రంగారావు బెయిల్‌ను మాత్రం వ్యతిరేకించదా?

నిస్సిగ్గుగా వ్యవహరిస్తోంది
జగన్‌ను అణిచేందుకు సీబీఐని కాంగ్రెస్ అస్త్రంలా వాడుకుంటోంది
ఈ కుట్రలో టీడీపీకి కూడా భాగస్వామ్యం ఉంది
ఎలాంటి ఆధారాల్లేకుండానే సీబీఐ విజయసాయిరెడ్డి, సునీల్‌ను అరెస్టు చేసింది... నిధుల దుర్వినియోగానికి కారకుడైన రంగారావు బెయిల్‌ను మాత్రం వ్యతిరేకించదా?
కోర్టు చెప్పింది ఒకటి.. సీబీఐ దర్యాప్తు చేస్తోంది మరొకటి


హైదరాబాద్, న్యూస్‌లైన్: జగన్ ఆస్తుల వ్యవహారం, ఎమ్మార్ కేసుల దర్యాప్తు విషయంలో సీబీఐ నిస్సిగ్గుగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ కో ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ మండిపడ్డారు. సోమవారమిక్కడ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీబీఐ దర్యాప్తు జరుగుతున్న తీరుపై అభ్యంతరం తెలుపుతూ వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ.. ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు ఫిర్యాదు చేస్తూ రాసిన లేఖ ప్రతులను మీడియాకు విడుదల చేశారు. సీబీఐపై విజయమ్మ గతంలో కూడా ప్రధానికి ఒక లేఖ రాశారని, అయినా దర్యాప్తు జరుపుతున్న తీరు మారకపోవడంతో మరోసారి లేఖ రాశారని వివరించారు. 

జగన్‌మోహన్‌రెడ్డికి రోజురోజుకూ పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక ఎలాగైనా ఆయనను అణగదొక్కాలని, రాజకీయంగా లేకుండా చేయాలనే దురుద్దేశంతో సీబీఐని కాంగ్రెస్ ఒక అస్త్రంగా వాడుకుంటోందని దుయ్యబట్టారు. జగన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలో టీడీపీకి కూడా భాగస్వామ్యం ఉందని విమర్శించారు. జగన్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఆడిటర్ విజయసాయిరెడ్డిని, ఎమ్మార్ కేసులో సునీల్‌రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ... అసలు నిధుల దుర్వినియోగానికి కారకుడైన స్టైలిష్‌హోమ్స్ తుమ్మల రంగారావుకు ముందస్తు బెయిలును వ్యతిరేకించకపోవడం సిగ్గుమాలినచర్య అని అన్నారు. జగన్ ఆస్తుల కేసు విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఒకటైతే సీబీఐ దర్యాప్తు జరుపుతున్న తీరు మరోలా ఉందని పేర్కొన్నారు. న్యాయస్థానానికి అందిన ఫిర్యాదులో కూడా ఏడెనిమిది శాఖల్లో అధికార దుర్వినియోగం జరిగిందని, 26 జీవోల జారీలో అవకతవకలు జరిగాయని పేర్కొంటే సీబీఐ అసలు వాటి జోలికే వెళ్లలేదని చెప్పారు.

నార్కో పరీక్షలెందుకు..?

ఇన్ని రోజుల తరబడి విచారణ జరిపిన తరువాత కూడా ఆడిటర్ విజయసాయిరెడ్డిని నార్కో అనాలసిస్ పరీక్షలకు అనుమతించాలని సీబీఐ కోరడం చూస్తే వారి వద్ద ఎలాంటి రుజువులు లేవన్న సంగతి స్పష్టమవుతోందని కొణతాల అన్నారు. రంగారావు విచారణకు సహకరిస్తున్నందున బెయిల్ ఇవ్వొచ్చని సీబీఐ అభిప్రాయపడినపుడు.. మిగతా వాళ్లకు కూడా అదే ఎందుకు వర్తించదని ప్రశ్నించారు. తాము ఎవరికి వ్యతిరేకంగా వాగ్మూలం ఇమ్మంటే వారి పేర్లు చెబుతున్నారు కనుకనే సీబీఐ.. రంగారావుకు బెయిల్ రావడానికి సహకరిస్తున్నట్లుగా ఉందన్నారు. పోలీసులు ఎవరి పేరు చెప్పమంటే.. బంగారం దొంగలు ఎలాగైతే వారి పేర్లు చెబుతారో ప్రస్తుతం సీబీఐ-రంగారావు వ్యవహారం కూడా అలాగే ఉందని వివరించారు. రంగారావును అడ్డం పెట్టుకుని తమకు ఎవరి పేరు కావాలో వారి పేర్లను చెప్పిస్తోంద ని సీబీఐ తీరును ఎండగట్టారు. జగన్‌ను సీబీఐ అరెస్టు చేస్తుందని భావిస్తున్నారా అని ప్రశ్నించగా... ‘‘ఆయనను అరెస్టు చేయాల్సినంత పరిస్థితులైతే లేవు, కానీ రాజకీయంగా వారు చేయాలనుకుంటే మేమేం చేయగలం..’’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జగన్‌కు ప్రజాదరణ పెరుగుతున్నందునే ప్రభుత్వం స్థానిక ఎన్నికలు సహా అన్ని ఎన్నికలకు వెనుకాడుతోందన్నారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More