సాయిరెడ్డితో ఏదో చెప్పించి జగన్‌ను అరెస్టు చేయాలని చూస్తోంది

సాక్షులను బెదిరిస్తారని ఆధారాలు లేకుండా ఆరోపిస్తోంది
సెక్షన్ 409 సాయిరెడ్డికి వర్తించదు.. ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని వినతి
బెయిల్ పిటిషన్‌పై ఇరువురి 
వాదనలు పూర్తి.. 19న తీర్పు

హైదరాబాద్, న్యూస్‌లైన్: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో కుట్రదారులను సీబీఐ వదిలేసిందని ఆడిటర్ విజయసాయిరెడ్డి తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సుశీల్‌కుమార్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి బి.నాగమారుతిశర్మ శుక్రవారం మరోసారి విచారించారు. ఈ కేసులో నేరానికి పాల్పడిన వారిపై సీబీఐ దర్యాప్తు జరపడంలేదని, రాజకీయ కోణంలో విచారణ జరుపుతోందని సుశీల్‌కుమార్ ఆరోపించారు. రాజకీయ కక్షతో కొందర్ని లక్ష్యంగా చేసుకొని సీబీఐ విచారణ చేస్తోందని, ఇది బహిరంగ రహస్యమేనని అన్నారు. సాయిరెడ్డితో ఏదో చెప్పించి జగన్‌ను అరెస్టు చేయాలని సీబీఐ ప్రయత్నిస్తోందన్నారు. 

ఈ కేసులో 90 రోజుల్లోపు కొందరు ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు వ్యక్తులను అరెస్టు చేసి వారితో సాయిరెడ్డి కుట్రకు పాల్పడ్డారని ఆరోపించే అవకాశం ఉందని తెలిపారు. ఆడిటర్‌గా పనిచేసిన సాయిరెడ్డికి ఐపీసీ 409 (నేరపూరిత నమ్మకద్రోహం) వర్తించదని, ఇతర కేసుల్లో 60 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయకపోతే కోర్టు బెయిల్ మంజూరు చేయవచ్చని తెలిపారు. ‘‘సీబీఐ విచారణ పారదర్శకంగా జరగడంలేదు. ఈ కేసులో అసలు నేరస్తులు ఎవరు ? లబ్ధిచేకూర్చి పెట్టుబడులు పెట్టడానికి కారకులు ఎవరు? వారందరినీ విడిచిపెట్టారు. కేవలం డబ్బును పెట్టుబడుల రూపంలో మళ్లించారనే ఆరోపణలతో సాయిరెడ్డిని అరెస్టు చేశారు’’ అని వివరించారు. సాక్షులను బెదిరిస్తారనే సాకుతో బెయిల్‌ను అడ్డుకోలేరని, ఇందుకు సంబంధించిన ఆధారాలను తప్పకుండా సీబీఐ చూపాల్సి ఉంటుందని తెలిపారు. 

సాయిరెడ్డి బెదిరించారని ఒక్క సాక్షి అయినా ఫిర్యాదు చేశారా అని ప్రశ్నించారు. దాదాపు 300 గంటలపాటు సీబీఐ విచారణకు హాజరైన సాయిరెడ్డి పారిపోయే అవకాశమే లేదని, బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన పత్రాల్లో సాయిరెడ్డి పాత్రకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని సీబీఐ డిప్యూటీ లీగల్ అడ్వైజర్ బళ్లా రవీంద్రనాథ్ తెలిపారు. జగన్ కంపెనీల్లో డెరైక్టర్‌గా ఉన్నందున ఏజెంట్ హోదాలో సాయిరెడ్డికి ఐపీసీ 409 వర్తిస్తుందని, అందువల్ల చార్జిషీట్ దాఖలు చేసేందుకు తమకు 90 రోజులు గడువు ఉందని నివేదించారు. సాయిరెడ్డికి బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరించడంతోపాటు ఆధారాలను మాయం చేసేందుకు ప్రయత్నిస్తారని ఆరోపించారు. బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి.. తీర్పును ఈనెల 19కి వాయిదా వేశారు. ఇదిలా ఉండగా సాయిరెడ్డి రిమాండ్‌ను కోర్టు ఈనెల 30 వరకు పొడిగించింది. 

కూర్చోని సీబీఐ జేడీ: సాయిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగుతున్న సమయంలో సీబీఐ జాయింట్ డెరైక్టర్ వీవీ లక్ష్మీనారాయణ కోర్టు హాల్ లో నిలబడే ఉన్నారు. న్యాయమూర్తిని చాంబర్‌లో కలవడంతోపాటు కోర్టు హాల్‌లో న్యాయవాదుల కుర్చీలో లక్ష్మీనారాయణ కూర్చోవడం, పీపీలకు సలహాలు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం వాదనలు జరిగిన 50 నిమిషాలసేపు ఆయన నిల్చొనే ఉన్నారు. కక్షిదారులు కూర్చునే స్థానాల్లో కూర్చోవాలని సీబీఐ సిబ్బంది సూచించినా ఆయన వినలేదు. 

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More