బాబు దోపిడీని జనం మర్చిపోలేదు

టీడీపీ అధినేతపై వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ధ్వజం
ఏలేరు కుంభకోణంపై జస్టిస్ సోమశేఖర కమిషన్ విచారణ చేపట్టలేదా? 
మద్యం కుంభకోణంపై విజిలెన్స్ నివేదికతో విచారణ మొదలుకాలేదా? 
ఆ కేసుల్లో విచారణలు సాగకుండా కోర్టులకు వెళ్లి అడ్డుకోవటం నిజం కాదా? 
ఆపద్ధర్మ సీఎంగా ఊరూ పేరూ లేని సంస్థకు 2 వేల ఎకరాలు కట్టబెట్టలేదా 
బాబు ‘కొలాబరేషన్’ వల్లే ఎంజీఎఫ్ కుంభకోణం జరిగిందని విజిలెన్స్ తేల్చలేదా? 

హైదరాబాద్, న్యూస్‌లైన్: తొమ్మిదేళ్ల పాటు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుతిన్న నీచమైన చరిత్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుదని.. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఎక్కడా విచారణలు జరగకుండా అన్ని కోర్టులకూ వెళ్లి లిటిగేషన్‌లతో స్టేలు తెచ్చుకున్న ఘనత ఆయనదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ దుయ్యబట్టారు. చంద్రబాబు అవినీతిపై ఎలాంటి ఆరోపణలూ రాలేదని, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ఎక్కడా ఫిర్యాదు చేయకుండానే నేరుగా హైకోర్టుకు వెళ్లారని, తమ అధినేతకు కోర్టులు క్లీన్‌చిట్ ఇచ్చాయని ఎర్రన్నాయుడు వంటి టీడీపీ నాయకులు గోబెల్స్ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో.. కృష్ణదాస్ తీవ్రంగా స్పందించారు. 

‘‘ఏలేరు కుంభకోణంలో చంద్రబాబు అవినీతి బాగోతంపై ఆరోపణలు వస్తేనే కదా దానిపై జస్టిస్ సోమశేఖర్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది? మద్యం తయారీ సంస్థలకు చంద్రబాబు ప్రభుత్వం నిబంధలనకు విరుద్ధంగా రూ. 550 కోట్ల మేర అధికంగా చెల్లింపులు జరిపినట్లు వచ్చిన విజిలెన్స్ నివేదిక ఆధారంగానే కదా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కోర్టు 2003 డిసెంబర్ 12వ తేదీన విచారణకు ఆదేశించింది?’’ అని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు.

‘‘ఏలేరు కుంభకోణం నిగ్గు తేల్చటానికి సోమశేఖర కమిషన్ నిష్పాక్షికంగా విచారణ జరుపుతుండటం చూసి భయంతో వణికిపోయిన చంద్రబాబు.. ఆ కేసులో నిందితుని ద్వారానే హైకోర్టులో కేసు వేయించి స్టే తెప్పించుకోవటం నిజం కాదా? మద్యం చెల్లింపుల కుంభకోణంపై విచారణలో వాస్తవాలు బయటకు వస్తే తన దోపిడీ బయట పడుతుందని వణికిపోయిన చంద్రబాబు తన మంత్రివర్గంలోని సభ్యుడు తుమ్మల నాగేశ్వరరావు చేత హైకోర్టులో పిటిషన్ వేయించి స్టే తెచ్చుకోవటం నిజం కాదా? ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ మంత్రివర్గం అనుమతి లేకుండా ఐఎంజీ భారత అనే ఊరూ పేరూ లేని సంస్థకు రెండు వేల ఎకరాల భూమి కట్టబెట్టిన ఘనత చంద్రబాబుది. దీనిపై న్యాయస్థానాల్లో కేసులు కూడా దాఖలవటం వాస్తవం కాదా? తన బినామీ కోనేరు ప్రసాద్ కోసమే ఏ ప్రజా ప్రయోజనం లేకుండా ఎమ్మార్‌కు 535 ఎకరాలు కేటాయించిన ఘనుడు చంద్రబాబు. 

నాడు చంద్రబాబు చేసుకున్న కొలాబరేషన్ ఒప్పందం ఆధారంగానే ఎంజీఎఫ్ అనే సంస్థ ఏర్పడిందని, దాని ఫలితంగానే ఎమ్మార్ కుంభకోణం చోటు చేసుకున్నదని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తన నివేదికలో కూడా తేల్చి చెప్పటం నిజం కాదా? తొమ్మిదేళ్ల పాలనలో చోటు చేసుకున్న కుంభకోణాలపై నాటి ప్రతిపక్ష కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ వంటి పార్టీలు పదుల సార్లు నాటి గవర్నర్లను కలిసి ఫిర్యాదు చేశాయి. అన్ని కేసుల్లో చంద్రబాబు న్యాయస్థానాలకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఏ కేసులోనూ పూర్తి స్థాయి విచారణ జరగకుండా అడ్డుకున్నారు. ఇంతటి నీచమైన చరిత్ర సొంతం చేసుకున్న చంద్రబాబు నిర్దోషి అంటూ కోర్టులు క్లీన్‌చిట్ ఇచ్చాయని.. చంద్రబాబు, ఆయన భజన బృందం ఎప్పటిలాగే గోబెల్స్ ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి’’ అని ఆయన ధ్వజమెత్తారు. గురివింద తన నలుపు ఎరుగదన్నట్లు టీడీపీ నేత ఎర్రన్నాయుడు.. తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మపై నోరు పారేసుకోవటం తగదని హితవు పలికారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More