ఎకరా రూ. 4 కోట్లు విలువజేసే భూమిని కేవలం ఎకరా రూ. 29 లక్షలకే 535 ఎకరాలను ఎమ్మార్‌కు కట్టబెడితే తప్పు కాదా?
రహేజాకు 110, ఎల్ అండ్ టీకి 110, ఐఎంజీకి 830 ఎకరాలు కట్టబెట్టలేదా?
నేను భారతి సిమెంట్స్ సంస్థ కోసం ఎకరాకు రూ.3.5 లక్షలు ఇచ్చి కొన్నా..
సీఎం కిరణ్ ఎకరా రూ. లక్షకే ప్రిజమ్ సిమెంట్స్‌కు వెయ్యి ఎకరాలివ్వలేదా?
వెనుకబడిన మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలో రెండు కంపెనీలకు దివంగత నేత వైఎస్ ఒక్కో కంపెనీకి 75 ఎకరాలు ఇస్తే తప్పయిందా?
పరిశ్రమలు వస్తే నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందని అనుకోవడమే తప్పా?.. దివంగత మహానేతపై ఎందుకీ బురదజల్లుడు?
ఇతర రాష్ట్రాలు భూములు ఇవ్వడం లేదా..?
ఇవాళ నేను పొద్దున్నే పేపర్‌లో చదివా.. సీబీఐ నా మీద చార్జిషీట్ ఫైల్ చేసింది అని విన్నా.. దాంట్లో మొట్టమొదటి ముద్దాయిని నేనే అని కూడా విన్నా. ఇవాళ ఒక్క విషయం మీ ద్వారా సీబీఐకి, ఈ రాజకీయ పార్టీలకు చెప్పదలుచుకున్నా.. ఆయ్యా..! ఆ దివంగత నేత రాజశేఖరరెడ్డిగారు వెనుకబడిన మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలో 75 ఎకరాలు ఒకరికి, 75 ఎకరాలు ఒకరికి చొప్పున ఇస్తే.. అక్కడ ఒక ఫార్మసూటికల్ కంపెనీ వచ్చి ఒక పరిశ్రమ పెడితే, అక్కడ కొన్ని వందలు, వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. పరిశ్రమల కోసం రాష్ట్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గుజరాత్ వెళ్లి అడిగితే భూమి ఉచితంగా ఇస్తారు.. తమిళనాడుకు వెళ్లి అడిగినా తక్కువ ధరకే ఇస్తారు. ఎకరాకు రూ.15 లక్షల ధర నిర్ణయిస్తే రూ.7 లక్షలకే ఇచ్చారని తప్పుగా మాట్లాడుతున్నారే.. అలాగైతే పక్క రాష్ట్రాల్లో ఉచితంగానే భూములు ఇస్తున్నారు.. మరి అదెంత తప్పు అవుతుందో ఇక్కసారి ఆలోచన చేయాలని కోరుతున్నా!
బాబు కట్టబెట్టిన భూముల సంగతేమిటి..?
దివంగత వైఎస్ నిరుద్యోగులకు ఉపాధి చూపేందుకు మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో భూములిస్తే... రూ.15 లక్షల భూమిని రూ.7 లక్షలకే కట్టబెట్టారని ఇవాళ చార్జిషీట్‌లో నా పేరు పెట్టారు. నేను సీబీఐని ఒక్కమాట అడుగుతున్నా. అయ్యా.. మీరు ఎమ్మార్ కేసు మీద విచారణ చేస్తున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఎకరా రూ.4 కోట్ల విలువైన 535 ఎకరాలను ఈ చంద్రబాబు ఎకరాకు కేవలం రూ.29 లక్షలకే ఎమ్మార్‌కు కట్టబెట్టారు. మీకు ఈ అవినీతి కనిపించడం లేదా అని సీబీఐని అడుగుతున్నా. ఇదే చంద్రబాబు నగరం నడిబొడ్డున ఐఏంజీకి 830 ఎకరాలను ఇచ్చారు. రహేజాకు 110 ఎకరాలు, ఎల్‌అండ్‌టీకి 110 ఎకరాల చొప్పున ధారాదత్తం చేశారు. ఎకరం రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్లు పలుకుతున్న ఈ భూములను శనక్కాయలు అమ్మినట్టుగా అమ్మినప్పుడు అది తప్పు కాదా..? దివంగత నేత వైఎస్సార్ మాత్రం ఎక్కడో వెనుకబడిన జిల్లాలు మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో 75 ఎకరాలు ఒక పరిశ్రమ పెట్టడానికి, 75 ఎకరాలు మరో పరిశ్రమ పెట్టడానికి ఇస్తే తప్పా? చనిపోయిన ఆ మహానేత మీద ఆరోపణలు చేయడానికి సిగ్గుగా లేదా అని అడుగుతున్నా.
మీరు ప్రిజమ్‌కు వెయ్యి ఎకరాలు ఇవ్వలేదా?
కిరణ్‌కుమార్‌రెడ్డిగారూ.. మీరే కదయ్యా.. వైఎస్ చనిపోయిన తర్వాత ప్రిజమ్ సిమెంట్స్ అనే కంపెనీకి వెయ్యి ఎకరాల భూమిని ఎకరాకు రూ.లక్షకే ఇచ్చారు. నేను భారతి సిమెంట్స్ అనే సంస్థను పెట్టా. అక్కడ ఎకరాకు రూ.3.50 లక్షలు ఇచ్చి కొనుగోలు చేశా.. మరి ప్రిజమ్ సిమెంట్స్‌కు ఎకరాకు రూ.లక్ష చొప్పున వెయ్యి ఎకరాలు ఇవ్వడం అవినీతి కింద కనబడటం లేదా అని సీఎం గారిని అడుగుతున్నా. మీరు చేస్తేనేమో మంచి.. అదే వేరొకరు చేస్తేనేమో అవినీతా..? ఇలాంటి దారుణమైన రాజకీయాలు దయ ఉంచి ఇప్పటికైనా మానండయ్యా! ఇవాళ ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను చిరునవ్వుతో ఉన్నానంటే.. దానికి ఒకే ఒక కారణం. ఆ కారణం ఏమిటంటే.. ఆ దివంగత నేత వైఎస్సార్ గారు నన్ను, నా తల్లిని మా ఇద్దరిని ఒంటరిని చేసి పోలేదనే ఒకే ఒక్క విశ్వాసం.. నమ్మకం! అందువల్లే నేను చిరునవ్వుతో ఉండగలుగుతున్నానని గర్వంగా చెప్పగలుగుతున్నా.
పిల్లల చదువులు పట్టవా..?
పేద విద్యార్థుల చదువులను ఈ సర్కారు గాలికొదిలేసింది. పిల్లలు ఇంజనీరింగ్.. డాక్టర్.. ఇంకా పెద్దపెద్ద చదువులు చదువుతున్నారు. పరీక్షలు దగ్గర పడ్డాయి. వారు పరీక్షలు రాయాలంటే కాలేజీ యాజమాన్యాలు హాల్‌టికెట్లు ఇవ్వాలి. ఫీజులు కడితే తప్ప హాల్ టికెట్లు ఇవ్వబోమనే పరిస్థితుల్లో కాలేజీ యాజమాన్యాలున్నాయి. అలాంటప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలకు రూ.30 వేలు, డాక్టర్ చదవితే పిల్లాడికైతే రూ.55 వేలకు పై చిలుకు కావాలి. ఇప్పుడా పిల్లలు తల్లిదండ్రుల దగ్గరకు పోయి అమ్మా.. ప్రభుత్వం ఫీజులు కడుతుందో.. కట్టదో తెలియని పరిస్థితులున్నాయి. ఫీజు కడితేనే కాలేజీ యాజమాన్యం హాల్ టికెట్ ఇస్తానంటోంది. నాకు డబ్బు తెచ్చి ఇవ్వమ్మా.. అని పిల్లలు అడిగితే ఆ తల్లిదండ్రులు అంత డబ్బు ఎక్కడ్నుంచి తెస్తారని ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా.
సుచరితమ్మకు మీ ఆశీస్సులు కావాలి...
పదవి పోతుందని తెలియగానే విలువలు ఉన్న ఎమ్మెల్యేలు తప్ప మిగతా ఎమ్మెల్యేలంతా పేదవాడి పక్కన నిలబడేందుకు భయపడతారు. రైతులకు తోడుగా నిలబడానికి నాలుగుసార్లు ఆలోచన చేస్తారు. ఇక్కడ మాత్రం తమ పదవులు పోతాయి అన్న సంగతి తెలిసి ఉన్నా.. ప్రతి పేదవాడి పక్షాన నిలబడటానికి, ప్రతి రైతన్నకు అండగా ఉండేందుకు, ఈ రాజకీయ వ్యవస్థలో విలువలు తీసుకువచ్చేందుకు అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపిన నా చెల్లి, మీ ఎమ్మెల్యే సుచరితమ్మను చూసి నేను గర్వపడుతున్నాను. త్వరలో ఇక్కడ ఉప ఎన్నికలు వస్తాయి. మీ అందరి చల్లని దీవెనలు... మీ అందరి చల్లని ఆశీస్సులు సుచరితమ్మపై సంపూర్ణంగా మనస్ఫూర్తిగా ఇవ్వాలని సవినయంగా చేతులు జోడించి ప్రార్థిస్తున్నా.





0 comments:
Post a Comment