మనోస్థైర్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తోందంటున్న ఐఏఎస్‌లు


బలిపీఠం పై మేమా?


మనోస్థైర్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తోందంటున్న ఐఏఎస్‌లు
జైలుపాలు చేసి చేతులు దులుపుకుంటోందని ఆవేదన
సీబీఐ కూడా అమర్యాదగా వ్యవహరిస్తోందని ఆరోపణ
శ్రీనివాసరెడ్డి బదిలీపై మండిపడుతున్న ఐపీఎస్‌లు
రాజకీయ లబ్ధి కోసం ఏసీబీ దాడులకు కిరణే తెర తీసి.. 
స్వీయ మనుగడ కోసం ఇప్పుడు వేటు వేశారని వ్యాఖ్యలు
నిజాయతీకి ప్రతిఫలమిదేనా అంటూ ఆవేదన

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కిరణ్ సర్కారు వ్యవహార శైలిపై ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ సొంత రాజకీయ అవసరాల కోసం తమను పావులుగా వాడుకుంటోందని, ఆ క్రమంలో ఏ సమస్యలు వచ్చినా ముందుగా తమనే బలిపశువులను చేస్తోందని వారు ఆందోళన చెందుతున్నారు. మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలను తమకు ఆపాదించి నిందితులుగా ముద్ర వేయడం, జైళ్లకు పంపడం, సొంత పార్టీలోని ప్రత్యర్థులపైకి ఉసిగొల్పడం, తర్వాత వారితోనే రాజీ ఫార్ములాలో భాగంగా ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేయడం వంటి చౌకబారు పనులకు పాల్పడుతోందని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ చర్యలు తమ మనోస్థైర్యాన్ని పూర్తిగా దెబ్బతీశాయని, రోజువారీ పాలనపై ఇది తీవ్రమైన ప్రభావం చూపే ఆస్కారముందని వారంటున్నారు. ఎమ్మార్ కేసయినా, వైఎస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడుల అంశమైనా, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో పాటు కొందరు మంత్రుల ప్రమేయముందంటున్న మద్యం సిండికేట్ల కేసు విచారణయినా ప్రతి దాంట్లోనూ తమనే బాధ్యులను చేసి, బలిపశువులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను అమలు చేసినందుకు కొందరిని,రాజకీయ అవసరాల నిమిత్తం మరికొందరిని, సొంత పార్టీలోని ప్రత్యర్థులను దారికి తెచ్చుకునేందుకు ఇంకొందరిని ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తూ పోతోందని సీనియర్ అధికారులు వాపోయారు. ఇంతటి నీచమైన రాజకీయాలను రాష్ట్ర చరిత్రలో ముందెన్నడూ చూడలేదని ఓ ఉన్నతాధికారి అన్నారు. ప్రభుత్వ పెద్దలు తమ సొంత అవసరాలకు సివిల్ సర్వీసు అధికారులను బాధ్యులను చేయడం, ఏకంగా కేసులు పెట్టడం చూస్తుంటే ఆశ్చర్యం, ఆందోళన కలుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

కొత్తకోట బదిలీతో కలకలం

తాజాగా మద్యం సిండికేట్ల వ్యవహారం వెనక డొంకను లాగుతున్న సీనియర్ ఐపీఎస్ అధికారి కొత్తకోట శ్రీనివాసరెడ్డిని అవినీతి నిరోధక శాఖ అదనపు డెరైక్టర్ పదవి నుంచి పూర్తి అప్రాధాన్య శాఖకు అర్ధరాత్రి బదిలీ చేసిన ఉదంతం అధికారుల మనోస్థైర్యాన్ని పూర్తిగా దెబ్బతీసింది. నిజాయితీపరుడైన అధికారిగా పేరున్న శ్రీనివాసరెడ్డికి పేరుకు పదోన్నతి ఇచ్చి అనామక పోస్టింగ్‌తో సరిపెట్టారు. బొత్స కుటుంబానికి బినామీ పేర్లతో మద్యం దుకాణాలున్న విషయాన్ని ఆయన బయటపెట్టారు. వారి పేరిట డీడీలు ఎవరిచ్చారు, వారికి బ్యాంక్ గ్యారంటీ ఎవరి ఖాతాల నుంచి వచ్చింది వంటి వివరాలు సేకరించడానికి ప్రయత్నించిన 24 గంటల్లోపే శ్రీనివాసరెడ్డికి బదిలీ బహుమానం లభించింది. బొత్సతో రాజీలో భాగంగా కిరణే తన రాజకీయ అవసరాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారంటూ ఇంకా ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. కాంగ్రస్ పార్టీలో తనకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న బొత్సకు మద్యం సిండికేట్లతో లావాదేవీలున్నాయని నిగ్గుదేల్చేందుకు ఏసీబీలో ప్రత్యేక విభాగం (సిట్) ఏర్పాటుకు కిరణే అనుమతినిచ్చారు. విచారణ వేగం పుంజుకోవడం, కిరణ్ తనను టార్గెట్ చేసి వేధిస్తున్నారని పార్టీ అధిష్టానానికి బొత్స ఫిర్యాదు చేయడంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా శ్రీనివాసరెడ్డిపై బదిలీ వేటు పడింది. ఆయన్ను ఏమాత్రం ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేయడం ఐపీఎస్ అధికారులకు ఆగ్రహం తెప్పించింది. శ్రీనివాసరెడ్డిపై వేటును ఏసీబీ చీఫ్ భూపతిబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. తనను కూడా ఏసీబీ నుంచి తప్పించాలంటూ ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికే ఆయన లేఖ రాయడం పెను సంచలనం సృష్టించింది.

మంత్రిమండలి నిర్ణయాలను అంటగడుతున్నారు

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, లేదా ప్రజా ప్రయోజనార్థం మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాల విషయంలోనూ ప్రభుత్వం అంటీముట్టనట్టు వ్యవహరిస్తుండటంపై ఐఏఎస్‌ల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. జగన్ కేసులో విచారణ పేరిట సీబీఐ తమను రోజుల తరబడి పిలిచి విచారించడం, తామేదో తప్పు చేశామన్నట్టుగా మీడియాలో కథనాలు రావడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ‘‘నా సర్వీసులో ఏనాడూ చిన్న తప్పిదం చేయలేదు. మంత్రిమండలి నిర్ణయాలకు సంబంధించి నేను జారీ చేసిన జీవోలు బిజినెస్ రూల్స్‌కు లోబడే ఉన్నాయని నిబంధనలను ఉటంకిస్తూ సీబీఐ విచారణాధికారికి వివరించాను. అయినా నాతో ఏదో చెప్పించాలన్న ఉద్దేశంతో నన్ను రోజుల తరబడి పిలిచారు. నేను బిజినెస్ రూల్స్‌కు లోబడి పని చేసినప్పుడు ఎవరి ఒత్తిడితోనో పనేముంటుందని ప్రశ్నించా’ అని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. మంత్రివర్గం నిర్ణయాలకు మంత్రులను బాధ్యులను చేయాలే తప్ప తమను కాదని సీబీఐకి చెప్పినా లాభం లేకపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఏదైనా కంపెనీ వల్ల ఉద్యోగాలొచ్చే అవకాశముందని భావిస్తే స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశమై రాయితీలివ్వడంపై నిర్ణయం తీసుకుంటుంది. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన కంపెనీలకు ఆ విధంగానే రాయితీలిచ్చాం. ఎస్‌ఐపీబీ నిర్ణయాలను కూడా విచారణాధికారికి చూపించా. అయినా వారి నుంచి స్పందన లేదు. అన్నీ సక్రమంగా జరిగాయని వివరించిన తరవాత కూడా, ‘ఎవరైనా ఒత్తిడి తెచ్చారా?’ అంటూ ప్రశ్నించిన తీరుకు నాలో నేను నవ్వుకున్నా. ఇంతకు మించి మాట్లాడి ప్రయోజనం లేదు’’ అంటూ విశ్రాంత ఐఏఎస్ అధికారి ఒకరు సీబీఐ విచారణ తీరుతెన్నులను కళ్లకు కట్టారు. మంత్రిమండలి ఓ నిర్ణయం తీసుకున్నాక అది ప్రభుత్వానికి సంబంధించినదవుతుందని, దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆయనన్నారు. రాజ్యాంగంలోనూ దీన్ని స్పష్టంగా పేర్కొన్నారని గుర్తు చేశారు.

మా భుజాల మీదుగా జగన్‌కు గురి పెడతారా?
జగన్ కేసులో తమను కావాలని టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారని ఐఏఎస్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. మంత్రివర్గ నిర్ణయాలను అమలు చేసిన తమకు అండగా నిలవాల్సింది పోయి, తమపై కేసులు పెట్టేలా సీబీఐని ఉసిగొల్పుతున్నారని ఓ అధికారి ఆరోపించారు. ‘‘దేనికైనా సమయం రావాలి. ఈ ప్రభుత్వం భండారాన్ని అప్పుడు బయటపెడతా. రాజకీయ ప్రయోజనాల కోసం మాపై విమర్శలు గుప్పిస్తున్న చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో మాపై ఎలాంటి ఒత్తిడి తెచ్చిందీ ఓసారి గుర్తుకు తెచ్చుకొమ్మనండి. ఐఎంజీ కేసులో బాబు నన్ను ఇంటికి పిలిచి మరీ నోట్ ఫైల్ రాయించుకున్నారు. ఇప్పుడేమో మేం దొంగలం, ఆయన ఆణిముత్యం’’ అంటూ విశ్రాంత ఐఏఎస్ అధికారి ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటి నిర్ణయాల్లో భాగస్వాములైన మంత్రులను వదిలి జగన్‌ను, అధికారులనే టార్గెట్ చేస్తున్న తీరు సుప్రీంకోర్టు దృష్టికి కూడా వెళ్లడం, మంత్రులకు నోటీసులిచ్చేందుకు దారి తీయడం తెలిసిందే. చివరికిప్పుడు కిరణ్ తన మనుగడ కోసం బొత్సను కాపాడే క్రమంలో తమనే టార్గెట్ చేసి వేధించడం దారుణమని ఐపీఎస్ అధికారి ఒకరు ఆక్షేపించారు. ‘‘బొత్ప కాంగ్రెస్‌లో ఉన్నారు గనక, మద్యం సిండికేట్ల వ్యవహారంలో ఆయన పాత్ర బయటపడితే పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంది గనక రాత్రికి రాత్రే దర్యాప్తు అధికారిని మార్చేస్తారా? కాంగ్రెస్ నేతల తప్పులను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తే అధికారులను బలి పశువులను చేస్తారా? మంత్రివర్గం ఆమోదం తెలిపిన నిర్ణయాలను కూడా వారి రాజకీయ అవసరాల కోసం మాకు చుట్టి ఇబ్బందుల పాలు చేస్తారా? దీన్ని ఆటవిక న్యాయమని గాక మరేమంటారు?’’ అని సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు ప్రశ్నించారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More