తరలివచ్చిన పల్లెలు

రెండో రోజూ ‘రైతు దీక్ష’కు అదే ఆదరణ 

వైఎస్ జగన్‌ను చూడ్డానికి తెలంగాణ జిల్లాల నుంచి వచ్చిన కర్షకులు, వృద్ధులు, మహిళలు, కార్యకర్తలు
ఉదయం నుంచే పోటెత్తిన జనం.. రాత్రి దాకా బారులు
ఎండిన పంటలు తీసుకొచ్చి గోడు చెప్పుకొన్న రైతన్న
దీక్ష వద్ద న్యూడెమోక్రసీ కార్యకర్తల ఆందోళన
నేటితో ముగియనున్న మూడు రోజుల రైతు దీక్ష
సాయంత్రం నాలుగు గంటలకు ముగింపు సభ ప్రారంభం

ఆర్మూరు నుంచి న్యూస్‌లైన్ ప్రతినిధి: అదే ఆదరణ.. అదే అభిమానం.. అపూర్వ నీరాజనం.. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలంలోని పెర్కిట్ వద్ద వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘రైతు దీక్ష’కు రెండో రోజూ పల్లె జన ప్రవాహం వెల్లువెత్తింది. దీక్ష జరుగుతున్న వైఎస్సార్ ప్రాంగణం జన జాతరను తలపించింది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు జన ప్రవాహం పోటెత్తింది. ‘ఒక్కసారి జగనన్నను చూడాలి.. మా గోడు చెప్పుకోవాలి..’ అంటూ కర్షకులు, కార్మికులు, వృద్ధులు, విద్యార్థులు, పిల్లాపాపలతో మహిళలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. తెలంగాణలోని అన్ని పల్లెల నుంచీ అత్యధిక సంఖ్యలో దీక్షా ప్రాంగణానికి చేరుకున్న రైతన్నలు ఉదయం నుంచి రాత్రి వరకు బారులు తీరి కనిపించారు. అన్నదాతలతో పాటు అన్ని వర్గాలూ మద్దతు పలకటంతో దీక్షకు అంచనాలకు మించిన స్పందన లభించింది.

తెల్లవారుజాము నుంచే..

మొదటి రోజున జగన్ ఆలస్యంగా ఆర్మూరుకు చేరుకోవటం.. రాత్రి ఎనిమిదిన్నరకు దీక్ష ప్రారంభం కావటంతో... చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది రైతులు మంగళవారం ఆయనను కలుసుకోలేకపోయారు. వారిలో కొందరు రాత్రిపూట చలిని సైతం లెక్కచేయకుండా ఇక్కడే జాగారం చేశారు.. చలి మంటలతో కాలక్షేపం చేసి.. ఉదయాన్నే తమ అభిమాన నేతను కలుసుకోడానికి క్యూలో నిలబడ్డారు. దీంతో తెల్లారుజాము నుంచే దీక్షా ప్రాంగణంలో రైతు జాతర మొదలైంది. ఉదయం నాలుగున్నరకే నిద్రలేచిన జగన్‌మోహన్‌రెడ్డి ఆరున్నర గంటల నుంచి రైతులను పలకరించారు. రాత్రి వరకు నిర్విరామంగా తనను కలిసేందుకు వచ్చిన రైతులతోనే ఎక్కువ సమయం గడిపారు. వారందరితో ఓపికగా మాట్లాడి కరువు తెచ్చిన కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు.

వైఎస్ మరణించాక..

నిజామాబాద్‌లోని వివిధ ప్రాంతాలతో పాటు కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి రైతులు దీక్షకు తరలివచ్చారు. తమ కన్నీటి కరువు గోడును జగన్‌తో చెప్పుకునేందుకు పోటీ పడ్డారు. గంటల తరబడి క్యూలో నిలబడి తమ కష్టనష్టాలను విన్నవించుకున్నారు. తమను పట్టించుకునేవారెవరూ లేరని, వైఎస్‌ఆర్ మరణం తర్వాత తమ బతుకు దుర్భరంగా మారిందని కొందరు పసుపు రైతులు జగన్ ఎదుట కంటతడి పెట్టారు. ఎండిన పంటలను వెంట తెచ్చి.. తమ కష్టాలను కళ్లకు కట్టారు. రైతులు చెప్పినదంతా సావధానంగా ఆలకించిన జననేత.. ఏం చేస్తే.. సమస్య పరిష్కారమవుతుందని వారినే అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నించారు. కష్టాలు తీరే మంచి రోజులు వస్తాయని.. మనో నిబ్బరం కోల్పోవద్దని ధైర్యం చెప్పారు.

ఇంటికి ఒకరు చొప్పున..

ఆర్మూరు మండలంలోని మంథని గ్రామం నుంచి ఇంటికి ఒకరు చొప్పున గ్రామస్థులంతా దీక్షా స్థలికి వచ్చారు. గ్రామాభివృద్ధి కమి టీ తీర్మానం మేరకు.. వారందరూ ఇలా సామూహికంగా దీక్షకు తరలివచ్చారు. ఆ గ్రామ ప్రజలను వైఎస్ జగన్ అప్యాయంగా పలకరించి తన ఆత్మీయతను పంచుకున్నారు. మరోవైపు అన్ని జిల్లాల నుంచి తరలివచ్చిన పార్టీ నేతలు, స్వచ్ఛందంగా వచ్చిన వలంటీర్లతో దీక్షా ప్రాంగణంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడాయి. జగన్‌కు తమ సంఘీభావం తెలి పేందుకు కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి వందలాదిగా పార్టీ ముఖ్య నేతలు తరలి వచ్చారు. ఎమ్మెల్యేలు కొండా సురేఖ, ఎం.ప్రసాదరాజు, పి.రామకృష్ణారెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఎమ్మెల్సీ కొండా మురళి, మాజీ మంత్రి మారెప్ప, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జంగా కృష్ణమూర్తి, రఘురామిరెడ్డి, మర్రి రాజశేఖర్, బోడ జనార్ధన్, ఎడ్మ కృష్ణారెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు, వైఎస్‌ఆర్ మహిళా విభాగం అధ్యక్షురాలు నిర్మలాకుమారి, యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి, సేవాదళ్ రాష్ట్ర కన్వీనర్ వినయ్‌రెడ్డితో పాటు జిల్లాల పార్టీ కన్వీనర్లు దీక్షలో పాల్గొన్నారు.

చూస్తే చాలని వచ్చాం..

వేలాది మంది రైతులతో పాటు ఆర్మూరు, పెర్కిట్ పరిసర మండలాల నుంచి పిల్లా పాపలను వెంటేసుకొని మహిళలు, వృద్ధులు తరలిరావటం దీక్షలో ప్రత్యేకం. ‘జగన్‌ను చూస్తే చాలనుకుని వచ్చాం. ఆయన్ను కలిసే అవకాశం దక్కింది.. మా పిల్లలను ఆత్మీయంగా పలకరించాడు. ఎంతో ఆనందంగా ఉంది..’ అంటూ పెర్కిట్‌కు చెందిన లావణ్య ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈమె తన రెండేళ్ల చిన్నారి నందినిని ఎత్తుకొని, అయిదేళ్ల నవ్యశ్రీని చేత్తో పట్టుకొని దీక్షా స్థలికి వచ్చారు. ఈమెతోపాటు పొరుగున ఉన్న మరో మహిళ జ్యోతి కూడా తన చిన్నారిని దీక్షకు తీసుకొచ్చారు. ఆమె వెంట బుడిబుడి అడుగులేస్తూ ఆ చిన్నారి వర్షిణి అందరినీ ఆకర్షించింది.

వైఎస్‌ను కలవాలనుకున్నా.. 

‘వైఎస్‌ఆర్‌ను కలవాలనుకున్నా.. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెట్టినందుకు కృతజ్ఞతలు చెప్పాలనుకున్నా. దురదృష్టవశాత్తూ ఆ కల చెదిరిపోయింది. అప్పట్నుంచీ జగన్‌ను కలవాలనుకున్నాం. ఈ రోజు మా కల ఫలించింది..’ అంటూ నిర్మల్ నుంచి తన తల్లి లక్ష్మిని వెంట పెట్టుకొని వచ్చినయువతి బండారి ప్రవీణ తమ కుటుంబానికి వైఎస్‌పై ఉన్న వీరాభిమానాన్ని చాటుకున్నారు. తెల్లవారుజామునే ఆమె దీక్షా ప్రాంగణంలో జగన్‌ను కలిసే వంతు ఎప్పుడొస్తుందా అని నిరీక్షించారు. ‘నా పీజీ పూర్తయింది. మా కుటుంబం అంతా వైఎస్‌ఆర్ వీరాభిమానులే. ఇడుపులపాయలో వైఎస్ సమాధిని చూడాలనేది మా అమ్మ కోరి క. రెండు రోజుల్లో అక్కడికి వెళతాం..’ అని ఆమె చెప్పారు.


నేడు ముగింపు సభ

మంగళవారం ప్రారంభించిన మూడు రోజుల రైతు దీక్ష గురువారంతో ముగియనుంది. ‘రైతు దీక్ష’ ముగింపు సభ సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More