వరుస కుంభకోణాలు... ఎన్నికల్లో ఓటములు...


యూపీఏ మెడకు భారీ బొగ్గు కుంభకోణం
ఖజానాకు రూ. 10.7 లక్షల కోట్ల మేర నష్టం
వేలం లేకుండానే 100 సంస్థలకు 155 బ్లాకుల కేటాయింపు
కాగ్ పేర్కొన్నట్లు ఓ పత్రిక కథనం
పార్లమెంటులో విపక్షాల ఆందోళన
అది తుది నివేదిక కాదంటూ ప్రధానికి కాగ్ లేఖ

వరుస కుంభకోణాలు... ఎన్నికల్లో ఓటములు... మిత్రపక్షాల బెదిరింపులతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం నెత్తిన మరో అవినీతి పిడుగు పడింది! 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులో జరిగిన కుంభకోణాన్ని నిగ్గుతేల్చిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజాగా మరో భారీ కుంభకోణాన్ని బయటపెట్టింది!! 2004 నుంచి 2009 మధ్య ప్రభుత్వం 155 బొగ్గు బ్లాకులను వేలం వేయకుండానే 100 ప్రైవేటు, ప్రభుత్వరంగ కంపెనీలకు కేటాయించిందని వెల్లడించింది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.10.67 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని తన ముసాయిదా నివేదికలో అంచనా వేసింది. ఇది 2జీ నష్టమైన రూ. 1.76 లక్షల కోట్లకన్నా 6 రెట్లు అధికమని పేర్కొంది. ఈ మేరకు ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని ప్రచురించింది. అయితే దీనిపై పార్లమెంటు ఉభయసభల్లో విపక్షాలు ఆందోళనకు దిగిన నేపథ్యంలో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. ఈ విషయంలో ప్రభుత్వానికి ఊరట కలిగిస్తూ కాగ్ వినోద్‌రాయ్ ప్రధానికి లేఖ రాశారు. మీడియాకు లీకైనది తుది నివేదిక కాదంటూ చెప్పుకొచ్చారు.

నివేదికలో ఏముందంటే...

ప్రభుత్వ ఉదాశీనత వల్ల బొగ్గు బ్లాకులు పొందిన కంపెనీలు నాటి ధరలతో పోలిస్తే 2011 మార్చి 31 నాటికి మొత్తం రూ. 6.31 లక్షల కోట్ల అనూహ్య లాభం పొందినట్లు వివరించింది. ఇందులో ప్రభుత్వరంగ సంస్థలు రూ.3.37 లక్షల కోట్లు, ప్రైవేటు సంస్థలు రూ.2.94 లక్షల కోట్ల మేర లాభపడ్డాయని తెలిపింది. ప్రస్తుత ధరలతో పోల్చి చూస్తే ఈ మొత్తం రూ.10.67 లక్షల కోట్లవుతుందంది. దీని ప్రకారం పీఎస్‌యూలు రూ.5.88 లక్షల కోట్లు, ప్రైవేటు సంస్థలు 4.79 లక్షల కోట్ల మేరకు అనూహ్య లాభం పొందినట్లు తేలిందని పేర్కొంది. కోల్ ఇండియా లిమిటెడ్ సరఫరా చేసిన బొగ్గు ధరకు...బొగ్గు బ్లాకుల ద్వారా ఆ సంస్థకు అయిన బొగ్గు ఉత్పత్తి వ్యయానికి మధ్య భారీ తేడా ఉన్నట్లు జూన్ 2004లో బొగ్గు శాఖ తన సమాధానంలో పేర్కొంది. కాగా, ప్రభుత్వ చర్యల వల్ల తామేమీ అనూహ్య లాభం పొందలేదని ఎన్‌టీపీసీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ అరూప్‌రాయ్ చౌధురి పేర్కొన్నారు.

దద్దరిల్లిన పార్లమెంటు

బొగ్గు బ్లాకుల కుంభకోణంపై పార్లమెంటు ఉభయసభలు గురువారం దద్దరిల్లాయి. లోక్‌సభ, రాజ్యసభల్లో కార్యకలాపాలను విపక్షాలు మధ్యాహ్నం వరకూ స్తంభింపజేశాయి. లోక్‌సభలో ప్రశ్నోత్తరాలు మొదలవగానే బీజేపీ, జేడీయూ సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో వెల్‌లోకి దూసుకెళ్లారు. రాజ్యసభలోనూ అదే పరిస్థితి నెలకొనడంతో ఉభయసభలూ మధ్యాహ్నానికి వాయిదాపడ్డాయి. దీనిపై సీబీఐ దర్యాప్తుకు బీజేపీ డిమాండ్ చేసింది. బొగ్గుశాఖను కొంతకాలం అట్టిపెట్టుకున్న మన్మోహన్ దీనిపై వివరణ ఇవ్వాలని బీజేపీ ఎంపీ ప్రకాశ్ జవదేకర్ రాజ్యసభలో పట్టుబట్టారు. కాగ్ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టాలని సీపీఎం డిమాండ్ చేసింది. మరోవైపు, అసలది కాగ్ నివేదికే కాదని కేంద్ర ఆర్థిక మంత్రి, లోక్‌సభా నాయకుడు ప్రణబ్ ముఖర్జీ సభలో వివరణ ఇచ్చారు.

వివరణ అవసరంలేదు: ప్రధాని

కాగ్ నివేదికతో బొగ్గు కుంభకోణం బయటపడిందంటూ మీడియాలో వచ్చిన వార్తలను ప్రధాని మన్మోహన్‌సింగ్ ఖండించారు. ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించలేదని కాగ్ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అందువల్ల నివేదికే లేనప్పుడు దీనిపై తాను పార్లమెంటులో వివరణ ఇవ్వాల్సిన అవసరంలేదని రాష్ర్టపతి భవన్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.

త్వరలో బొగ్గు వేలంపై మార్గదర్శకాలు: జైస్వాల్

బొగ్గు బ్లాకులను వేలం వేసేందుకు తాము దాదాపు సిద్ధమేనని బొగ్గుశాఖ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ గురువారం తెలిపారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు 2 నుంచి 4 నెలల్లో ఖరారవుతాయని చెప్పారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More