తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనపై ఆరోపణలు చేయడం కాదని, ఆధారాలు ఉంటే సిబిఐకి సమర్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సవాల్ విసిరారు. లేనిపోని ఆరోపణలు చేయడంకాదని, బాధ్యత గల వ్యక్తిగా ఆధారాలను విచారణాధికారులకు ఇవ్వాలన్నారు. తన 9 సంవత్సరాల పాలనలో రైతులకు అన్యాయం చేశానని, విద్యుత్ అందించలేకపోయానని చంద్రబాబు నాయుడు ఒప్పుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు రైతుల గురించి మాట్లాడితే నమ్మే పరిస్థితి లేదన్నారు.
రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి ప్రకటిస్తే, విద్యుత్ తీగలమీద బట్టలు ఆరేసుకోవాలని చంద్రబాబు విమర్శించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే ఉచిత విద్యుత్ సాధ్యమని వైఎస్ఆర్ రుజువు చేశారని చెప్పారు.
పంటలు ఎండిపోతేనే గానీ రైతులకు బుద్ధిరాదని 1999 ఏప్రిల్ 13న చంద్రబాబు అన్నమాట నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించమని అడిగితే కాల్పులు జరిపిన చంద్రబాబు ఇప్పుడు విద్యుత్ పై పోరాడతారట అని ఎద్దేవా చేశారు. బషీర్ బాగ్ కాల్పుల సంఘటనపై క్షమాపణ చెప్పాకే బాబు విద్యుత్ సమస్యపై ఉద్యమించాలన్నారు.