త్వరలోనే కాంగ్రెస్‌కు చేదు రోజులు: పద్మ

విద్యుత్ చార్జీల పెంపు ద్వారా ప్రజలపై భారం వేయడానికి సిద్ధపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తెలిపారు. ప్రజలపై రూ. 4వేల కోట్ల భారం మోపాలని ప్రభుత్వం చేస్తున్న ఆలోచనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉగాది సందర్భంగా ప్రభుత్వం తీపికబురు అందించకపోయినా ఫర్వాలేదు కానీ, చేదు మిగల్చవద్దని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.

‘ప్రకృతి కన్నెర్రకు తోడు కరెంటు కోతలు, గిట్టుబాటు ధరలు లేక వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోయింది. అనేక సమస్యలతో ప్రజలు అల్లాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు విద్యుత్ చార్జీల ద్వారా రూ. 4వేల కోట్లు పిండుకోవాలని చూస్తోంది. ఉప ఎన్నికల్లో ప్రజలు చావుదెబ్బ కొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గురావట్లేదు’’ అని పద్మ మండిపడ్డారు. ‘సాధారణ గహ అవసరాలకు ఉపయోగించే విద్యుత్‌కు యూనిట్‌పై రూ.50-90 పైసలు వడ్డించి రూ.900 కోట్లు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాల ద్వారా మరో 3 వేల కోట్లు దండుకోవాలని భావిస్తోంది. ఒకే సారి ప్రజలపై మోయలేని భారం వేస్తే భరించేది ఎలా?’ అని నిలదీశారు. కరెంట్ చార్జీలపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే కాంగ్రెస్‌కు రోజులు దగ్గరపడ్డట్లేనని ఆమె స్పష్టం చేశారు. 

కాంగ్రెస్ అరాచకాలకు టీడీపీ తబల

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టిస్తున్న అరాచకాలకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తబల వాయిస్తుందని పద్మ మండిపడ్డారు. వ్యాట్, ఇష్టారాజ్యంగా పన్నులు దండుతున్నా నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం అధికార పక్షంతో అంటకాగుతోందని దుయ్యబట్టారు. ప్రజలపై మరో కొత్తరకం వడ్డనకు ప్రభుత్వం పూనుకుంటే వైఎస్సార్ కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదని ప్రజలకు అండగా ఉంటూ తగిన బుద్ధి చెబుతుందని స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీలకు సిట్టింగ్ స్థానాలు దక్కనీయకుండా తగిన బుద్ది చెప్పినా... ఆ పార్టీలకు సిగ్గురాలేదని దుయ్యబట్టారు. ప్రతిష్ఠాత్మక కోవూరు ఎన్నికల్లో ప్రజలు గొప్ప తీర్పునిచ్చారని, ప్రజాస్వామ్యంలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పద్మ పేర్కొన్నారు. విలువలు, విశ్వసనీయతకు ప్రజలు పట్టం కట్టడంతో రాష్ట్రంలో రాబోయే మార్పునకు చక్కని నాందని చెప్పారు. 

చంద్రబాబు చేష్టలతో ఉద్యమం విరమించిన హజారే!

అవినీతిపై టీడీపీ అధినేత చంద్రబాబు మాటలు, చేష్టలు చూసి జాతీయస్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టిన అన్నాహజారే విరమించుకున్నారని పద్మ ఎద్దేవా చేశారు. తొమ్మిదేళ్ల పాటు రాష్ట్రంలో కుంభకోణాలు, అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబు అవినీతిపై పోరాటం అంటూ హజారే ఫోటోపెట్టుకోవడం చూసి తెలుగు తమ్ముల్లే ముక్కున వేలేసుకున్నారని చెప్పారు. బాబు హయాంలో చోటుచేసుకున్న కుంభకోణాలను చెప్పుకుంటూ పోతే అంతమే ఉండదన్నారు. కనుక అవినీతిని అంతమొందించే విషయంపై మాట్లాడే అర్హత ఒక్క జగన్‌మోహన్‌రెడ్డికే ఉందన్నారు. ప్రభుత్వ పాలనలో జగన్ ఇప్పటి దాకా ఎక్కడా జోక్యం చేసుకోలేదని, అనునిత్యం ప్రజల గురించి పరితపిస్తూ.. కాంగ్రెస్, చంద్రబాబులకు రాని ఆలోచనలు ఆయన చేస్తున్నారని వివరించారు. అవినీతి అంతం చేస్తానని ఇప్పటి దాకా చంద్రబాబు కానీ సీఎం కిరణ్ కానీ చెప్పలేకపోయారని, ముఖ్యమంత్రి పీఠంపై ఉంటే ఆ భూతాన్ని రూపుమాపుతామని చెప్పిన ధైర్యం జగన్‌కే దక్కుతుందని తెలిపారు. 

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More