సమరశంఖం... నేటి నుంచే ప్రచారభేరి

రామచంద్రపురం నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నిక పోరులో ఎన్నడో తన అభ్యర్థిని ఖరారు చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రచారంలోనూ అదేరీతిలో ముందుకు దూసుకుపోతోంది. ఇప్పటికే పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ ముమ్మరంగా ప్రచారం సాగిస్తుండగా పార్టీ శ్రేణుల ఉత్తేజాన్ని శిఖరస్థాయికి చేరుస్తూ గురువారం నుంచి పార్టీ అధ్యక్షులు, జననేత జగన్‌మోహన్‌రెడ్డి సమరశంఖం పూరించనున్నారు. కోవూరు ఉప ఎన్నికలో విజయదుందుభి మోగించిన వైఎస్సార్ కాంగ్రెస్ త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న 18 నియోజకవర్గాల్లోనూ అంతకు మించిన గెలుపు తథ్యమన్న నిండు నమ్మకంతో ఉంది.

రామచంద్రపురంలోనూ అదే సమరోత్సాహంతో పార్టీ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. రైతుసంక్షేమాన్ని విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వంపై విలువలకు కట్టుబడి అవిశ్వాసానికి ఓటేసి పదవి కోల్పోయిన బోస్‌కు మద్దతుగా ప్రచారం చేసేందుకు వస్తున్న జగన్ పర్యటన బుధవారం రాత్రి ఖరారైంది. అనేక ప్రలోభాలను సైతం లెక్కచేయకుండా, పదవిని తృణప్రాయంగా వదులుకున్న బోస్ కోసం రామచంద్రపురంలో జగన్ సమరశంఖం పూరించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో అక్కడి తాజా మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజుకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన జగన్ దానికి కొనసాగింపుగా రామచంద్రపురంలో మూడు రోజులపాటు పర్యటించనున్నారు.

‘జగన్ మావాడు’ అంటున్న జనం...
వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంతో గుండె పగిలి జిల్లాలో 75 మంది అభిమానులు మరణించగా 18 రోజులు జిల్లాలోనే ఉండి ప్రతి కుటుంబాన్నీ ఓదార్చిన జగన్ ఆ తరువాత కూడా జిల్లావాసులకు ఏ చిన్న కష్టమొచ్చినా ‘నేనున్నానంటూ’ ఉరికి వచ్చి అండగా నిలబడుతున్నారు. కొండంత ధైర్యాన్ని ఇస్తున్నారు. తుపానుతో నష్టపోయిన రైతుల పలకరింపునకు, కోనసీమలో క్రాప్ హాలిడే ప్రకటించిన రైతన్నలకు దన్నుగా నిలిచేందుకు, ఆత్మహత్యకు పాల్పడ్డ రైతుల కుటుంబాల కన్నీటిని తుడిచేందుకు, ఎన్నో జిల్లాలకు జలవరం కానున్న పోలవరం ప్రాజెక్టు సాధనకు చేపట్టిన హరితయాత్ర కోసం, నిన్నగాక మొన్న కోనసీమలో అంబేద్కర్ విగ్రహాలకు అపచారం జరిగినప్పుడు, పోలీసు దెబ్బలకు మృతి చెందిన యానాం రీజెన్సీ కార్మికనేత కుటుంబాన్ని పరామర్శించేందుకు, పల్లం అగ్నిబాధితుల వ్యథను కళ్లారా చూసేందుకు... ఇలా జగన్ పదే పదే జిల్లాలో కాలిడుతూనే ఉన్నారు. కష్టంలో, నష్టంలో జనంతో మమేకం అవుతూనే ఉన్నారు.

అందుకే జిల్లావాసులు ‘జగన్ మావాడు. కష్టసుఖాల్లో తోడుగా నిలిచే మా ఆత్మబంధువు. మా పాలిట ఆశాకిరణం’ అని పరిగణిస్తున్నారు. ఆయన ఎప్పుడు వచ్చినా నిండు హృదయంతో, అవధులు లేని ఆప్యాయతను పంచుతున్నారు.

ఎదురు చూస్తున్న గ్రామాలు
గత పర్యటనలకు భిన్నంగా జగన్ ఈసారి రాజకీయ సమరంలో భాగంగా, ఉపపోరులో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు, బోస్ గెలుపును నల్లేరుపై నడకగా మార్చేందుకు జిల్లాకు రానున్నారు. గురువారం నుంచి శనివారం వరకు నియోజకవర్గంలోని కె.గంగవరం, రామచంద్రపురం, రామచంద్రపురం టౌన్, కాజులూరు మండలాల్లో జగన్ పర్యటించనున్నారు. ఆయన రాక కోసం నియోజకవర్గంలోని వివిధ గ్రామాల ప్రజలు ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎదురుచూస్తున్నారు. కాగా, పశ్చిమ గోదావరి నుంచి జగన్ ఈతకోట, రావులపాలెంల మీదుగా బుధవారం అర్ధరాత్రి 12.40గంటలకు రామచంద్రపురం చేరుకున్నారు. ఆయనకు పార్టీ నేత కొవ్వూరి త్రినాధరెడ్డి ఇంటి వద్ద మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, కొల్లి నిర్మలకుమారి, కర్రి పాపారాయుడు తదితర నాయకులు స్వాగతం పలికారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More