ముందుగా చేరుకున్నది.. తోకపత్రికకు చెందిన చానల్ ప్రతినిధే


సునీల్‌రెడ్డిని అరెస్టు చేయగానే.. ముందే వేసుకున్న పథకం ప్రకారం రామోజీరావు పత్రిక ‘ఈనాడు’ బుధవారం బరితెగించేసింది. ‘సాక్షి’ ప్రారంభోత్సవం సందర్భంగా సునీల్‌తో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతున్న ఫొటో తీసుకుని.. ఎమ్మార్ విల్లాలకు చెందిన రూ.70 కోట్లు సునీల్ ద్వారా చేతులు మారాయంటూ.. కోనేరు ప్రసాద్ చెప్పినట్టుగా తనకు తెలిసిపోయిందంటూ.. నిస్సిగ్గుగా ఒక రోత కథనాన్ని వండేసింది. పెపైచ్చు తనదైన అడ్డగోలు శైలిలో.. సునీల్ అరెస్టు ద్వారా ఓబుళాపురం మైనింగ్ కంపెనీ, ‘సాక్షి’లోకి పెట్టుబడులు, ఎమ్మార్ కేసు మూడింటి దర్యాప్తుల్లోనూ సీబీఐ పెద్ద ముందడుగు వేసినట్టు రాసిపారేసింది. 

అసలు ఒకదానికొకటి ఏమైనా పొంతన ఉందా? ఏ కొంచెమైనా సంబంధముందా? బంధువుల్ని, నమ్మిన వారిని, డిపాజిటర్లను అందరినీ మోసం చేసి.. పెపైచ్చు కోర్టుల్లో లిటిగేషన్లు వేస్తూ... తనకు తోచిన మార్గాల్లో కలాన్ని అడ్డం పెట్టుకుని అడ్డంగా ముందుకెళ్తున్న రామోజీ పత్రిక... దిగజారటానికి ఇక హద్దన్నదే లేదన్నట్టుగా ఇలా చెలరేగిపోతుండటాన్ని ఏమనుకోవాలి? రిలయన్స్ రహస్య పెట్టుబడులపై ఎన్ని ఆరోపణలొచ్చినా.. నాలుగేళ్లపాటు మానాభిమానాలన్నీ వదులుకుని.. మౌనాన్ని మించిన మందు లేదన్నట్లుగా ఊరుకుని.. ఆఖరికి రిలయన్స్‌కు షేర్లు బదలాయించేసినట్టుగా ఒక దొంగ ఒప్పందాన్ని బయటపెట్టిన రామోజీకి.. ఇలా ఎదుటి వారిపై తోచిన ఆరోపణలు చేసే నైతిక హక్కు ఎక్కడుంది? 

ఈ మూడు కేసుల్లోనూ ఎలాగైనా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఇరికించాలని ఎల్లో సిండికేట్ ఎంతగా తపించిపోతోందో చెప్పటానికి ఇంతకన్నా ఆధారాలు ఇంకేం కావాలి? అన్ని కేసుల్నీ అటు తిప్పీ ఇటు తిప్పీ వైఎస్సార్ కుటుంబానికి, సన్నిహితులకు, ఆయన వారసుడికి చుట్టడానికి దర్యాప్తు సంస్థతో కలిసి ఎల్లో సిండికేట్, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు ఎంతలా పతనమైపోతున్నదీ దీన్ని చూస్తే తెలియడం లేదా? మామూలుగా అయితే దర్యాప్తు సంస్థలు తాము చెప్పని విషయాల్ని ఏ మీడియా ప్రచురించినా.. వాటిలో నిజానిజాల్ని తెలియజేస్తూ వివరణ ఇస్తుంటాయి. సీబీఐ కూడా దేశంలోని మిగతా రాష్ట్రాల్లో, మిగతా కేసుల్లో ఇలాగే చేస్తోంది. సీబీఐ వెబ్‌సైట్ చూసినా ఈ విషయం తెలిసిపోతుంది. కానీ రాష్ట్రంలో.. పైన పేర్కొన్న మూడు కేసులకూ సంబంధించి మాత్రం ఎల్లో మీడియా ఎంతలా శివాలెత్తిపోతున్నా సీబీఐ స్పందించటమే లేదు. 

సీబీఐ అది చేయబోతోందని, ఇది చేయబోతోందని, ఫలానా వారిని అరెస్టు చేయబోతోందని ఏకంగా సీబీఐ వర్గాలనే ఉటంకిస్తూ సదరు మీడియా ఇష్టారాజ్యంగా ప్రసారాలు చేస్తున్నా, వార్తలు ప్రచురిస్తున్నా కిమ్మనటం లేదు. నిజానికవి సీబీఐ అధికారికంగా చెప్పిన విషయాలే అయితే మీడియాలో అంతటా రావాలి. ‘సాక్షి’ ప్రతినిధి కూడా అందరిలానే సీబీఐ వ్యవహారాల్ని ఫాలో అవుతుంటారు. అధికారుల్ని కలుస్తుంటారు. కానీ, ఎవరికీ తెలియని అంశాలు, ఎల్లో ముద్ర వేసుకున్న ఆ మీడియాకు మాత్రమే తెలుస్తుండటమే.. పైగా సదరు మీడియా రాసిన తరవాత, ఆ ‘కథనాల’ ప్రకారమే సీబీఐ తు.చ. తప్పకుండా పని చేసుకుపోతుండటమే.. ఇక్కడ కుట్రను బహిరంగంగా బయటపెడుతున్న అంశం. 

ఉదాహరణకు.. విజయసాయిరెడ్డికి నార్కో అనాలిసిస్ పరీక్షలు చేయాలని సీబీఐ భావిస్తోందని, దానికోసం పిటిషన్ కూడా వేయొచ్చని కొద్దిరోజుల కిందట ఓ తోకపత్రిక రాసింది. ఇవాళ (బుధవారం) సీబీఐ చేసిన పని సరిగ్గా అదే! సునీల్‌రెడ్డి అరెస్టు సందర్భంగా అక్కడికి సీబీఐ అధికారుల కన్నా ముందుగా చేరుకున్నది.. తోకపత్రికకు చెందిన చానల్ ప్రతినిధే. ఆ తరవాత రెండో పత్రిక ప్రతినిధి కూడా వచ్చేశారు. దర్యాప్తును ఎల్లో బాబులు ఏ స్థాయిలో నడిపిస్తున్నారనేది దీన్ని బట్టే స్పష్టం కావడం లేదా?!

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More