8 నెలలుగా ఈ కేసు విచారణ జరిగినా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదు

అందుకే కాంగ్రెస్, టీడీపీల గిమ్మిక్కులు, ఎత్తులు పారలేదు
ఆయనపై ఎంత దుష్ర్పచారం చేసినా జనం నమ్మలేదు
జగన్‌ను అస్థిరపరచడానికే సీబీఐ దాడులు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి సకల అవలక్షణాలను ఆపాదించి.. కాంగ్రెస్, టీడీపీ నేతలు జాతీయస్థాయిలో దుష్ర్పచారం చేశారు. ప్రజల్ని, పార్టీ క్యాడర్‌ను గందరగోళపరచాలని అన్ని రకాలుగా ప్రయత్నించారు. కానీ ప్రజలు వారి మాటలు నమ్మలేదు. కాంగ్రెస్, టీడీపీ చేస్తున్న గిమ్మిక్కులు, ఎత్తులు పారలేదు. ఎందుకంటే నెలలో 20 రోజులకు పైగా.. ఉదయం నుంచి రాత్రి దాకా జగన్ ప్రజల మధ్యే ఉంటున్నారు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సలహాదారు డి.ఎ.సోమయాజులు అన్నారు. ఆదివారం ఒక టీవీ చానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పై వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను అస్థిరపరచడానికే సీబీఐ దాడులు చేస్తున్నారని చెప్పారు. అందుకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయన్నారు. ‘జగన్ ఆస్తుల కేసులో ప్రభుత్వం విడుదల చేసిన 26 జీవోలపైనే ప్రధానంగా ఆరోపణలొచ్చాయి. ఆ కేసులో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శే మొదటి ప్రతివాదిగా ఉన్నారు. అయినప్పటికీ కేసు విచారణ జరుగుతున్నప్పుడు అడ్వొకేట్ జనరల్ కోర్టువైపు కన్నెత్తి చూడలేదు. హైకోర్టులో 8 నెలలుగా ఈ కేసు విచారణ జరిగినా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదు’ అని వివరించారు. ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉండదన్నారు. ‘ప్రభుత్వం విడుదల చేసిన ఒక్క జీవోను ఎవరైనా సవాలు చేస్తే.. వెంటనే అడ్వొకేట్ జనరల్ కౌంటర్ దాఖలు చేస్తారు. అలాంటిది 26 జీవోలకు సంబంధించి ఆరోపణలు వస్తే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? దీన్ని క్షుణ్నంగా పరిశీలిస్తే ఈ కేసులో ఏం జరుగుతుందనేది ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది’ అని అన్నారు. 

జగన్‌లో వైఎస్‌ను మించిన నాయకత్వ లక్షణాలు: దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డిని మించిన నాయకత్వ లక్షణాలు జగన్‌లో ఉన్నాయని సోమయాజులు చెప్పారు. ఒక గొప్పనేతకు ఉండాల్సిన లక్షణాలన్నీ జగన్‌లో ఉన్నాయన్నారు. ‘లీడర్ ఎంత టఫ్ మైండ్ కలిగిన వారైతే అంతపైకి ఎదుగుతారు. చెప్పిన ప్రతి ఒక్కరి మాటా వింటే సరైన నిర్ణయాలు తీసుకోలేరు’ అని చెప్పారు. రాష్ట్రానికి కేంద్ర వ్యవసాయశాఖ, రైల్వే మంత్రి పదవులు తెస్తానని జగన్ ఒక పట్టుదలతో చెబుతున్నారన్నారు. ఎందుకంటే.. ప్రస్తుతం రాష్ట్రం నుంచి 33 మంది ఎంపీలున్నా.. పల్లకీని మోయడం తప్పితే.. ఎలాంటి ప్రయోజనం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గతంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్ కేంద్రంతో గట్టిగా పోరాడారని తెలిపారు. రైతు సమస్యలపై ప్రధాని మన్మోహన్‌తోపాటు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిని వందసార్లు కలిసి ఇక్కడి పరిస్థితులను వివరించారన్నారు. వైఎస్ కృషి వల్లే కేంద్రం రైతుల రుణాలను రీషెడ్యూలు చేసిందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలు తొమ్మిదేళ్లు అవకాశం ఇచ్చినా.. ఆయన సద్వినియోగం చేసుకోలేకపోయారని తెలిపారు. ‘చంద్రబాబు ఎంతసేపు ప్రపంచబ్యాంక్, ఐటీ అంటూ వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు’ అని విమర్శించారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More