వైఎస్సార్ సీపీలో చేరనున్నట్టు వంగవీటి రాధాకృష్ణ చేసిన ప్రకటన జిల్లాలో కాపు సామాజిక వర్గంలో కొత్త చైతన్యం నింపింది. అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వకుండా మోసపూరిత వైఖరితో వ్యవహరించడాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఈ సామాజిక వర్గంలోని పలువురు వంగవీటి రాధాను అనుసరించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
విజయవాడ, న్యూస్‌లైన్ ప్రతినిధి : దివంగత వంగవీటి మోహనరంగా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ వారం రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు చేసిన ప్రకటన కాపు సామాజికవర్గంలో ఉత్సాహాన్ని నింపింది. వారు కూడా ఆయన బాటనే అనుసరించాలనే నిర్ణయానికి వస్తున్నట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో ఉన్న జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాధాకృష్ణ శుక్రవారం కలిసి చర్చించిన విషయం విదితమే.
ఆ సామాజిక వర్గాన్ని ప్రభావితం చేయగలిగిన రాధా చేరికపై నగరంలోనూ, జిల్లాలోనూ రాజకీయంగా చర్చ జరిగింది. ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీచేసే అవకాశాలున్నాయి.. ఆ సామాజిక వర్గానికి చెందిన ఇతర పార్టీల నాయకులెవరైనా వైఎస్సార్ సీపీలో చేరతారా.. అనే అంశాలపై పలు ఊహాగానాలు వినపడ్డాయి. అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల్లో ఆ వర్గానికి ఎదురైన చేదు అనుభవాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి.
ఇప్పటివరకు తటస్థంగా...
తమ విషయంలో రెండు ప్రధాన పార్టీల నాయకుల వైఖరితో విసుగెత్తిన కాపు సామాజిక వర్గం నాయకులు పలువురు ఇప్పటివరకు తటస్థంగా ఉన్నారు. పదవులు, పనుల కేటాయింపులో అధికార కాంగ్రెస్ నాయకులు మోసపూరితంగా వ్యవహరించడంతో వీరు పూర్తిగా డీలాపడ్డారు. పార్టీ పటిష్టత, ఇతర కార్యక్రమాలకు పూర్తిగా వాడుకుని, సీట్ల కేటాయిరపులో టీడీపీ వివక్షతో వ్యవహరించడంతో అక్కడా మోసపోయారు. దీంతో రెండు పార్టీల కార్యక్రమాలకూ దూరంగా ఉంటూ ప్రస్తుత రాజకీయాలను ఆసక్తిగా గమనిస్తున్నారు.
పదవుల్లో అన్యాయం...
నగరంలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని కాపు సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులకు ముఖ్య పదవులేవీ లేవు. ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు అనుయాయులుగా ఉంటున్న నాయకులు ఉత్సవ విగ్రహాలుగానే మిగిలిపోయారు. విజయకృష్ణా సూపర్‌బజార్ చైర్మన్‌గా పనిచేసిన అడపా నాగేంద్రంకు ఆ తరువాత ఎలాంటి పదవీ లభించలేదు.
పార్టీ పదవులూ లేవు. నగర మేయరుగా పనిచేసిన ముత్తంశెట్టి రత్నబిందుకు పదవీవిరమణ తరువాత పార్టీలో ప్రాధాన్యత తగ్గింది. పార్టీకి సంబంధించిన ముఖ్య కార్యక్రమాలకు ఆహ్వానాలు ఉండటం లేదని తెలుస్తోంది. మాజీ కార్పొరేటర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ పరిస్థితుల్లో రాధా ప్రకటన ఆ సామాజిక వర్గంలో ఉత్సాహాన్ని నింపింది. రాధా బాటను అనుసరించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, ఇతర పార్టీల సీనియర్ల ఆసక్తి...
కోవూరు ఉప ఎన్నికల ఫలితాల తరువాత వైఎస్సార్ సీపీ వైపు ఈ సామాజికవర్గంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆసక్తి చూపుతున్నారు. ఆ పార్టీలో చేరేందుకు దారులు చూసుకుంటున్నారు. పశ్చిమ కృష్ణాలోని ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు నగరానికి చెందిన ఒక ప్రముఖ ఆడిటర్ ఉత్సాహం చూపుతున్నారు.
అనేక సేవా కార్యక్రమాల ద్వారా పశ్చిమ కృష్ణా ప్రజలకు ఆయన చిరపరిచితులే. రాష్ట్రంలోని 30 పట్టణాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఒక రియల్టరు తూర్పు కృష్ణా నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి ఆయనకు ఆహ్వానం అందినా, అభిమానులు వైఎస్సార్ సీపీలో చేరాలని ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. ఒకటి రెండు నెలల్లో పార్టీలో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల మన్ననలు పొందిన ఆ రియల్టరు మరిన్ని చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.
టీడీపీలో ముఖ్యభూమిక వ హించిన ఇద్దరు నేతలు వైఎస్సార్ సీపీలో చేరేం దుకు సిద్ధంగా ఉన్నారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు అల్లు సత్యనారాయణ జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. కృష్ణాలోనే కాకుండా ఇతర జిల్లాల్లోనూ ఈ సామాజిక వర్గం వైఎస్సార్ సీపీ వైపు ఆసక్తి చూపుతున్నట్టు చేరికలు స్పష్టం చేస్తున్నాయి.
Posted in: news





0 comments:
Post a Comment