నాడు బాబు, నేడు కాంగ్రెస్.. జనానికి షాకులే


చంద్రబాబు, కిరణ్‌లపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపాటు
కరెంటు చార్జీలకు నిరసనగా మొగల్తూరు సబ్‌స్టేషన్ వద్ద జగన్ ధర్నా

చంద్రబాబు తొమ్మిదేళ్లలో 8 సార్లు చార్జీలు పెంచారు
బిల్లులు కట్టకపోతే రైతులను జైల్లో పెడతామని, ప్రత్యేక కోర్టుల్లో విచారిస్తామని జీవోలిచ్చారు
పెంచిన ధరలు దించాలని అడిగినందుకు కాల్చి చంపించేందుకు కూడా వెనుకాడలేదు
రోశయ్య, కిరణ్ రెండేసి సార్లు పెంచేశారు
దివంగత నేత వైఎస్ తన సువర్ణయుగంలో కరెంటు చార్జీలు ఒక్క రూపాయి కూడా పెంచలేదు
పరిశ్రమలకు తక్కువ ధరకే విద్యుత్ అందజేశారు
త్వరలో జరగబోయేవి మినీ ఎన్నికలు
ఈ ఉప ఎన్నికల్లో ప్రజల తీర్పుతో ప్రభుత్వం వచ్చే ఏడాదిలోనే బంగాళాఖాతంలో కలిసిపోతుంది

నరసాపురం నుంచి న్యూస్‌లైన్ ప్రతినిధి: రాష్ట్ర సర్కారు ఎడాపెడా పెంచేసిన కరెంటు చార్జీలతో స్విచ్చులు ముట్టుకుంటేనే షాక్ కొట్టేలా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్ని గంటలు కరెంటు ఇస్తున్నారో, ఎన్ని గంటలు ఉంటుందో అర్థంగాని పరిస్థితి నెలకొందని దుయ్యబట్టారు. పేదవాడి నడ్డివిరిచేలా పెంచిన కరెంటు చార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలోని మొగల్తూరు సబ్‌స్టేషన్ వద్ద జగన్‌మోహన్‌రెడ్డి వేలాది మందితో కలిసి ధర్నా నిర్వహించారు. 

ఈ సందర్భంగా గతంలో ఉన్న పరిస్థితి, ఇప్పటి పరిస్థితులను విశ్లేషిస్తూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దివంగత నేత రాజశేఖరరెడ్డి సువర్ణయుగంలో ఒక్క రూపాయి కూడా కరెంటు చార్జీలను పెంచకపోవడమేగాక పరిశ్రమలకు ఇచ్చే కరెంటును వరుసగా మూడు సంవత్సరాలు తక్కువ ధరకు ఇచ్చారన్నారు. ఆ సమయంలో క్రిసిల్ ఇచ్చిన రేటింగ్‌లో రాష్ట్ర విద్యుత్ బోర్డు ట్రిపుల్ ఏ ర్యాంకు సాధించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పారు. కానీ వైఎస్ తర్వాత గద్దెనెక్కిన రోశయ్య సంవత్సరంలోనే రెండుసార్లు, కిరణ్‌కుమార్‌రెడ్డి సంవత్సరన్నర కాలంలోనే రెండుసార్లు చార్జీలను పెంచారని విమర్శించారు. తొమ్మిదేళ్ల చంద్రబాబు పరిపాలన, వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ పరిపాలన దొందూ దొందేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ చేపట్టిన ఈ ధర్నాలతో అయినా రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలన్నారు.

రైతులను కాల్పించేందుకు చంద్రబాబు వెనుకాడలేదు..

వైఎస్ కన్నా ముందు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు తన తొమ్మిదేళ్ల హయాంలో 8 సార్లు కరెంటు చార్జీలను పెంచారని జగన్ గుర్తుచేశారు. చార్జీలను పెంచడమేకాకుండా వాటిని తగ్గించాలంటూ ధర్నా చేసిన రైతులను కాల్చి చంపించేందుకు కూడా ఆయన వెనుకాడలేదని చెప్పారు. తొమ్మిదేళ్ల పాలనలో ఫలానా రైతుకు ఒక్కటంటే ఒక్క పని చేశానని చెప్పుకునే పరిస్థితి చంద్రబాబుకు లేదన్నారు. కరెంటు బిల్లులు కట్టలేకపోతే రైతులను జైళ్లల్లో పెట్టాలని చంద్రబాబు జీవో నంబరు 89ని విడుదల చేశారని, బిల్లులు కట్టలేని వారిని స్పెషల్ కోర్టులో పెట్టి విచారిస్తామని జీవో నంబరు 60ను జారీ చేశారని పేర్కొన్నారు. అధికారం కోసం చంద్రబాబు నైతిక విలువలను పక్కన పెడుతున్నారని విమర్శించారు. 

త్వరలో జరిగేవి మినీ ఎన్నికలు..

రాష్ట్రంలోని 18 నియోజకవర్గాల్లో త్వరలో జరిగే ఉప ఎన్నికలను మినీ ఎన్నికలుగా జగన్ అభివర్ణించారు. ఈ 18 చోట్లా ప్రజలిచ్చే తీర్పుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం 2014 కన్నా ముందే 2013లోనే అది బంగాళాఖాతంలో కలిసిపోతుందన్నారు. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం వస్తుందని, సువర్ణయుగం ఏర్పడుతుందని, ప్రతి పేదవాడి ముఖాన చిరునవ్వు వస్తుందని తెలిపారు.

కరెంటు సరఫరా ఎలా ఉంటోందమ్మా..?

ధర్నా సందర్భంగా జగన్ పలువురు మహిళలతో మాట్లాడి కరెంటు సరఫరా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకూ కరెంటు తీస్తున్నారని, మళ్లీ మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 4 గంటల వరకూ కట్ చేస్తున్నారని, రాత్రిపూట మరో రెండుమూడు గంటలు కోత పెడుతున్నారని నరసాపురానికి చెందిన బీటెక్ విద్యార్థిని కప్పల ఐశ్వర్య చెప్పారు. మొగల్తూరుకు చెందిన మాసిలంక పావని మాట్లాడుతూ.. ఉదయం నుంచి సాయంత్రం వరకూ తమకు కరెంటే ఉండడం లేదని వాపోయారు. 

జగన్ సమర్థ నాయకుడు: జోగయ్య 

రాష్ట్రంలో ప్రస్తుతం జగన్ తప్ప సమర్థమంతమైన నాయకులు ఇంకెవ్వరూ లేరని ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య చెప్పారు. అసమర్థ నాయకత్వం కింద పనిచేసే కన్నా ఇంట్లో కూర్చోవడం మేలని బయటకు వచ్చేశానని పరోక్షంగా చిరంజీవిని విమర్శించారు. జగన్ సీఎం కావడానికి 2014 దాకా ఆగాల్సిన అవసరం లేదని, ఉప ఎన్నికల తర్వాత ప్రభుత్వం కూలిపోతుందని, అప్పుడు ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని చెప్పారు. ఈ ధర్నా కార్యక్రమంలో నరసాపురం తాజా మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, పార్టీ జిల్లా అధ్యక్షుడు మోషేన్‌రాజు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెరకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు తదితరులు పాల్గొన్నారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More