కష్టాలు యథాతథం..లెక్కల్లోనే ‘ఆనం’దం

వచ్చే ఏడాది.. అంటే 2012-13 విద్యాసంవత్సరానికిగాను ఫీజు రీయిం బర్స్‌మెంట్ పథకానికి రూ.7,600 కోట్లు (బకాయిలు, అవసరాలు కలుపుకొని) కావాలి. కానీ బడ్జెట్‌లో ఈ పథకానికి కేటాయించింది కేవలం రూ.3,620 కోట్లు. అంటే కావాల్సిన బడ్జెట్‌లో సగం నిధులు కూడా ఇవ్వలేదన్నమాట! ఇప్పుడిచ్చిన డబ్బులన్నీ బకాయిలకే పోతే.. మరి వచ్చే ఏడాది పథకం నడిచేదెట్టా? ప్రతిఏటా పథకానికి కేటాయిస్తున్న నిధులు అంతకుముందు ఏడాది బకాయిలకే సరిపోతే చదువులు సాగేదెట్టా? 2012-13కిగాను ఈబీసీ విద్యార్థులను కేవలం ట్యూషన్ ఫీజులకే పరిమితం చేశారు. స్కాలర్‌షిప్‌ల కింద వారికి ఒక్క పైసా కూడా కేటాయించలేదు. 


ధరల దరువుకు కళ్లెమేదీ..?
నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశంలో చేరి సామాన్యులు విలవిల్లాడుతున్నారు. ఏ వస్తువు ధర చూసినా రెండేళ్లలో 75 నుంచి వంద శాతం పెరిగాయి. రూపాయికే కిలో బియ్యం ఇస్తున్నామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నా... అవి తినేందుకు ఏ మాత్రం పనికిరావ డం లేదు. ధరల నియంత్రణకు ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో ఎలాంటి పరిష్కారం చూపలేదు.


ప్రాజెక్టులు కదిలేదెలా..? 

నీటి ప్రాజెక్టులు నిర్మించకపోతే భవిష్యత్ తరాలు క్షమించవంటూ అత్యంత సాహసోపేతంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన ప్రాజెక్టులకు అత్తెసరు ప్రాధాన్యం ఇచ్చారు. 2011-12 ఆర్థిక సంవత్సరంలో రూ.15,010 కోట్లు కేటాయిస్తే ఈ సారి కేవలం రూ.3 కోట్లు మాత్రమే పెంచి రూ.15013 కోట్లు చేశారు. ఈ లెక్కన ప్రాజెక్టుల నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో మరి! వైఎస్సార్ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఏటా 10 నుంచి 15 శాతం బడ్జెట్ పెంచితే కిరణ్ సర్కార్ కేవలం రూ.3 కోట్లు పెంచి చేతులు దులుపుకుంది!

గతుకుల ప్రయాణమే..!

పట్టణం, పల్లె తేడా లేకుండా రాష్ట్రంలో రహదారుల పరిస్థితి దారుణంగా ఉంది. అయినా ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో పరిష్కారం చూపలేదు. ఆర్ అండ్ బీ లెక్కల ప్రకారమే 6,500 కిలోమీటర్ల రహదారులు గతుకులమయమయ్యాయి. 2,500 కి.మీ. రహదారులు దెబ్బతిన్నాయి. వాటి మరమ్మతులకు ఇప్పటికిప్పుడు రూ.6 వేల కోట్లు కావాలి. కానీ బడ్జెట్‌లో కేవలం రూ.3,210 కోట్లు కేటాయించి మమ అనిపించారు.

సర్కారుకు పట్టని నేతన్న గోడు

గతేడాది నుంచి ఇప్పటిదాకా 80 మంది నేత కార్మికులు బలవన్మరణాలకు పాల్పడినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు. దివంగత నేత వైఎస్ ప్రకటించిన రుణ మాఫీ పథకం నేటికి అమలు కాలేదు. నాడు వైఎస్సార్ రూ.312 కోట్లు రుణ మాఫీ ప్రకటిస్తే ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా ఖర్చు చేసింది కేవలం రూ.109 కోట్లు. ఆదుకుంటామంటూ ఆశలు చూపించడమే తప్ప ఆచరణలో వారిని ఆదుకునే ప్రయత్నమే చేయలేదు.

ముందుంది కోతల కాలమే..

రాష్ట్ర చ రిత్రలో ఎన్నడూ లేని విధంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కరెంటు కోతలు అమలు చేస్తున్నారు. ఇక పరిశ్రమలకు విద్యుత్ సరఫరాలో అన్నీ ఆంక్షలే. చార్జీల రూపంలో ఒకవైపు, సర్దుబాటు చార్జీల రూపంలో మరోవైపు జనంపై సుమారు రూ.10 వేల కోట్ల భారం మోపిన ప్రభుత్వం.. విద్యుత్ రంగానికి మొక్కుబడిగా నిధులు కేటాయించింది.

అన్నదాతపై చిన్నచూపు..

ఎన్నడూ లేని విధంగా అన్నదాతలు క్రాప్ హాలిడే ప్రకటించిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. గిట్టుబాటు ధర లేక వ్యవసాయం మానేసిన రైతన్నలకు ధైర్యం చెప్పే యత్నం చేయలేదు. వారిని ఆదుకుని, గిట్టుబాటు ధరలు కల్పిస్తామనే హామీకి కూడా బడ్జెట్‌లో చోటు దక్కలేదు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More