మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి ఓ ఐరన్‌లెగ్‌లా మారాడని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావు ఎద్దేవా చేశారు. ఆయనకున్న ప్రజాదరణ ఏంటో, ఆయన శక్తి ఎంతో కడప, కోవూరులలో జరిగిన ఉప ఎన్నికలలోనే తేలిపోయిందని, 2014లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తానని చెబుతున్న చిరంజీవి, త్వరలో జరగబోయే తిరుపతి ఎన్నికలలో తన సత్తా ఏంటో చూపాలని ఆయన సవాల్ విసిరారు. శుక్రవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. గత ఎన్నికలలో కాంగ్రెస్, పీఆర్పీలకు కలిపి వచ్చిన ఓట్ల కన్నా ఇప్పుడు కోవూరులో కాంగ్రెస్‌కు 30వేల ఓట్లు తక్కువ వచ్చాయని, దీన్నిబట్టి చిరంజీవికున్న ప్రజాదరణ ఏపాటిదో అర్థమవుతోందని అన్నా రు. ‘బావ అల్లు అరవింద్ ఎలాగూ గతంలో ఎన్నికలలో పోటీచేశారు. ఆయనకు రాజకీయాలపై ఆసక్తి ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి చిరంజీవి సోదరుడు నాగబాబు టికెట్ ఆశించారు. తన కుటుంబ సభ్యులు తిరుపతిలో పోటీచేయబోరని చిరంజీవి చెబుతున్నా నాగబాబు దానిని ఖండించలేదు. అల్లు అరవింద్ తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నారు. 2014లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తానంటున్న చిరంజీవికి దమ్మూ, ధైర్యం ఉంటే తిరుపతి అసెంబ్లీకి జరిగే ఉప ఎన్నికలలో వారిద్దరిలో ఒకరిని బరిలోకి దింపి గెలిపించుకోవాలి’ అని సవాల్ చేశారు. వైఎస్సార్ మరణానంతరం ఆయనను, ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డిని ఆడిపోసుకున్న కాంగ్రెస్ నేతలు కె.కేశవరావు, శంకర్రావు, డీఎల్. రవీంద్రారెడ్డిలకు నూతన సంవత్సరంలో జ్ఞానోదయం కలిగినట్లుందని గోనె ఎద్దేవా చేశారు. ఇన్నాళ్లూ జగన్‌ది పాలపొంగు అని విమర్శించిన వారికి ఇప్పుడు జగన్ శక్తి ఏంటో తెలిసిందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధులు, ఆ పార్టీ నేతల కన్నా వీరు ఎక్కువగా మాట్లాడుతూ 18 అసెంబ్లీ, 1 ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్‌దే విజయమన్న సంకేతాలను ఘంటాపథంగా ప్రజల్లోకి పంపారని అన్నారు. 18 స్థానాల ఎన్నికల ప్రచారం ఆ ముగ్గురి మాటలతో 50 శాతం పూర్తయిపోయిందని, ఆయా స్థానాల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు రెండోస్థానం కోసం పోటీపడాల్సిందేనన్నారు.
0 comments:
Post a Comment