అధికార పక్షంతో పోరాటమని తెలిసీ ఎమ్మెల్యే పదవులు వదులుకున్న 17 మందినీ చూసి గర్వపడుతున్నా.

- రైతులు, పేదల కోసం పదవులు వదులుకున్న 17 మందిని ఆశీర్వదించండి
- నరసాపురం బహిరంగ సభలో ప్రజలకు వైఎస్ జగన్ విజ్ఞప్తి
- అధికార పక్షంతో పోరాటమని తెలిసీ ఎమ్మెల్యే పదవులు వదులుకున్న 17 మందినీ చూసి గర్వపడుతున్నా
- కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోదని ధైర్యం వచ్చాకే చంద్రబాబు అవిశ్వాసం పెట్టారు
- జగన్ వెంట ఐదారుగురు ఎమ్మెల్యేలకు మించి ఉండరని అనుకున్నారు
- ఎమ్మెల్యేలను నయానో, భయానో లొంగదీసుకోవడానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు 


నరసాపురం నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రతినిధి: రైతుల కోసం అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసి తమ ఎమ్మెల్యే పదవులను సైతం త్యాగం చేసిన ఆ 17 మందినీ చూసి గర్వపడుతున్నానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతల కోసం నిలబడిన ఆ 17 మందికీ ప్రజల చల్లని దీవెనలు, ఆశీస్సులు మనస్ఫూర్తిగా ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో బుధవారం వేలాది మందితో జరిగిన బహిరంగ సభలో జగన్ ఉద్వేగంగా మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. జగన్ చెప్పిన ఆ 17 మందిలో నరసాపురం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎం.ప్రసాదరాజు ఒకరు. త్వరలో ఉప ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జగన్ నరసాపురం నియోజకవర్గంలో మూడు రోజులుగా రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. బుధవారం సభతో ఇక్కడ పర్యటన ముగించుకుని తూర్పుగోదావరి పర్యటనకు వెళ్లారు. నరసాపురం సభలో జగన్ ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..

సోనియాకు చెప్పినా వినలేదు..
జీవితంలో ఎప్పడైనా ఏదైనా చేయాలనుకున్నప్పుడు రెండు దార్లు కనిపిస్తాయి. ఇచ్చిన మాట నుంచి వెనక్కు రాలేనప్పుడు నాకు ఆ రెండు దార్లు కనిపించాయి. అప్పుడు దివంగత మహానేత రాజశేఖరరెడ్డి చనిపోయి20 రోజులు కూడా కాలేదనుకుంటా. మహానేత మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన ప్రతి కుటుంబాన్నీ పరామర్శిస్తానని నాడు నల్లకాలువ సభలో మాటిచ్చాను. దేవుడు నా నోట ఎందుకు ఆ మాట పలికించాడోగానీ.. ఆ మాట ఇచ్చినందుకు నేను గర్వపడుతున్నా. ఆ మాట నుంచి వెనక్కి తగ్గాలని సాక్షాత్తూ సోనియా గాంధీయే అడిగారు. నేను, నా తల్లి ఢిల్లీ వెళ్లి ఆమెను ఒప్పించే ప్రయత్నం చేసినా వినలేదు. 

ఆ సమయంలో నాకు రెండోదారి కనిపించింది. ఆ సమయంలో బుర్ర చెప్పినట్టు కాకుండా గుండె చెప్పినట్లు చేశా. అది రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లేనని చాలామంది చెప్పారు. రాజకీయాల్లో మాట ఇచ్చి వెనక్కి తగ్గడాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. మీ నాన్న నియోజకవర్గంలో 30 సంవత్సరాలు హస్తం గుర్తుకు ప్రచారం చేశారని, చంద్రబాబు 30 ఏళ్లు సైకిల్ గుర్తుతో ఉన్నారని, అలాంటి సమయంలో 14 రోజుల్లో కొత్త గుర్తుతో ప్రజల్లోకి ఎలా వెళతావని ప్రశ్నించారు. అయినా మాట తప్పలేకపోయాను. గుండె చెప్పినట్లే నడుచుకున్నా.

చిరువిలీనమయ్యాకే బాబు అవిశ్వాసం పెట్టారు
చంద్రబాబు రాజకీయ దురుద్దేశంతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. జగన్ ఎప్పుడూ విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడతాడు.. ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఏం చెబుతాడో చూద్దామని అనుకున్నారు. లక్ష ఎకరాల్లో పంటలు బీడులుగా మారిపోయి రైతులు క్రాప్ హాలిడే ప్రకటించినప్పుడుగానీ, రంగారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థిని ఫీజులు చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్నప్పుడుగానీ బాబుకు ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి బంగాళాఖాతంలో కలపాలని అనిపించలేదు.

చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేశాక.. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోదనే ధైర్యం వచ్చిన తర్వాత.. చంద్రబాబు కాంగ్రెస్ పెద్దలకు సైగ చేశారు. ఈ సమయంలో కాంగ్రెస్ పెద్దలు ఎమ్మెల్యేలకు అధికారం ఇస్తామని, కాంట్రాక్టులిస్తామని, పదవులిస్తామని మభ్యపెట్టారు. ఈ పరిస్థితుల్లో అవిశ్వాసం పెడితే జగన్‌ను రాజకీయంగా దెబ్బ తీయొచ్చని చంద్రబాబు రాజకీయం చేశారు. జగన్ వెంట నలుగురైదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారని వాళ్లనుకున్నారు.

వారిని చూసి గర్వపడుతున్నా..
ఆ సమయంలో మొన్నటివరకూ నర్సాపురం ఎమ్మెల్యేగా ఉన్న ప్రసాద్ నా వద్దకు వచ్చారు. చంద్రబాబు ఏ ఉద్దేశంతో అవిశ్వాస తీర్మానం పెట్టినా ప్రజలు మనవైపు చూస్తున్నారని, ప్రతి రైతు, ప్రతి పేదవాడు మనవైపు చూస్తున్నాడని నేను చెప్పాను. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో విలువలు, విశ్వసనీయత తిరిగి తీసుకొద్దామని చెప్పాను. 17 మంది ఎమ్మెల్యేలకూ ఇదే విషయాన్ని చెప్పాను. 

రాజశేఖరరెడ్డి కలల పథకాలను పూర్తిగా నీరుగార్చిన ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని వారికి చెప్పాను. మామూలుగా అయితే ఏ ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా పదవి మధ్యలో రాజీనామా చేయాలంటే ఒకటికి రెండుసార్లు కాదు పదిసార్లు ఆలోచిస్తారు. అధికార పక్షంతో పోరాటం అని తెలిసి కూడా నా మాటకు గౌరవం ఇచ్చి పదవులు వదులుకున్న వారిని చూసి గర్వపడుతున్నా. 

నేటి నుంచి ‘తూర్పు’న జగన్ పర్యటన
రాజమండ్రి, న్యూస్‌లైన్:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం నుంచి మూడు రోజులపాటు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో పర్యటిస్తారు. పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, రాష్ట్ర ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ ఈ విషయాన్ని విలేకరులకు తెలిపారు. నరసాపురం నియోజకవర్గంలో పర్యటన ముగించుకున్న జగన్ గురువారం నుంచి కె.గంగవరం, రామచంద్రపురం రూరల్, రామచంద్రపురం టౌన్, కాజులూరు మండలాల్లో పర్యటిస్తారని, ఈ నెల ఏడో తేదీ వరకు రోడ్‌షోలు నిర్వహిస్తారని చెప్పారు. ఈ పర్యటనలో ఆయన వెంట మాజీ మంత్రి, రామచంద్రపురం పార్టీ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉంటారని తెలిపారు.

నరసాపురంలో జనహోరు
నరసాపురం స్టీమర్ రోడ్డులో జరిగిన బహిరంగ సభకు జనం తండోపతండాలుగా తరలిరావడంతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారిపోయింది. మూడువైపులా రోడ్లు కిక్కిరిసిపోయి కనిపించాయి. మేడలు, మిద్దెలు, హోర్డింగ్‌లపైకి ఎక్కి జనం జగన్‌మోహన్ రెడ్డి ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. ఆయన ఉద్వేగంగా ప్రసంగించడంతో ఈలలు, చప్పట్లు, కేకలతో నరసాపురాన్ని మారుమోగించారు. 

ఈ సభతోమూడు రోజులుగా ఆ నియోజకవర్గంలో జరుగుతున్న రోడ్ షో ముగిసింది. షెడ్యూల్ ప్రకారం 45 గ్రామాల్లో పర్యటించాల్సి వున్నా అడుగడుగునా జన తాకిడితో కేవలం 14 గ్రామాల్లో మాత్రమే రోడ్‌షో జరిగింది. నరసాపురం సభకుముందు మొగల్తూరు మండలంలోని ముత్యాలపల్లి, వారతిప్ప, కొత్తాట, కాళీపట్నం తూర్పు, పడమర, పాతపాడు గ్రామాల్లో జననేత నిర్వహించిన రోడ్‌షోకు అడుగడుగునా ఆదరణ లభించింది.

జగన్‌కు, చిరుకు యోజనాల తేడా ఉంది
నరసాపురం సభలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య మాట్లాడుతూ చిరంజీవిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ మెగా రాజకీయ హీరో అని కితాబిచ్చారు. తాను నిన్నటి నుంచి జగన్‌తో తిరుగుతున్నానని, మొన్నటి వరకూ ఒక సినిమా హీరోతో పనిచేశానని, ఇద్దరి మధ్య యోజనాల తేడా ఉందని చెప్పారు.

చిరంజీవి నాలుగు రోజులు ప్రచారం చేస్తే నాలుగు రోజులూ పడుకునేవారని, కానీ జగన్ నిరంతరంగా తిరుగుతూనే ఉన్నారని చెప్పారు. చిరంజీవి వ్యానులో ఎవరికీ కరచాలనం కూడా ఇవ్వకుండా ముందుకెళ్లేవారని, కానీ జగన్ ఎవరు కనపడినా ఆగి కరచాలనం చేసి, మాట్లాడుతున్నారని, జననేత అంటే ఈయనేనని అన్నారు. ఒక సినిమా హీరో దగ్గర పనిచేసే కన్నా ఒక రాజకీయ హీరో దగ్గర పనిచేయడం తనకు గర్వకారణంగా ఉందన్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి పలువురు నేతలు
ముత్యాలపల్లిలో తాడేపల్లిగూడేనికి చెందిన పీఆర్పీ నేత తోట గోపి.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పెద్దఎత్తున కార్లతో తరలివచ్చిన ఆయన అనుచరులను ఉద్దేశించి జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇక నుంచి తాడేపల్లిగూడెం నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిగా గోపీని నియమిస్తున్నట్లు ప్రకటించారు. సాయంత్రం నర్సాపురం బహిరంగ సభలో రెడ్డి అండ్ రెడ్డి మోటార్స్ షోరూం అధినేత, పారిశ్రామిక వేత్త గొలుగూరి శ్రీరామరెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. భీమవరం, నర్సాపురానికి చెందిన పలువురు టీడీపీ, కాంగ్రెస్ నాయకులు కూడా పార్టీలో చేరారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More