బడ్జెట్ బడితెతో సామాన్యుడి నడ్డి విరిచిన ప్రణబ్

గోరంత రాయితీ ఇచ్చి.. కొండంత వడ్డించిన ఆర్థిక మంత్రి
ప్రత్యక్ష పన్నుల్లో జనానికి రూ.4,500 కోట్ల మేరకు స్వల్ప ఊరట
పరోక్ష పన్నులతో ఏకంగా రూ.45,940 కోట్ల మేర భారీ బాదుడు

రూ.14,90,925 కోట్లతో 2012-13 బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పించిన ప్రణబ్
ఎక్సైజ్ సుంకానికి రెక్కలు.. సేవా పన్నులు 10 నుంచి 12 శాతానికి పెంపు
సబ్సిడీలకు కోత తప్పదని స్పష్టీకరణ.. పెట్రో, గ్యాస్, ఎరువుల ధరలు భగ్గు!
{పభుత్వ పథకాలకు నగదు సబ్సిడీ సాకుతో వంట గ్యాస్, కిరోసిన్ సబ్సిడీలకూ 
భారీ కోత.. ‘ఆధార్’ సాయంతో లబ్ధిదారుల సంఖ్యను భారీగా తగ్గించే ఎత్తుగడ
బంగారం నుంచి బీడీల దాకా ధరల మంటే.. బ్రాండెడ్ వెండి మరింత చౌక
విదేశీ కార్లు, సైకిళ్లు, ఫోన్ బిల్లులు భారం... ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ టీవీలు తేలిక
పెరగనున్న ఉక్కు, సిమెంట్, విమానయాన ధరలు... ఇల్లు మరింత ఖరీదు
మౌలిక రంగానికి మరింత జోష్.. పీపీపీ ప్రాజెక్టులకు కూడా ప్రోత్సాహం
నల్లధనంపై ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే శ్వేతపత్రం ప్రకటన
మల్టీ బ్రాండ్ రిటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అనుమతికి కృషి
సాగు, గనులు, ఆరోగ్య రంగాలకు ఊరట.. ఫ్లాగ్‌షిప్ పథకాలకు కోత

మినహాయింపు కొంతే
పన్ను శ్లాబులకు స్వల్ప సవరణలు
రూ. 5 లక్షల్లోపు వేతన జీవులకు అదనపు లాభం రూ.2వేలు
రూ. 10 లక్షల ఆదాయం వరకూ ఇక 20 శాతం పరిధిలోకి
రూ. 10 లక్షలు దాటితేనే 30 శాతం పన్ను శ్లాబు
షేర్లలో ఇన్వెస్ట్ చేసే సొమ్ముకూ ఇక ఐటీ మినహాయింపు
రూ. 3 లక్షలకు బేసిక్ లిమిట్ ఆశించినవారికి నిరాశే
ఈ సారికి ఇంతటితో సరిపెట్టుకోవాల్సిందేనన్న ప్రణబ్

న్యూఢిల్లీ: ఆదాయపు పన్నులో భారీ రాయితీ ఇస్తారని, రూ.3 లక్షల్లోపు ఆదాయం ఉండేవారు రూపాయి కూడా పన్ను కట్టాల్సిన అవసరం ఉండకపోవచ్చని ఆశించిన వేతన జీవులకు ఈసారి నిరాశే ఎదురైంది. అంత మినహాయింపు ఇవ్వలేమంటూ... ప్రస్తుతానికి దాన్ని రూ.2 లక్షలకే పరిమితం చేశారు. ఇప్పటిదాకా ఈ పరిమితి రూ.1.8 లక్షలుగా ఉండేది. దాన్ని రూ.2 లక్షలకు పెంచుతున్నట్లు ఈ బడ్జెట్లో ప్రణబ్ ప్రతిపాదించారు. ఇలా రూ.20,000 పరిమితిని పెంచటం వల్ల అత్యధిక వేతన జీవులకు... అంటే ఏడాదికి రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి కనీసం రూ.1,030 నుంచి గరిష్టంగా రూ.2,060 మేర ప్రయోజనం లభిస్తుంది. అంటే వేతన జీవుల జేబుల్లో అదనంగా ఓ రెండువేలు మిగులుతాయన్న మాట. సవరించిన పన్ను శ్లాబులు, చేసిన మార్పులు 2012-13 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయి.

రూ.10 లక్షల ఆదాయం ఉన్నా 20 శాతమే...

ఏడాదికి రూ.2 లక్షల నుంచి 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి మునుపటిలానే 10 శాతం పన్ను శ్లాబు వర్తిస్తుంది. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. తాజా బడ్జెట్లో మార్చింది ఈ శ్లాబునే. ఇప్పటిదాకా రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు మాత్రమే 20 శాతం శ్లాబులోకి వచ్చేవారు. దాన్ని రూ.10 లక్షల వరకూ పెంచారన్న మాట. ఇక రూ.10 లక్షలపైన ఆదాయం ఉన్నవారు దానిపై 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 

గరిష్ట లాభం రూ.20,600

20 శాతం పన్నుకు సంబంధించిన ట్యాక్స్ శ్లాబ్‌ను సవరించటం వల్ల రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వార్షికాదాయం ఉన్నవారికి కనిష్టంగా రూ.10,300 నుంచి గరిష్టంగా రూ.20,600 పన్ను ప్రయోజనం లభిస్తుంది. ఆదాయపు పన్ను విధింపునకు సంబంధించి చేసిన ఈ మార్పుల వలన ప్రభుత్వం ఏటా రూ.4,500 కోట్ల ఆదాయాన్ని నష్టపోనుందని ప్రణబ్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. 

త్వరలోనే ప్రత్యక్ష పన్నుల కోడ్

1961 నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో ప్రవేశపెట్టనున్న డీటీసీపై పార్లమెంటరీ స్థాయీ సంఘం ఈ ఏడాది మార్చి 9న తన నివేదిక ఇచ్చిందని, దీన్లోని అంశాలను పరిశీలించి త్వరలోనే డీటీసీ బిల్లును అమల్లోకి తెస్తామని ప్రణబ్ తెలిపారు. ప్రస్తుతానికి డీటీసీ బిల్లులో ప్రతిపాదించిన ట్యాక్స్ శ్లాబులను అమలు చేస్తున్నామన్నారు. ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండి, సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ రూ.10,000 మించని వారు రిటర్నులు వేయనవసరం లేదన్నారు.

గుర్తుంచుకోవాల్సిందిదీ...

ఆదాయం పన్ను విధించేటపుడు మొత్తం వార్షికాదాయంలో తొలుత వివిధ మినహాయింపుల్ని తీసేస్తారు. అవి...

హెచ్‌ఆర్‌ఏ లేదా అద్దె, ఎల్‌ఐసీ, పీఎఫ్, స్కూల్ ఫీజులు, మ్యూచ్‌వల్ ఫండ్స్ వంటి సేవింగ్స్‌ను మొదట మినహాయిస్తారు. అయితే ఈ మొత్తం గరిష్టంగా రూ.లక్ష వరకు మాత్రమే అనుమతిస్తారు. తరవాత మిగిలిన మొత్తంలో రూ.15వేల వరకు వెచ్చించే మెడికల్ ఇన్సూరెన్స్, రూ.20వేల వరకు వెచ్చించే ఇన్‌ఫ్రా బాండ్స్, గృహ రుణాలపై చెల్లించే వడ్డీ గరిష్టంగా రూ.1.5 లక్షలు మినహాయిస్తారు. 

ఇంకా స్వచ్ఛంద సంస్థలకు చెల్లించే విరాళాల వంటివి కూడా మినహాయింపుల్లో ఉంటాయి. 

ఇలా పై మినహాయింపులన్నీ పోను మిగిలే మొత్తాన్ని... పన్ను చెల్లించాల్సిన ఆదాయం(ట్యాక్సబుల్ ఇన్‌కమ్)గా పరిగణిస్తారు. ఈ ఆదాయం ఎంత ఉంటే ఎంత పన్ను చెల్లించాలి? ప్రస్తుతం ఎంత చెల్లిస్తున్నారు? తాజా ప్రతిపాదనల అనంతరం ఎంత చెల్లించాల్సి ఉంటుంది? 

మరికొన్ని మినహాయింపులు
ఆదాయపు పన్ను భారం నుంచి తప్పించుకోవడానికి మరికొన్ని అవకాశాలను కల్పిస్తూ ప్రస్తుత బడ్జెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ప్రధానమైనది రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్ స్కీం. ఈ పథకం కింద నేరుగా స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసిన రూ.50,000 పైన 50 శాతం అంటే రూ.25,000ను ఆదాయం నుంచి తగ్గించి చూపించుకోవచ్చు. కాని ఈ పథకం ద్వారా ఇన్వెస్ట్ చేస్తే మూడు సంవత్సరాల వరకు వైదొలగడానికి అవకాశం లేదు. అలాగే ఈ పథకం వార్షిక ఆదాయం రూ.10 లక్షల లోపు ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది.

అలాగే ఏటా ముందస్తుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే దానికయ్యే వ్యయంలో రూ.5,000 వరకు పన్ను మినహాయింపులు లభిస్తాయి. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్‌పై వచ్చే వడ్డీ ఆదాయంలో రూ.10,000 వరకు మినహాయింపునిచ్చారు. అలాగే ఎటువంటి వ్యాపార ఆదాయం లేని సీనియర్ సిటిజన్స్‌కు ఇక నుంచి ముందస్తు పన్ను చెల్లింపులు (అడ్వాన్స్ ట్యాక్స్) చేయనవసరం లేదు. అలాగే వడ్డీపై పన్ను పడని ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ ద్వారా ప్రభుత్వరంగ మౌలిక సంస్థలు నిధులు సేకరించే మొత్తాన్ని రూ.30,000 కోట్ల నుంచి రూ.60,000 కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీని వలన వచ్చే సంవత్సరం ట్యాక్స్ బాండ్స్‌లో మరింత ఎక్కువ ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు కలుగుతుంది. 

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More