మిర్చి కిలో 24 .. టమాటా కిలో 22

* హైదరాబాద్‌లో మిర్చి కిలో 24 .. టమాటా కిలో 22 
* ఇప్పటికే చుక్కల్లో బెండ, బీర, చిక్కుడు, కాకర ధరలు 
* కరువు, కరెంటు కోతలతో పడిపోయిన సాగు విస్తీర్ణం
* ఎండల మండుతుండటంతో ఎండిపోతున్న పంటలు 
* కరెంటు కోతలతో నీరులేక పడిపోతున్న దిగుబడులు 
* రైతుల నుంచి నేరుగా కొంటున్న బడా ప్రైవేట్ మాల్స్ 
* మార్కెట్ డిమాండ్‌కు - సరఫరాకు తీవ్ర అంతరం 
* పట్టపగ్గాల్లేని ధరలు... పత్తాలేని మార్కెటింగ్ శాఖ 
* కూర‘గాయాల’తో సామాన్యుడు విలవిల

హైదరాబాద్, న్యూస్‌లైన్: కూరగాయల ధరల ఘాటు సామాన్యుడి వంటింట్లో మంట పుట్టిస్తోంది. ఎండలకు పోటీగా కాయగూరల ధరలూ మండుతున్నాయి. అన్ని రకాల కూరగాయల ధరలు జనవరి నుంచి పెరగటమే కానీ తగ్గటంలేదు. కూరల్లో నిత్యావసర వస్తువైన పచ్చిమిర్చి ధర రోజు రోజుకూ ఘాటెక్కుతోంది. టమాటా ధర కూడా అదే బాటలో పయనిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ రిటైల్ మార్కెట్లో పచ్చిమిర్చి ధర కిలో రూ. 24 గా ఉంటే.. టమాటా కిలో రూ. 22 వెచ్చించాల్సి వస్తోంది. టమాటా తిరుపతిలో రూ. 26, విజయవాడలో రూ. 28 పలుకుతోంది. మొన్నటివరకు కిలో రూ. 14 కి లభించిన మిర్చి, రూ. 10 కి లభించిన టమాటా ధరలు ఐదు రోజుల్లోనే రూ. రెట్టింపుకన్నా ఎక్కువ ధరకు పెరిగిపోయాయి. 

గత నెల రోజులుగా బెండ, బీర, చిక్కుడు, ఫ్రెంచ్ బీన్స్, కాకర వంటి కూరగాయల ధరలు ఆకాశంలో విహరిస్తున్నా.. టమాటా, మిర్చి ధరలు మాత్రం కాస్త అందుబాటులో ఉండేవి. ఇప్పుడు అన్నింటి ధరలు ఆకాశం వైపే చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. కూరల్లో ప్రధాన వస్తువులైన టమాటా, మిర్చి ధరలు పైపైకి ఎగబాకుతుండటంతో వినియోగదారులు విలవిల్లాడిపోతున్నారు. డిమాండుకు సరిపడా కూరగాయలు మార్కెట్‌కు రాకపోవడం వల్లే ధరలు పెరుగుతున్నాయి. అయితే.. బహిరంగ మార్కెట్‌లో కన్నా రైతుబజార్‌లో ధరలు రూ. 2 నుంచి రూ. 4 వరకూ తక్కువగా ఉండటం గుడ్డిలో మెల్లగా కనిపిస్తోంది. 

కరువు, ‘కోత’లతో తగ్గిన సాగు... 
కరువుకు తోడు కరెంటు కోతల కారణంగా డిసెంబరు తర్వాత రైతులు కూరగాయల పంటలు వేయటం తగ్గించారు. గత ఏడాది రబీలో నాలుగు లక్షల ఎకరాల్లో కూరగాయల పంటలు వేయగా ఈ ఏడాది కరువు వల్ల ఆ విస్తీర్ణం 3.25 లక్షల ఎకరాలకు పడిపోయింది. వేసిన కొద్ది పంటలు సైతం మండుతున్న ఎండలకు ఎండిపోతున్నాయి. కరెంటు కోతలతో ఉన్న పంటలకూ సరిగా నీరుపారకపోవటంతో దిగుబడి బాగా తగ్గిపోతోంది. ఫలితంగా సగటు ఉత్పత్తి తగ్గి డిమాండ్‌కు సరిపడా కూరగాయలు మార్కెట్‌కు రావటంలేదు.

హైదరాబాద్ నగరాన్నే తీసుకుంటే రోజుకు 600 టన్నుల టమాటా అవసరం కాగా ఇప్పుడు 400 టన్నులు మాత్రమే వస్తోంది. మిర్చి కూడా 250 టన్నులు కావాల్సి ఉండగా 175 టన్నులు మాత్రమే సరఫరా అవుతోంది. అన్ని వర్గాల వారు నిత్యం వినియోగించే ఈ రెండు రకాల కూరగాయల కొరత.. ధరల పెరుగుదలకు కారణమైందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. కర్నూలు, గుంటూరు జిల్లాల నుంచి హైదరాబాద్ నగరానికి తగినంత పచ్చిమిర్చి సరఫరా కావటంలేదు. స్థానికంగా టమాటా సాగు కూడా చివరి దశకు చేరటంతో డి మాండ్ - సరఫరాలకు మధ్య అంతరం ఏర్పడింది. ఈ రెండు రకాల కూరగాయల సరఫరా సుమారు 30 శాతం మేర తగ్గటంతో దీన్నే అవకాశంగా తీసుకున్న వ్యాపారులు రేట్లను భారీగా పెంచేస్తున్నారు. రైతుబజార్‌లలో సైతం రైతు ఉత్పత్తుల కొరత వల్ల అక్కడ కూడా వ్యాపార ధోరణే కన్పిస్తోంది. 

ప్రైవేట్ మాల్స్ కూడా కారణమే...
కూరగాయల ధరలు పెరగటానికి పంట దిగుబడులు తగ్గటం ఓ కారణమైతే.. ప్రైవేటు మాల్స్ (బహుళ జాతి సంస్థలు) కూడా హేతువుగా నిలుస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ మాల్స్‌కు చెందిన వారు క్షేత్రస్థాయికే వెళ్లి రైతుల నుంచి నేరుగా కూరగాయలు కొనుగోలు చేస్తుండటంతో హోల్‌సేల్ మార్కెట్‌కు కానీ, రైతుబజార్లకు కానీ సరుకు తక్కువగా వస్తోంది. ఈ కొరతే ధరలు పెరగటానికి కారణం అవుతోంది. ఆయా సంస్థలు హైదరాబాద్ శివార్లలోని ఒంటిమామిడిలో ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసి సరుకు కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం కూడా యార్డును ఏర్పాటు చేసినా.. దానికి దీటుగా ప్రైవేట్ సంస్థలు తమ స్టాళ్లను నడుపుతున్నాయి. 

రైతులకు ముందుగానే డబ్బు చెల్లించి రెండు, మూడు సంవత్సరాల పాటు తమకే సరుకు విక్రయించేలా ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. ఈ కారణంగా రైతులు తమ ఉత్పత్తులను వారికే అందజేస్తుండటంతో నగరానికి కూరగాయల కొరత ఎదురవుతోంది. కూరగాయలను విస్తరంగా సాగుచేసే గజ్వేల్, ములుగు, వర్గల్ తదితర ప్రాంతాల సరుకు నగ రానికి రాకుండానే మాల్స్‌కు తరలిపోతోంది. నిజానికి వంటిమామిడిలో ట మాటా నాణ్యతను బట్టి కిలో రూ. 12, 10, 7 చొప్పున ధర పలుకుతుండగా.. అదే సరుకును నగరానికి వచ్చే సరికి రూ. 22, 20, 18 చొప్పున విక్రయిస్తున్నారు. మిర్చి, ఇతర కూరగాయల విషయంలో కూడా ప్రైవేట్ సంస్థలు ఇదే విధానాన్ని అనుసరిస్తుండటంతో ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. 

మార్కెటింగ్ శాఖ జోక్యమేదీ
కూరగాయల ధరలు తారాజువ్వలా దూసుకుపోతున్నా.. ధరలకు కళ్లెం వేసే విషయంలో మార్కెటింగ్ శాఖ పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోంది. కూరగాయల ధరలు పెరుగుతున్నా వీటి గురించి ప్రభుత్వం సమీక్షించకపోవటంతో అధికారులు కూడా ధరల నియంత్రణకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కూరగాయల కొరతను అదనుగా భావించి వ్యాపారులు, తాజా సరుకు పేరిట ప్రైవేటు మాల్స్ ఒక్కసారిగా ధరలు పెంచేసి వినియోగదారులను దోపిడీ చేస్తున్నారు. ఇప్పటికే ఫ్రెంచ్ బీన్స్, చిక్కుడు, బెండ, బీర, కాకర తదితర కూరగాయల ధరలు సామాన్యుడికి అందనంతగా కిలో రూ. 40 నుంచి రూ. 60 వరకూ పెరిగాయి. ఇప్పుడు వీటికి టమోటా, మిర్చి ధరలు కూడా తోడవుతండ టం వినియోగదారులను కలవరానికి గురిచేస్తోంది.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More