విద్యుత్ చార్జీలు పెంచితే రాష్ట్రాన్ని స్తంభింపజేస్తాం!


విద్యుత్ చార్జీలను పెంచితే ప్రజాందోళనలతో రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ హెచ్చరించారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర నాయకుడు బి.శివకుమార్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి విధానాలతో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని పాలిస్తున్న ప్రభుత్వం ఆయన విధానాలకు పూర్తి విరుద్ధంగా నడుచుకుంటోందని విమర్శించారు. రాష్ట్రంలో ఇంకా వేసవి రాకముందే డిసెంబర్ నుంచే గంటల తరబడి విద్యుత్ కోతలు విధించడం, చార్జీలు పెంచడం, ఇంధన సర్‌చార్జీ సర్దుబాట్లు పేరిట భారం వేయడం చూస్తూంటే చంద్రబాబునాయుడు పరిపాలనను తలపిస్తోందని దుయ్యబట్టారు. 

ఏడేళ్లనాటి శనిలాగా చంద్రబాబు హయాంలో వరుస కరువులు, విద్యుత్ కోతలు, విద్యుత్ ఛార్జీల పెంపుతో రాష్ట్ర ప్రజలు నరకం చూశారనీ ఇపుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో కూడా అదే జరుగుతోందని ధ్వజమెత్తారు. సామాన్యులు, రైతులపై రూ.5,500 కోట్ల విద్యుత్ చార్జీల భారం మోపుతూ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ముందు ప్రభుత్వం ప్రతిపాదనలు ఉంచిందనీ, వెంటనే వాటిని ఉపసంహరించుకోకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదనీ హెచ్చరించారు. విద్యుత్ చార్జీలు పెంచేది లేదని చెప్పి వైఎస్సార్ రెండోసారి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారని గుర్తు చేశారు. 2009 ఎన్నికల సందర్భంగా వ్యవసాయరంగానికి తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేస్తామని వైఎస్సార్ ప్రధానంగా చెప్పారనీ, ఆ హామీని కిరణ్ తుంగలో తొక్కారని విమర్శించారు. 

స్పీకర్ ధృతరాష్ట్రుడు

తన కళ్లెదుటే అసెంబ్లీలో 17 మంది ఎమ్మెల్యేలు విప్‌ను ఉల్లంఘించి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓట్లు వేసినా చూడలేని స్థితిలో స్పీకర్ ఉన్నారనీ... దర్యాప్తులు, వివరణల పేరుతో జాప్యం చేస్తున్నారని బాజిరెడ్డి తప్పుబట్టారు. ఈ స్థానాల్లో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోతుందనే భయంతోనే అనర్హత వేటు వేయడం లేదని విమర్శించారు. స్పీకర్ కూడా కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్లు నడుచుకోవాల్సిన దుస్థితి దాపురించిందని దుయ్యబట్టారు. 

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More