ఆర్టీసీ ఏసీ బస్సుల్లో అదనపు వడ్డన!


డిమాండ్‌కు అనుగుణంగా వసూలు
10 నుంచి 20 శాతం వరకూ ఎక్కువ

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఎండాకాలంలో ఏసీ బస్సుల్లో చల్లగా ప్రయాణం సాగించే ప్రయాణికులకు చమటలు పట్టించేందుకు ఆర్టీసీ సన్నద్ధమైంది! ఇప్పటివరకు పండుగ రోజులకే పరిమితం చేసిన ‘ప్రత్యేక’ భారాన్ని రద్దీగా ఉండే వారాంతపు రోజుల్లోనూ వడ్డించడానికి రంగం సిద్ధం చేసింది. ఇప్పుడు నడుపుతున్న స్పెషల్ బస్సుల్లో 50 శాతం చార్జీలను అదనంగా బాదుతోంది. ప్రత్యేకంగా నడుపుతున్న బస్సులు తిరుగు ప్రయాణంలో ఖాళీగా వస్తున్నాయని చెబుతూ అదనపు చార్జీలను వడ్డిస్తోంది. ఇకపై ఇదే తరహాలో రద్దీ సమయాల్లో ముఖ్యంగా వారాంతపు రోజులతోపాటు డిమాండ్ ఉన్న వేళల్లో నడిచే సూపర్‌లగ్జరీ, గరుడ, ఇంద్ర, గరుడ ప్లస్ తదితర ఏసీ బస్సుల్లో పది నుంచి 20 శాతం వరకు అదనపు చార్జీలను వసూలు చేయాలని యోచిస్తోంది. దీన్ని దశలవారీగా ఇతర సర్వీసులకు కూడా విస్తరించే అవకాశం ఉంది.

జంటనగరాల నుంచి విజయవాడ, నెల్లూరు, అనంతపురం, ఒంగోలు, ఏలూరు, తిరుపతి, వైజాగ్, షిరిడీ తదితర చోట్లకు వెళ్లే సర్వీసుల్లో సీట్లు వారంతపు రోజుల్లో నిండుతున్నాయి. మిగతా రోజుల్లో ఈ బస్సులు ఖాళీగా తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా చార్జీల్లో వ్యత్యాసాన్ని పాటించడం ద్వారా ఆక్యుపెన్సీ రేషియో(ప్రయాణికుల భర్తీ నిష్పత్తి)ని పెంచుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది. కర్ణాటక తరహాలో రాష్ట్రంలో కూడా డిమాండ్‌ను అనుసరించి చార్జీల్లో హెచ్చుతగ్గులను పాటించనుంది. ఎండలు పెరగటంతో పగటిపూట తిరిగే బస్సులకు ఆదరణ తగ్గినందున వీటి చార్జీల్లో పది శాతం తగ్గించాలని యోచిస్తోంది. అదేసమయంలో రాత్రివేళ డిమాండ్ బాగా ఉన్న రూట్లలో తిరిగే బస్సుల్లో అదనపు వడ్డన చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు పంపింది.

పికప్, డ్రాపింగ్‌కు మినీ బస్సులు!
ప్రస్తుతం కాలనీల నుంచి బయలుదేరుతున్న ప్రయాణికులు ఆర్టీసీ బస్సును అందుకోవాలంటే ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో శివారు కాలనీలకు మినీ బస్సులను తిప్పటం ద్వారా రవాణా సౌకర్యం మెరుగుపడడమేగాకుండా ప్రైవేటు ఆపరేటర్లను కూడా ఎదుర్కోవచ్చని ఆర్టీసీ యాజమాన్యం అంచనా వేస్తోంది. దూర ప్రాంతాలకు రిజర్వ్ చేసుకునే ప్రయాణికులకు మినీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ఆర్టీసీ ఎండీ ప్రసాదరావు తెలిపారు. మరోవైపు.. తిరుపతి-తిరుమల మధ్య 150 ఏసీ మినీ బస్సులను తిప్పేందుకు సన్నాహాలు చేస్తున్న ఆర్టీసీ గురువారం వోల్వో కంపెనీ బస్సును తిరుమల ఘాట్ రోడ్డులో నడిపి పరిశీలించింది.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More