బాలయ్యా.. విగ్గు తీసి ముగ్గులోకి రా..

‘‘ఎమ్మార్ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు మొదట్నుంచి వక్రమార్గంలోనే నడుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, అతని బంధువులే టార్గెట్‌గా విచారణలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎమ్మార్‌కు 2002లో 535 ఎకరాలను ఎకరా రూ.29 లక్షల రూపాయల చొప్పున టీడీపీ అధినేత చంద్రబాబు రాసిచ్చినా పట్టించుకోరేం? ఎమ్మార్ కేసులో చంద్రబాబు పాత్రపై విచారణ జరపాలని ఒక స్వాతంత్య్ర సమరయోధుడు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం సీబీఐకి తెలియదా? ఏపీఐఐసీ వాటా తగ్గింపులో బాబు వ్యవహారం దానికి పట్టదా? ఇవన్నీ వదిలేసి జగన్, ఆయన కుటుంబ సభ్యులను వేధించడమే ధ్యేయంగా సీబీఐ పనిచేస్తోంది’’అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. 

మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ జగన్, ఆయన బంధువులే లక్ష్యంగా సీబీఐ చేస్తున్న వరుస విచారణల్ని గుర్తుచేశారు. తాజాగా ఇదే విషయంలో జగన్ బంధువు సునీల్‌రెడ్డిని సీబీఐ విచారించిన సందర్భాన్ని ప్రస్తావించారు. బాబు హయాంలో జరిగిన భూముల పంపకాల అవినీతిని సీబీఐ కన్నెత్తి చూడకపోవడం బాధాకర మన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇదే విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత రోశయ్య నాయకత్వాన శాసనసభా కమిటీ నియమించారని.. వాస్తవాల్ని తెలుసుకునేందుకు ఆయన్ను కూడా పిలిపించాలి కదా..? అంటూ గుర్తు చేశారు. దేశంలో ప్రతిష్టాత్మక విచారణ సంస్థగా ఉన్న సీబీఐ న్యాయమైన పద్ధతిలో విచారణ చేయాలని ప్రజలంతా కోరుతున్నట్లు అంబటి చెప్పారు. 

బాలయ్యా.. విగ్గు తీసి ముగ్గులోకి రా..
‘‘సినిమా హీరో బాలకృష్ణ ఈ మధ్య రోడ్లెక్కి తొడలు కొడుతున్నారు. ఇంతకాలం ఎందుకని కొట్టలేదో.. ఇప్పుడే ఎందుకని కొట్టుకుంటున్నాడో.. అతనికే తెలియాల్సిఉంది..’’ అంటూ అంబటి ఆశ్చర్యం వ్యక్తంచేశారు. చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రైతుపోరుబాట అనుకున్నంత మీటరు తిరగక.. మైలేజీ రాలేదని విమర్శించారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ వద్ద బాబు పోరుతూ ఉన్నందువల్లే నేడు అతను రోడ్లెక్కి తొడలు చరుచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ‘‘నిజానికి దివంగత ఎన్టీ రామారావు బతికున్నరోజుల్లో ఆయన్ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచినప్పుడో.. వైశ్రాయ్ హోటల్లో ఆ మహానుభావునిపై చెప్పులేసినప్పుడో బాలకృష్ణ తొడలు చరచాల్సి ఉంది. బావ బాబుపైనే మీసం మెలేసి ఉన్నట్లైతే, నందమూరి వంశం పరువు మరింతగా ఇనుమడించి ఉండేది..’’ అంటూ నేరుగా బాలకృష్ణకు చురకలంటించారు. 

విగ్గులు పెట్టుకుని తొడలు కొట్టడం, పెట్టుడు మీసాల్ని మెలేయడం వంటి సంస్కృతి రాజకీయాల్లో మంచిది కాదని హితవుపలికారు. ఒకవైపే చూడండి.. రెండోవైపు చూడొద్దంటూ చెప్పేముందు తలమీద విగ్గుతీసి, పెట్టుడుమీసం తీసి ముగ్గులోకి దిగాలని సూచించారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ గురించి ఎవరూ తప్పుగా మాట్లాడటం లేదని, బావ బాబు గురించి ప్రజలనుకునే విమర్శల్ని పట్టించుకోవాలని బాలకృష్ణకు గుర్తుచేశారు. చంద్రబాబు టీడీపీలో ఔట్‌డేటెడ్ నేత అయ్యారని, తాజాగా బాలకృష్ణతో ఆ పార్టీ జవసత్వాలు పుంజుకుంటుందని అనుకోవడం భ్రమేనని వ్యాఖ్యానించారు. 

చిరంజీవి, బాలకృష్ణలు సవాళ్లెందుకు విసురుకుంటున్నారో ఎవరికీ అర్థం కావడంలేదన్నారు. కేవలం అభిమానులు, సామాన్య కార్యకర్తల మధ్య చిచ్చురగిల్చేందుకు ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో వారిద్దరూ పోటీచేసే ప్రాంతాన్ని స్పష్టం చేస్తే.. అదేచోట వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక సామాన్య కార్యకర్తను నిల్చొబెట్టినా గెలుస్తాడని.. ఇద్దరికీ డిపాజిట్లు గల్లంతవుతాయని సవాల్ విసిరారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఈనాడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై పిచ్చిపట్టినట్లు చెత్తగా మాట్లాడుతున్నారని.. ఆయన్ను చెత్తబాబు, పోటుబాబు, దోపిడీ బాబుగా గుర్తించాలని కోరారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More