావల్సి ఉందని చెబుతున్న ట్రాన్స్‌కో అధికారులు వాటి వసూళ్లకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. |





0 comments:
Post a Comment