నిధుల మళ్లింపు కుంభకోణంపై సభా సంఘమన్నా వేయాలి లేదా సీబీఐ విచారణ జరిపించాలి



హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులకు సంబంధించి దాదాపు రూ.26 వేల కోట్లు దారి మళ్లాయి. ఇది కూడా ఓ కుంభకోణమే. నిధుల దారి మళ్లింపుపై సభా సంఘం వేయాలి. లేదా సీబీఐ విచారణ జరిపించాలి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రణాళిక బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలుకు శాసనసభ సమావేశాల్లో చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల సాధన ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద చేపట్టిన 72 గంటల నిరసన దీక్షలో భాగంగా ఆదివారం మూడవ రోజు దళిత సంఘాల ప్రతినిధుల దీక్షలు కొనసాగాయి. దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపిన జూపూడి మాట్లాడుతూ సబ్‌ప్లాన్ నిధులు దళితులు, గిరిజనులకు ప్రత్యేకంగా కేటాయించిన 30 ఏళ్ల తర్వాత కూడా దీని అమలు కోసం పోరాటాలు చేయాల్సి రావడం దురదృష్టకరమన్నారు. బి.ఆర్.అంబేద్కర్ అమలు చేసిన రిజర్వేషన్లతో ప్రజా ప్రతినిధులైన వారు తమ సామాజిక వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తామని రాజ్యాంగంపై ప్రమాణం చేసి ఆ తర్వాత వారి ఊసే ఎత్తడం లేదని వాపోయారు. 

రాష్ట్ర శాసనసభ, మండలిలో ప్రాతినిధ్యం వహిస్తోన్న 87 మంది దళిత, గిరిజన ప్రజా ప్రతినిధులు ఒక్కచోట కూర్చొని సబ్‌ప్లాన్ నిధుల దారి మళ్లింపుపై ఒత్తిడి తెస్తే సీఎం, డిప్యూటీ సీఎం దిగిరారా అని ప్రశ్నించారు. దళితుల సమస్యలపై మాట్లాడడానికి ఏ రాజకీయ పార్టీ అధిష్టానం కూడా వ్యతిరేకించబోదని, వారి సమస్యలపై మాట్లాడటం వల్ల పార్టీకి లాభం చేకూరుతుందని అందరూ ఆశిస్తారని, అయితే దళిత ప్రజా ప్రతినిధుల్లోనే చిత్తశుద్ధి లేదన్నారు. అన్ని రాజకీయ పార్టీల్లోని దళిత ప్రజా ప్రతినిధులు ఏకం కావాల్సిన అవసరముందన్నారు. సబ్‌ప్లాన్ నిధుల అమలులో ఐఏఎస్‌లకూ చిత్తశుద్ధి లేదన్నారు. అంబేద్కర్ ఆలోచనా విధానంతో దళితులకు ప్రత్యేక బడ్జెట్ పెట్టడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారని జూపూడి తెలిపారు. మూడోరోజు దీక్షా కార్యక్రమంలో మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ నేత చంద్రశేఖర్, సీపీఐ మాజీ ఎంపీ అజీజ్‌పాషా, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, వైఎస్సార్ సీపీ నాయకులు నల్ల సూర్యప్రకాష్‌రావు, మాజీ ఎంపీ రవీంద్రనాయక్, ఐటీ విభాగం నాయకులు చల్ల మధుసూదన్ రెడ్డి తదితరులు మాట్లాడారు. 

ఫలించని రాయబారం.. 
చలో అసెంబ్లీ యథాతథం

సబ్‌ప్లాన్ నిధుల కోసం గత మూడురోజులుగా దళిత, గిరిజన సంఘాలు చేస్తున్న ఆందోళనతో ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. సచివాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సబ్‌ప్లాన్ నిధుల వినియోగంపై నిర్ణయం తీసుకుంటామని, సోమవారంనాటి చలో అసెంబ్లీని విరమించుకోవాలని సబ్‌ప్లాన్ నిధుల సాధన కమిటీ నేతలను కోరారు. దీంతోపాటు ప్రభుత్వం తరఫున చేనేత మంత్రి జి. ప్రసాద్‌కుమార్, ఎంపీలు సిరిసిల్ల రాజయ్య, బలరాంనాయక్‌లు దీక్షా శిబిరం వద్దకు వచ్చి రాయబారం చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల అమలులో దారి మళ్లింపు వాస్తవమేనని, సమస్యలను త్వరలోనే ప్రభుత్వం పరిష్కరిస్తుందని, ఆందోళన విరమించాలని కోరారు. ఇందుకు ఆందోళనకారులు అంగీకరించలేదు. డిప్యూటీ సీఎం ప్రకటన చేయడం కాకుండా, ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. సబ్‌ప్లాన్ నిధుల అమలును చట్టబద్ధం చేస్తానని హామీ ఇవ్వడంతో పాటు రెండురోజుల పాటు దళిత, గిరిజన సమస్యలపై అసెంబ్లీలో చర్చలకు అవకాశం ఇస్తేనే ఆందోళన విరమిస్తామని తేల్చిచెప్పారు. సోమవారం చలో అసెంబ్లీ కార్యక్రమం యథాతథంగా ఉంటుందని సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ డెరైక్టర్ ఎం. ఆంజనేయులు తెలిపారు. దీక్షా శిబిరంలో జరిగిన కోర్‌కమిటీ సమావేశం అనంతరం మాట్లాడుతూ సబ్‌ప్లాన్ నిధులను సాధించేంత వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More